ధరణితోనే వ్యవసాయేతర ఆస్తుల మ్యుటేషన్‌!

ABN , First Publish Date - 2020-12-04T08:03:25+05:30 IST

పట్టణాల్లోని వ్యవసాయేతర ఆస్తుల (ఖాళీ స్థలాలు, భవనాలు, ఫ్లాట్లు) మ్యుటేషన్‌ ధరణి ద్వారానే జరగనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా,

ధరణితోనే వ్యవసాయేతర ఆస్తుల మ్యుటేషన్‌!

ఇళ్లు, ఫ్లాట్లు, ఖాళీ స్థలాలు కూడా..

జీహెచ్‌ఎంసీకి మినహా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు వర్తింపుమార్గదర్శకాలు జారీ 

అమలుపై కొరవడిన స్పష్టత

 హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పట్టణాల్లోని వ్యవసాయేతర ఆస్తుల (ఖాళీ స్థలాలు, భవనాలు, ఫ్లాట్లు) మ్యుటేషన్‌ ధరణి ద్వారానే జరగనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా, అన్ని పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో ఈ పద్ధతిని అనుసరించనున్నారు ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ గురువారం మార్గదర్శకాలను జారీ చేశారు. అయితే, ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు. ‘తెలంగాణ పురపాలక సంఘాలు, (ధరణి పోర్టల్‌ ద్వారా ఆస్తుల మ్యుటేషన్‌) నియమాలు’గా వీటిని పరిగణిస్తారు.


గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని మిగిలిన అన్ని పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో వ్యవసాయేతర ఆస్తుల నిర్వహణ, నవీకరణను డిజిటల్‌ పద్ధతిలో ధరణి ద్వారానే చేయనున్నారు. పురపాలక సంఘాలు నిర్వహించే వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌వోఆర్‌)లో స్థల యజమాని పేరుతో పాటు దానిపై వారసత్వ హక్కు కలిగిన కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉంటాయి. ఆస్తి ఉన్న ప్రదేశం, అది ఏ రకమైంది? వినియోగం, విస్తీర్ణం సమాచారం కూడా ఉంటుంది.  


ఆస్తుల సమాచారం ధరణికి..

ప్రతి పురపాలక సంఘం, కార్పొరేషన్‌ (హైదరాబాద్‌ మినహా) తమ వద్ద ఉన్న వ్యవసాయేతర ఆస్తుల సమాచారాన్ని నిర్దేశిత నమూనాలో ధరణికి బదలాయిస్తాయి. అదే సమయంలో భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, లే అవుట్‌ ఆమోదం వంటి సమాచారం అందజేస్తాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆస్తులకు ఈ నియమాలు వర్తించవు. అమ్మకం, భరణం లేదా తనఖా ద్వారా బదలాయించే ఆస్తి రిజిస్ట్రేషన్‌, ఆర్‌వోఆర్‌ మార్పునకు కూడా స్పష్టత ఇచ్చారు.

ఒక వ్యక్తి అమ్మకం లేదా భరణం లేదా తనఖా రిజిస్టర్డ్‌ డాక్యుమెంటు ద్వారా ఆస్తిని బదలాయించాలనుకున్నప్పుడు తొలుత సంబంధిత పురపాలక సంఘం నుంచే కాకుండా విద్యుత్తు సంస్థ నుంచి నో డ్యూ సర్టిఫికెట్‌ తీసుకుని ధరణిలో సబ్‌ రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌తో పాటే మ్యుటేషన్‌ జరగనుంది. సబ్‌రిజిస్ట్రార్‌ మ్యుటేషన్‌ చార్జీలు వసూలు చేసి పురపాలక సంఘాల రికార్డుల్లో ఈ మేరకు అవసరమైన సవరణలకు వీలు కల్పిస్తారు. 


వ్యవసాయేతర ఆస్తిపై వారసత్వ హక్కు కలిగిన వ్యక్తులు ఎవరైనా ముందు తమ మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి అగ్రిమెంటుకు సంబంధించిన వివరాలను కూడా ధరణిలోనే దరఖాస్తుతో జతచేయాలి. స్లాట్‌ బుకింగ్‌ సమయానికి అనుగుణంగా సబ్‌ రిజిస్ట్రార్‌ ముందు హాజరు కావాలి.  

వారసులు లేదా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఉమ్మడి అగ్రిమెంటు ఆధారంగా మ్యుటేషన్‌ చార్జీలు వసూలు చేసిన తర్వాత పురపాలక సంఘాల్లో కూడా ఆర్‌వోఆర్‌లో మార్పునకు అవకాశం కల్పిస్తారు. ఇదంతా కూడా ధరణి పోర్టల్‌ ద్వారా చేస్తారు. కోర్టు డిక్రీ  పొందిన వారు కూడా ఇలాగే మ్యుటేషన్‌ చేయించుకోవచ్చు. 

ఆస్తి పన్నుతో పాటు విద్యుత్తు, ఇతర బకాయిలన్నీ వసూలైన తర్వాత పురపాలక సంఘాలు నో డ్యూ సర్టిఫికెట్‌ జారీ చేయాలి. దరఖాస్తు చేసిన 4 పనిదినాల్లో నో డ్యూ సర్టిఫికెట్‌ జారీకాకపోతే అది అయినట్లుగానే భావించాల్సి ఉంటుందని ముఖ్య కార్యదర్శి తెలిపారు.


Updated Date - 2020-12-04T08:03:25+05:30 IST