దసరా వేడుకలకు ముస్తాబు

ABN , First Publish Date - 2021-10-15T04:48:04+05:30 IST

నేడు జరగనున్న దసరా వేడుకలకు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

దసరా వేడుకలకు ముస్తాబు
సంగారెడ్డిలోని అంబేడ్కర్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన రావణసుర బొమ్మ

సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి

కొనుగోలుదారులతో కిటకిటలాడిన దుకాణాలు


సంగారెడ్డి టౌన్‌, అక్టోబరు 14: నేడు జరగనున్న దసరా వేడుకలకు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని అంబేడ్కర్‌ గ్రౌండ్‌లో మున్సిపల్‌ ఆధ్వర్యంలో దసరా వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా లైటింగ్స్‌, బారికేడ్లతో ముస్తాబు చేశారు. దసరా వేడుకల్లో భాగంగా రాంమందిర్‌ నుంచి సీతారామాంజనేయుల ప్రతిమలతో ఊరేగింపుగా స్టేడియానికి చేరుకుని జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి సహకారంతో రాంమందిర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో రావణాసుర బొమ్మను ఏర్పాటు చేశారు. శుక్రవారం జరగనున్న దసరా వేడుకల్లో భాగంగా జమ్మిచెట్టు వద్ద పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాలపిట్టను ఎగురవేసి రావణాసురబొమ్మను దహనం చేసి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే చింతాప్రభాకర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ లతా విజయేందర్‌ రెడ్డి, తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. 


సంగారెడ్డిలో దసరా కొనుగోళ్ల సందడి

దసరా పండుగను పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని మార్కెట్లు, దుకాణాలు సందడిగా మారాయి. పోతిరెడ్డిపల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్‌, ఐబి, పాత బస్టాండ్‌, రైతుబజార్‌, బైపాస్‌ రోడ్డులోని సాయిబాబా కమాన్‌ తదితర ప్రాంతాల్లో పూలు, గుమ్మడికాయల విక్రయాలు జోరుగా సాగాయి. దసరాను పురస్కరించుకొని వాహనాలను అలంకరించుకునేందుకు బంతి పూలను పెద్దఎత్తున విక్రయించారు. బంతిపూలు, గుమ్మడికాయలకు మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఏర్పడింది. బంతిపూలు కిలోకు రూ.100 నుంచి రూ.150, గుమ్మడికాయ రూ.150 వరకు విక్రయించారు. అలాగే వస్త్ర దుకాణాలు జనంతో రద్దీగా మారాయి. 


 జూనియర్‌ కళాశాల మైదానంలో రావణ దహనం

మెదక్‌మున్సిపాలిటీ/మెదక్‌  అర్బన్‌, అక్టోబరు 14: విజయదశమి వేడుకలను మెదక్‌ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ తొడుపునూరి చంద్రపాల్‌ తెలిపారు. రావణ దహనంతో పాటు, ఇందిరాపురికాలనీ జమ్మిచెట్టు వద్ద జరిగే వేడుకల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించే రావణదహన కార్యక్రమ ఏర్పాట్లను గురువారం కమిషనర్‌ శ్రీహరి, మాజీ వైస్‌చైర్మన్‌ రాగి అశోక్‌, కౌన్సిలర్లు వంజరి జయరాజ్‌, అవారిశేఖర్‌, ఆర్‌కె శ్రీనివాస్‌, నాయకులు గోదల సాయిరాంలతో కలిసి పర్యవేక్షించారు. లైటింగ్‌, నీటి వసతి తదితర సదుపాయాలు కల్పిస్తున్నట్లు చైర్మన్‌ తెలిపారు. వేడుకల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి పాల్గొనున్నారు. పండుగ సందర్భంగా పట్టణంలోని దుకాణాలు సందడిగా మారాయి. వస్త్ర, పూల దుకాణాలు కిటకిటలాడాయి. నవరాత్రుల సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


ప్రముఖుల శుభాకాంక్షలు

దసరా సందర్భంగా ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మ్యాడం బాలకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్‌ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. 





Updated Date - 2021-10-15T04:48:04+05:30 IST