Jun 1 2021 @ 22:49PM

నేను మద్రాసు వెళ్లడానికి ఆ హోటల్స్ కూడా కారణం: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 3)

ఊళ్లల్లో చదువుకుంటున్న మిగిలిన మిత్రులు కూడా సొంతూరుకు చేరుకొన్నారు. ఎప్పుడూ మేం అందరం కలుసుకునే మీటింగ్‌ ప్రదేశంలో కలిశాం. నేను ఏం చేయడం లేదు, ఖాళీగా ఉంటున్నాను అని తెలిసి అంతా బాధ పడ్డారు. ‘ఒరేయ్‌.. నీకు నాటకాలు, సినిమాలు అంటే ఆసక్తి కదా. అందుకే సినిమా ఫీల్డ్‌లో ట్రై చేస్తే బెటర్‌’ అని సలహా ఇచ్చాడు శ్రీనివాసరెడ్డి. దాన్ని బలపరిచారు మిగిలిన మిత్రులు. నాకు కూడా అదే మంచిదనిపించింది. మా క్లాస్‌మేట్‌ ఎమ్మెస్‌ కోటారెడ్డి అప్పటికే సినిమా ఫీల్డ్‌లోకి వెళ్లిపోయాడు. హాస్యనటుడు రమణారెడ్డి అతనికి బంధువు కావడంతో ఆయన రికమండేషన్‌తో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరిపోయాడు కోటారెడ్డి.


కానీ నాకు ఎవరున్నారు? నన్నెవరు రికమెండ్‌ చేస్తారు? అదే ప్రశ్న నేను అడిగేసరికి అంతా మౌనం వహించారు. ఉన్నట్టుండి నాకో విషయం గుర్తుకు వచ్చింది.. సినిమాల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసే రాజేంద్రకుమార్‌ది మా ఊరే. ఆయన మద్రాసులో సెటిల్‌ అయినా ఆయన బంధువు మా ఊళ్లోనే ఉంటున్నాడు. ఆయన ద్వారా రాజేంద్రకుమార్‌ను కలుసుకోవాలి, మద్రాసు చిత్రపరిశ్రమలో చోటు సంపాదించుకోవాలి.. ఇదీ ఆ రోజు మేమందరం చేసిన తీర్మానం. ఒక నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. నేను ఇంటికి వచ్చేశాను. చాలా రోజుల తర్వాత ఒళ్లు తెలియకుండా నిద్రపోయాను.

ఇవి కూడా చదవండిImage Caption

మారాం చేయడంతో మా నాన్న సైకిల్‌ కొనిపెట్టారు: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 1)ఎన్టీఆర్‌ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 2)

ఆ మర్నాడు ఉదయమే రాజేంద్రకుమార్‌ బంధువు ఇంటికి వెళ్లాం. ఆ రోజుల్లో ఇప్పటిలా సెల్‌ఫోన్లు లేవుగా. ఆయన లెటర్‌ రాసి ఇస్తే అది తీసుకుని రాజేంద్రకుమార్‌ని కలవాలి. ఆయన రికమండేషన్‌తో ఏ డైరెక్టర్‌ దగ్గరన్నా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాలి. సరదాగా నేను చాలా నాటకాల్లో నటించినా, మొదటినుంచీ నాకు దర్శకత్వం మీదే ఆసక్తి. అందుకే దర్శకునిగానే చిత్రరంగంలో నా భవిష్యత్‌ తేల్చుకోవాలని డిసైడ్‌ అయ్యా. నేను మద్రాసు వెళ్లాలనుకోవడానికి మరో కారణం కూడా ఉంది. అదేమిటంటే మా పార్లపల్లికి చెందిన వాళ్లే మద్రాసులో రెండు హోటల్స్‌ పెట్టారు. సవేరా హోటల్‌ ఎదురుగా ఉన్న ‘హోటల్‌ నవయుగ’ మా ఊరి వాళ్లదే. 


ఆంధ్రా భోజనం కావాలంటే అక్కడికి రావాల్సిందే. రుచికరమైన భోజనానికి ఆ హోటల్‌ పెట్టింది పేరు. అలాగే ‘ద్వారకా లాడ్జ్‌’ ఉండేది. కేథడ్రల్‌ రోడ్‌‌లో మారియెట్‌ హోటల్‌ ఉండేది. సరిగ్గా దానికి ఎదురుగా ఈ లాడ్జ్‌ ఉండేది. దాని యజమాని పేరు గోపాలరెడ్డి. ఆయనకు నలుగురు తమ్ముళ్లు. అందరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వాళ్లందరూ నాకు బాగా తెలుసు. ఈ రెండు హోటళ్ల యజమానులు నాకు బాగా తెలియడంతో ఉండటానికి, భోజనానికి ఇబ్బంది లేదనుకొని మద్రాసులో నా అదృష్టం పరీక్షించుకోవడానికి అడుగు ముందుకేశాను.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...