Jul 21 2021 @ 21:45PM

మెగాస్టార్ పంపిన పార్సిల్‌లో ఏముందంటే?: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 39)

కొన్నిరోజుల తర్వాత ‘హిట్లర్‌’ సినిమా షూటింగ్‌ మొదలైంది. తొలి రోజున నేను కొంచెం భయపడ్డానుగానీ, ఆ తర్వాత చిరంజీవిగారు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగాను. అన్ని సీన్లూ సూపర్‌గా పండాయి. చిరంజీవిగారి మీద రెండు పేథస్‌ సాంగ్స్‌ (‘ఓ కాలమా...’, ‘కన్నీళ్ళకే కన్నీళ్ళు వచ్చే...’) చిత్రీకరించడం, ప్రేక్షకులు వాటిని అంగీకరించడం గొప్ప విషయమే. పేథస్‌ సాంగ్స్‌ డ్యాన్స్‌ మాస్టర్‌కు ఇవ్వకుండా నేనే చిత్రీకరించడం నాకు మొదటినుంచీ అలవాటు. చిరంజీవిగారు ఏమాత్రం జోక్యం చేసుకోకుండా చెప్పింది చెప్పినట్లు చేశారు. రీరికార్డింగ్‌ కోటి అద్భుతంగా చేశారు. అయితే సినిమాలో, ‘హ బి బీ..’ సాంగ్‌ ట్యూన్‌ చిరంజీవిగారికి మొదట నచ్చలేదు. కానీ పాట రికార్డింగ్‌ పూర్తయి వచ్చిన తర్వాత విని ఆయన కూడా సంతృప్తి చెందారు.


చిరంజీవిగారి తండ్రి పాత్రలో ఎవరు చేసినా అది రొటీనే అవుతుంది. అందుకే దాసరి నారాయణరావుగారు వేస్తేనే విభిన్నంగా ఉంటుందని మేమంతా ఏకగ్రీవంగా నిర్ణయించాం. ఎడిటర్‌ మోహన్‌గారికీ, నారాయణరావుగారికీ ఉన్న అనుబంధం కూడా ఆయన ఈ పాత్ర చేయడానికి కారణమైంది. సినిమాలో సీరియస్‌నెస్‌ ఎంత ఉందో, కామెడీ కూడా ఆ స్థాయిలోనే ఉండటం ‘హిట్లర్‌’ ప్రత్యేకత. రాజేంద్రప్రసాద్‌, సుధాకర్‌, బ్రహ్మానందం, కల్పనారాయ్‌ పాత్రలు అద్భుతంగా కుదిరాయి. సినిమా చాలా బాగా వచ్చింది. ఫస్ట్‌ కాపీ చూసి అందరం హ్యాపీ. 1997 జనవరి 4న విడుదలైంది. పెద్ద హిట్‌. ఆ సినిమాతో నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ సినిమాకు నన్ను దర్శకుడిగా ఎంపిక చేసిన చిరంజీవిగారికి, అల్లు అరవింద్‌గారికీ, ఎడిటర్‌ మోహన్‌గారికీ పాదాభివందనాలు. చాలామంది దర్శకులు ఉన్నారు. వాళ్లలో నాకే అవకాశం రావడం నిజంగా అదృష్టమే కదా.

‘‘చిరంజీవికి లైఫ్‌ ఇచ్చావయ్యా’’ అని కొందరు అంటారు. కానీ దానికి నేను ఒప్పుకోను. ‘‘తనతో సినిమా చేసే అవకాశం చిరంజీవిగారే నాకు ఇచ్చారు. అలా ఆయనే నాకు లైఫ్‌ ఇచ్చారు’’ అని చెప్పేవాడిని. సినిమా బాగా ఆడుతున్న రోజుల్లో ఒకసారి చిరంజీవిగారి ఆఫీసునుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ‘‘చిరంజీవిగారు మిమ్మల్ని ఒకసారి రమ్మంటున్నారు’’ అని. నేను ఎక్కడో ఉన్నాను. అక్కడినుంచి రావడానికి రెండు రోజులు పట్టింది. అప్పటికే పరిశ్రమలో చాలామంది సెల్‌ఫోన్లు వాడుతున్నారు. నేను అప్పటికి ఇంకా సెల్‌ ఫోన్‌ కొనుక్కోలేదు. అందుకే ఆయన దగ్గరకి వెళ్లగానే ‘‘సారీ సార్‌.. మీ మెసేజ్‌ నాకు అందడం లేటైంది. అందుకే మిమ్మల్ని వెంటనే కలవలేకపోయాను సార్‌’’ అన్నాను. ‘‘అదేమిటి.. నీకు సెల్‌ఫోన్‌ లేదా?’’ అని అడిగారు చిరంజీవిగారు.‘‘లేదు సార్‌.. ఇంకా కొనలేదు’’ అన్నాను నవ్వుతూ. కాసేపు మాట్లాడి ఇంటికి వచ్చేశాను. మర్నాడు ఉదయమే ఇంటికి ఓ పార్సిల్‌ వచ్చింది. విప్పి చూస్తే అందులో సెల్‌ఫోన్‌ ఉంది. చిరంజీవిగారు పంపించిన కానుక అది.


ఒంగోలులో ఫంక్షన్‌

‘హిట్లర్‌’ వంద రోజుల వేడుక ఎక్కడ చేయాలన్న విషయం మీద చాలా చర్చ జరిగింది. ఒక్కో సెంటర్‌లో ఒక్కో సినిమా వంద రోజుల వేడుక చేయడం చిరంజీవిగారికి ఆనవాయితీగా ఉండేది. అలా ఆలోచించి ఒంగోలులో ‘హిట్లర్‌’ ఫంక్షన్‌ పెట్టారు. వాళ్ల నాన్నగారు మొదట్లో ఉద్యోగం చేసిన ప్రాంతం కావడంతో ఒంగోలుతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉండేది. భారీ ఎత్తున అక్కడ ఫంక్షన్‌ నిర్వహించారు. అలా ‘పవిత్రబంధం’, ‘హిట్లర్‌’ చిత్రాలు ఘనవిజయం సాధించడంతో దర్శకుడిగా నా స్థాయి పెరిగింది. పారితోషికం కూడా బాగా పెరిగింది. అటువంటి తరుణంలో ‘పవిత్రబంధం’ చిత్రం రీమేక్‌ హక్కుల కోసం పోటీ ఏర్పడింది.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...