Dubai వెళ్తే.. తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఇవే..

ABN , First Publish Date - 2022-01-08T15:52:04+05:30 IST

దుబాయ్ అంటేనే ఎన్నో టూరిస్ట్ అట్రాక్షన్స్, ల్యాండ్‌మార్క్స్, ఆకాశహర్మ్యాలతో అందంగా ఉండే నగరం.

Dubai వెళ్తే.. తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఇవే..

ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ అంటేనే ఎన్నో టూరిస్ట్ అట్రాక్షన్స్, ల్యాండ్‌మార్క్స్, ఆకాశహర్మ్యాలతో అందంగా ఉండే నగరం. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా ఉండే భవన నిర్మాణాలు, చూడచక్కని విశాలమైన రోడ్లతో ఎప్పుడూ కనులవిందుగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బూర్జ్ ఖలీఫా నుంచి బుర్జ్ అల్ అరబ్ ఇలా ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు దుబాయ్ సొంతం. ఇప్పుడు మనం దుబాయ్‌లోని తప్పకుండా చూడాల్సిన దర్శనీయ ప్రదేశాలపై ఓ లుక్కేద్దాం...


1. దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్‌, దాని పక్కన ఉండే ఆధునిక ఆకాశహర్మ్యాలను రాత్రివేళ చూస్తే ఆ మజానే వేరు. నైట్ వ్యూలో ఆ దృశ్యాలను చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. దీనికి మచ్చుతునక పైన ఉన్న ఫొటో.


2. దుబాయ్ వెళ్తే తప్పకుండా చూడాల్సిన మరో ప్రదేశం బుర్జ్ అల్ అరబ్. ఇదో లగ్జరీ హోటల్. చాలా మంది ప్రముఖ వ్యక్తులు తరచుగా ఇక్కడకు వస్తారు. లోపల ఎంత విలాసవంతంగా ఉంటుందో బయట కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది. 


3. ఎమిరేట్స్ ట్విన్ టవర్స్.. ఇది కూడా షేక్ జాయెద్ రోడ్‌లోనే ఉంటుంది. బయట ఉండే విశాలమైన రోడ్లను ట్విన్ టవర్స్‌ నుంచి చూస్తుంటే అదో మధురమైన అనుభూతి. 


4. మరో ఆకాశహర్మ్యం ఓపస్ టవర్. బిజినెస్ బేలో ఉంటది. అసలు ఈ భవంతి నిర్మాణమే ఓ అద్భుతమని చెప్పాలి. వింతైన ఆకారంతో ఉండే ఓపస్ టవర్‌ను డే, నైట్ ఎప్పుడు చూసిన కనులవిందుగానే ఉంటుంది. 


5. దుబాయ్ వెళ్లిన సందర్శకులు తప్పకుండా చూడాల్సిన మరో ఆకర్షణీయమై ప్రదేశం అట్లాంటిస్. పామ్ జుమైరాలోని పామ్, రాయల్ అట్లాంటిస్ రిసార్ట్ రెండు కూడా టూరిస్టులకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. చుట్టూ నీరు ఉంటే.. మధ్యలో నిర్మాణాలు, అక్కడక్క ఇసుక దిబ్బలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందీ చోటు. 


6. బుర్జ్ ఖలీఫా.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి. దుబాయ్‌కే ప్రత్యేక ఆకర్షణ. రాత్రి సమయంలో బుర్జ్ ఖలీఫాను చూస్తే కనులవిందుగా ఉంటుంది. ప్రత్యేక లేజర్ షోలు, ఎల్ఈడీ లైట్లతో దగదగ మెరిసిపోతుంటుంది. 829.8 మీటర్ల ఎత్తు గల ఈ భవనంలో మొత్తం 163 అంతస్తులు ఉన్నాయి. అత్యంత వేగంతో వెళ్లే 57 అధునాతన సాంకేతికతతో కూడిన లిప్టులను అమర్చారు. 2004 జనవరి 6న ప్రారంభమైన బుర్జ్ ఖలీఫా నిర్మాణం సుమారు ఐదేళ్ల తర్వాత పూర్తైంది. 2010లో ఈ ఆకాశహర్మ్యం ప్రారంభించబడింది.


7. టూరిస్టులకు కనులవిందును అందించే మరో స్పెషల్ టూరిస్ట్ స్పాట్ దుబాయ్ మరినాలోని స్కైలైన్. ఇక్కడ ఒకేచోట సుమారు 200 రెసిడెన్షియల్ టవర్స్ ఉంటాయి. రాత్రివేళ అవి వివిధ రంగులలో వెలిగిపోతాయి. ఆ సమయంలో చూసేందుకు రెండు కళ్లు సరిపోవంటే నమ్మండి. 


8. దీరా క్లాక్ టవర్.. ఇది దుబాయ్‌లోని దీరాలో అతి పురాతన ల్యాండ్‌మార్క్‌గా పరిగణించబడుతుంది. ఇది కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకునే మంచి టూరిస్ట్ స్పాట్.     

Updated Date - 2022-01-08T15:52:04+05:30 IST