పెద్దల దన్నుతో, పదండి!

ABN , First Publish Date - 2021-09-04T05:49:17+05:30 IST

మొన్నటి ఆదివారం నాడు గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకున్నాము. వచ్చే ఫిబ్రవరి 21 నాడు మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ నెల 9వ తేదీన కాళోజీ జయంతి సందర్భంగా....

పెద్దల దన్నుతో, పదండి!

మొన్నటి ఆదివారం నాడు గిడుగు రామమూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకున్నాము. వచ్చే ఫిబ్రవరి 21 నాడు మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ నెల 9వ తేదీన కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోబోతున్నాము. తల్లిభాష గురించి స్మరించుకోవడానికి, దాని క్షేమానికి, వృద్ధికి చేయవలసిన కార్యాల గురించి సంకల్పాలు చెప్పుకుంటున్నాము. తెలుగుభాషను దానిలోని ప్రాంతీయ రూపాలతో సహా కాపాడుకోవలసి ఉన్నది. వివిధ సామాజిక, ప్రాంతీయ ప్రజాశ్రేణుల పదజాలమూ పలుకుబళ్లూ అన్నీ తెలుగు భాషలో తగిన ప్రాధాన్యంతో అంతర్భాగంగా వినియోగంలోకి రావాలి. ఉత్సవాల సందర్భంగా మాట్లాడుకుని, ఆ తరువాత మరచిపోతే ఉపయోగం లేదు. 


అయితే, ఈ సారి తెలుగు కోసం వ్యక్తమైన తపనలలో గట్టి దీక్షాభావం కూడా కనిపించింది. దానికితోడు తెలుగుకు పెద్ద అండాదండా కూడా లభించాయి. భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, తెలుగు సముద్ధరణకు పదహారు అంశాల ప్రణాళికను ప్రతిపాదించారు. తెలుగుకు ఆధునికమైన హంగులు, సాంకేతిక సామర్థ్యాలు పెంచాలన్నారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన చేయడంతో పాటు, శాస్త్రగ్రంథాలు తెలుగులో తేవడానికి ప్రయత్నించాలన్నారు. పరిపాలనాభాషగా తెలుగు అమలు గురించి నొక్కిచెప్పారు. మరో విశిష్ట వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, తెలుగు కోసం ఉద్యమించవలసిన అవసరాన్ని గుర్తుచేశారు. తెలుగు మాధ్యమంలో చదువుకుని ఉన్నతస్థానాలకు వెళ్లిన తనను దృష్టాంతంగా తీసుకోవచ్చునన్నారు. మాతృభాషలో చదువు హృదయానికి చేరుతుందన్నారు. ఆంగ్లాన్ని త్యజించనక్కరలేకుండానే తెలుగును ప్రేమించవచ్చునన్నారు. గొప్పవారు మాత్రమే కాదు, పెద్ద అధికారస్థానాలలో ఉన్న ఇద్దరు తెలుగు గురించి ఇంతగా పట్టించుకుంటున్నపుడు, ఎందుకు ఆచరణలో అడుగులు ముందుకు పడవు? 


ఈ ప్రశ్నే వేసుకుని, తెలుగు ఉద్యమంలో ఉన్నవారందరూ కలసి ఒక ఆచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. తెలుగు విషయంలో నిర్ణయాత్మకమైన అడుగు, కీలకమైన మలుపు సాధించేలా ఈ ప్రయత్నం ముందుకు వెళ్లాలి. ఆచరణాత్మక సూచనలు అందించిన ఉపరాష్ట్రపతి, గతంలో గిడుగు చేసిన పనిని ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వం, పత్రికలు కలసికట్టుగా చేయాలన్నారు. ఇది కూడా ప్రధానన్యాయమూర్తి చేసిన ఉద్యమ ప్రబోధం వంటిదే. తెలుగు భాష మనుగడతో ముడిపడిన సమస్త రంగాల ప్రతినిధులు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. భాష మీద ప్రేమ, మమకారం ఉండవలసినవే. కానీ, భాష అవసరం సమాజానికి ఆవశ్యకమైనప్పుడే అది సహజంగా బతుకుతుంది. లేకపోతే, ఉత్సవాలలో మాత్రమే మిగులుతుంది. తెలుగు భాషాభిమానులు వాస్తవికమైన, ఆచరణాత్మకమైన ప్రణాళికతో ముందుకు వెళ్లి, పెద్దల అండదండలను కలుపుకుని విజయం సాధించవలసి ఉన్నది. 


విద్యాబోధన అంతా తెలుగు మాధ్యమంలో సాగాలన్న ఆకాంక్షకు ఇప్పుడు చెల్లుబాటు లేదు. వృత్తివిద్యాకోర్సులను తెలుగు మాధ్యమంలో బోధించాలన్న కేంద్ర ఆదేశాలను నెరవేర్చగలిగే స్థితిలో తెలుగు రాష్ట్రాలు లేవు. పాఠ్యపుస్తకాలు కానీ, బోధకులు కానీ లేరు. పట్టభద్ర తరగతుల దాకా తెలుగును తప్పనిసరి విషయంగా చేయాలన్న డిమాండ్‌ను గట్టిగా ముందుకు తీసుకువెళ్లవచ్చు. ఈ విషయంలో ఇంగ్లీషే కాకుండా సంస్కృతం కూడా తెలుగుకు అడ్డుపడుతున్నది. ఇంటర్మీడియేట్, డిగ్రీ తరగతులలో సంస్కృతాన్ని రెండో భాషగా తీసుకోవడానికి విద్యార్థులను పురిగొల్పుతున్నది, ఆ భాష మీద ఉన్న అభిమానం అని ఎవరూ అనుకోరు. పరీక్ష రాయడంలోను, మూల్యాంకనంలోనూ ఉన్న సానుకూలతల కారణంగానే సంస్కృతాన్ని ఎంచుకుంటున్నారు. ఆ సానుకూలతలను తెలుగుకు ఎందుకు కల్పించకూడదు? తెలుగును ఒక అంశంగా బోధించడం తప్పనిసరి చేస్తాము అన్న ప్రభుత్వాలు కూడా, ఆచరణలో ఆ విషయమై పట్టింపుతో ఉండడం లేదు. భాష విషయంలో పాలకులు జవాబుదారీగా ఉండేట్టు చేయాలి. 


మాధ్యమంగా తెలుగు అంటే, ఇంగ్లీషు మీడియం ద్వారా ఉపాధి లభిస్తుందన్న అభిప్రాయం కారణంగా, ప్రజలలో కూడా సానుకూలత ఉండడం లేదు. మరి పాలనాభాషగా తెలుగును అమలుచేయడానికి ప్రభుత్వాలకు ఏమిటి వ్యతిరేకత? ఆ విషయం అడగడానికి ప్రజలకు ఎందుకు సంకోచం? పరిపాలన అన్ని స్థాయిలలోను తెలుగు వాడకాన్ని పెంచే ప్రయత్నం ఎందుకు చేయరు? ఐదు దశాబ్దాల నుంచి అధికార భాషా సంఘాలు ఏమి చేశాయి? ఓట్లు, ఆదాయాలు లేని పని కాబట్టే కదా, నాయకులకు ఈ విషయం మీద అలక్ష్యం? హైకోర్టు స్థాయి దాకా న్యాయపాలనలో కూడా తెలుగు వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఇందుకోసం, ప్రత్యేకమైన ప్రోత్సాహకాలను ప్రకటించాలి, తెలుగు శిక్షణా తరగతులను నిర్వహించాలి. 


చదువు, పరిపాలన మాత్రమే కాదు, సమాచార, ప్రసాద, వినోద వేదికలకు, వ్యాపార ప్రచారాలకు, సాంస్కృతిక అవసరాలకు తెలుగు వినియోగం అవసరం. బహుళజాతి వ్యాపార, వినోద సంస్థలే తెలుగు ద్వారా వినియోగదారులను చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. విద్యలో తెలుగును ఇట్లా వదిలివేస్తే, భవిష్యత్తులో రచయితలు అనువాదకులు ఎవరూ ఉండరు. రాజకీయాలతో సహా మన దేశంలో 99 శాతం జీవనరంగాలన్నీ స్వభాషీయ సమాజం మధ్యనే జరుగుతుంటాయని గుర్తుంచుకుని, భాషను చదువులోను, రాతలోను కాపాడుకోవలసి ఉన్నది.

Updated Date - 2021-09-04T05:49:17+05:30 IST