Abn logo
Sep 27 2021 @ 00:32AM

మన్యంలో ముసురు

పాడేరు గుడివాడ వీధిలో వర్షం కురుస్తున్న దృశ్యం


పాడేరు, సెప్టెంబరు 26: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మన్యంలో ముసురు వాతావరణం కొనసాగుతున్నది. శనివారం భారీ వర్షం కురవగా ఆదివారం మాత్రం జల్లులతో కూడిన వర్షం మాత్రమే కొనసాగింది. దీంతో జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాజా వర్షానికి రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. 

చింతపల్లి: మండలంలో తుఫాన్‌ ప్రభావంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తునే ఉంది. రాత్రి ఏడు గంటల నుంచి కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులు వాగులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో నిండుకున్నాయి. 

సీలేరు: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావంతో సీలేరు పరిసరాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి ఒక మోస్తరుగా వర్షం కురిసింది. ఉదయం నుంచి మేఘాలు కమ్ముకుని వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం మూడు గంటల తరువాత   వర్షం ప్రారంభమైంది. వర్షంతో సీలేరు, ధారకొండల్లో సంతలకు అంతరాయం ఏర్పడింది. డొంకరాయి జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉండడంతో జెన్‌కో అధికార్లు జలాశయం వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. 

ముంచంగిపుట్టు: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ ప్రభావంతో మండలంలో ముసురు వాతావరణం నెలకొంది. వర్షంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. రోడ్లులు చిత్తడిగా మారడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మండల కేంద్రంలోని ప్రధాన రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. 

డుంబ్రిగుడ: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌ కారణంగా రెండు రోజులుగా భారీ వర్షం కురిసింది. డుంబ్రిగుడలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడుతూనే ఉంది. మరో రెండుమూడు రోజులు వర్షం కురుస్తుందని, వాగులు, గెడ్డలు పొంగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.