Jul 13 2021 @ 20:21PM

మహేశ్వరిని చూడగానే.. నీరసం వచ్చేసింది: ముత్యాల సుబ్బయ్య (పార్ట్‌ 33)

‘మామగారు’ సినిమా తర్వాత ఎడిటర్‌ మోహన్‌ గారిని మళ్లీ కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఎప్పుడన్నా ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్లం. చాలా రోజుల తర్వాత నేను ఆయన ఆఫీసుకు వెళ్లడంతో చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారు. కాఫీలు తాగి తీరికగా కూర్చున్న తర్వాత తను కొన్న ఓ తమిళ సినిమా గురించి మోహన్‌గారు చెప్పుకొచ్చారు. ఆయన తీసినవన్నీ రీమేక్‌లే కదా. అలాగే ‘కిళక్కు సీమయిలే’ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. చాలా అవార్డులు కూడా వచ్చాయి. ఆ సినిమా నాకు చూపించారు. ఎన్టీఆర్‌గారు నటించిన ‘రక్తసంబంధం’ సినిమాలా ఇది కూడా అన్నాచెల్లెళ్ల కథే. నాకు నచ్చడంతో చేద్దామన్నాను. కృష్ణంరాజుగారు హీరోగా నటించిన ఆ చిత్రం పేరు ‘పల్నాటి పౌరుషం’. ఆయన చెల్లెలిగా రాధిక నటించారు. తమిళ వెర్షన్‌లోనూ ఆమే నటించారు. చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో రాధిక నటించిన మంచి సినిమా ఇది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేశాం. మరో ముఖ్యమైన విషయమం ఏమిటంటే నేను దర్శకత్వం వహించిన చిత్రానికి ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీత దర్శకత్వం వహించడం. రాజమండ్రి, పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. చాలా కష్టపడి ఆ సినిమాకు వర్క్‌ చేశాం. రిజల్ట్‌ ఓకే.

శ్రీవారి ప్రియురాలు

ఆ తర్వాత ఎల్వీ రామరాజు అనే నిర్మాతకు ‘శ్రీవారి ప్రియురాలు’ పేరుతో ఓ సినిమా చేశాం. తన శ్రీవారికి మరో ప్రియురాలు ఉండటం ఏ మహిళైనా భరించలేని విషయం. ఈ కొత్త పాయింట్‌ను తీసుకుని మనసు కన్నా మాంగల్యం గొప్పదని సినిమాలో చెప్పాం. కె.ఎల్‌.ప్రసాద్‌ రాసిన కథకు ఆకెళ్ల అద్భుతమైన మాటలు రాశారు. వినోద్‌కుమార్‌, ఆమని, ప్రియారామన్‌ హీరోహీరోయిన్లుగా నటించారు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న తరుణంలో మాజీ ప్రియురాలు రావడంతో భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటాడు హీరో. అయితే ఈ విషయంలో కొడుకుకు బదులు కోడలికే అండగా నిలుస్తారు అత్తమామ. కొడుకు సంసారం చక్కదిద్దడానికి వారిద్దరూ ఆడే నాటకం ఆసక్తికరంగా ఉంటుంది. ‘నేను విడాకులు తీసుకోబోతున్నాను. నాకో వరుడు కావాలి. నాకు రూ. 30 లక్షల ఆస్తి ఉంది. నన్ను పెళ్లాడేవాడికి డబ్బు ఉండనక్కర్లేదు. సంస్కారం ముఖ్యం. అర్హతలు ఉన్న మొగాళ్లు అర్జీ పెట్టుకోవచ్చు’ అని కోడలితో ఓ పత్రికా ప్రకటన ఇప్పిస్తారు. అది సంచలనం అవుతుంది. కొడుకు గొడవ చేస్తాడు. నా పరువు పోతోంది అంటూ . ‘నీ పరువు ఏమిటిరా.. మా కోడలి జీవితం నాశనం అవుతుంటేను’ అని నిలదీస్తారు అత్తమామ. . భలే డ్రామా పండింది. సినిమా బాగానే ఆడింది. వినోద్‌కుమార్‌, ఆమని, సత్యనారాయణ, శారద అందరూ బాగా చేశారు.

ఏమిటీ నాకు ఈ అగ్నిపరీక్ష అని మనసులోనే బాధపడ్డా..

టి.కృష్ణ మెమోరియల్‌ పిక్చర్స్‌ అధినేత నాగేశ్వరరావుగారు ఈ గ్యాప్‌లో ఓ సబ్జెక్ట్‌ రెడీ చేసి ఉంచారు. ఆ సినిమా పేరు ‘అమ్మాయికాపురం’. టి.కృష్టగారి పెద్దబ్బాయి ప్రేమ్‌చంద్‌ చేతికి వచ్చాడు. డిగ్రీ అయిపోవడంతో సినిమాల మీద ఆసక్తితో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. ‘అన్న’ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాడు. ‘అమ్మాయి కాపురం’ సినిమాకు పని చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కొత్త నటి వేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నప్పుడు నిర్మాత నాగేశ్వరరావుగారు మహేశ్వరి ఫొటోలు చూపించారు. శ్రీదేవి చెల్లెలనీ, భారతీరాజా ఓ తమిళ చిత్రంతో పరిచయం చేస్తున్నాడనీ చెప్పారు. ఫొటో చూస్తే పరవాలేదనిపించింది. ‘ఒకసారి పిలిపించండి.. చూద్దాం’ అన్నాను.


అయితే మాకు చెప్పకుండానే ఆమెని బుక్‌ చేసి వచ్చి ఆ తర్వాత ఆ విషయం చెప్పారు నాగేశ్వరరావుగారు. మహేశ్వరి ఎక్కడో దూరంగా ఔట్‌డోర్‌లో ఉండటంతో ఆమెను చూసే అవకాశం కలగలేదు. సరేననుకుని షెడ్యూల్‌ ప్లాన్‌ చేసుకుని ఒంగోలుకు వెళ్లిపోయాం. షూటింగ్‌ మొదటి రోజున స్పాట్‌కు వచ్చిన మహేశ్వరిని చూసి నిర్ఘాంతపోయాను. సన్నగా, పీలగా ఉందామె. మాంచి ఎండల్లో షూటింగ్‌ చేసి వచ్చిందేమో మొహం నల్లగా మాడింది. ఏ మాత్రం గ్లామర్‌ లేకుండా ఉన్న మహేశ్వరిని చూడగానే మా అందరికీ నీరసం వచ్చేసింది. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాలో హీరోయిన్‌ అందంగా లేకపోతే ఎలా? అనాకారిగా ఉన్న ఈమెతో షూటింగ్‌ చేస్తే సినిమా పరిస్థితి ఏమిటో ....


మాకు చెప్పకుండా, మహేశ్వరిని చూపించకుండా హీరోయిన్‌గా బుక్‌ చేసిన నాగేశ్వరరావుగారి మీద పట్టరాని కోపం వచ్చింది. వెంటనే ఆయన్ని పిలిచి ‘ఏమిటిసార్‌ ఇది’ అని నిలదీసేసరికి ఆయన నీళ్లు నమిలాడు. ఆర్టిస్టులందరూ అప్పటికే ఒంగోలు చేరుకున్నారు. షూటింగ్‌ వాయిదా వేసే పరిస్థితి లేదు. ఇంత మంచి సినిమాకు ఇలాంటి అమ్మాయిని హీరోయిన్‌గా పెట్టుకుని ఎలా ముందుకు పోవడం.. ఏమిటీ నాకు ఈ అగ్నిపరీక్ష అని మనసులోనే బాధపడ్డాను. మరొకరైతే ‘ఈ అమ్మాయిని మార్చాల్సిందే. లేకపోతే కుదరదు’ అని తెగేసి చెప్పి ఉండేవారేమో! కానీ నిర్మాతతో ఘర్షణకు దిగే మనస్తత్వం కాదు నాది. అందుకే నేనే రాజీపడ్డాను.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...