Jul 22 2021 @ 23:04PM

అరవింద్‌గారు అలా అడగ్గానే దండం పెట్టేశా: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 40)

కన్నడ, హిందీ భాషల్లో ‘పవిత్రబంధం’ చిత్రం నిర్మించడానికి చాలామంది ముందుకు వచ్చారు. ‘కలికాలం’ సినిమాను హిందీలో తియ్యమని ఆ రోజుల్లో నాకు ఆఫర్‌ వచ్చింది. జితేంద్రగారు స్వయంగా కబురు చేయడంతో వెళ్లి ఆయన్ని కలిశాను. తను ఆ సినిమాను హిందీలో తీస్తాననీ, దర్శకత్వం చేయమని అడిగారు. అయితే హిందీ భాష మీద పట్టు లేకపోవడంతో నేను చేయలేనని చెప్సేశాను. పైగా ఆ సమయంలో నేను చాలా బిజీగా ఉన్నాను. ఖాళీగా ఉంటే ఏదన్నా తిప్పలు పడేవాణ్ణేమో. అందుకే ఆ ఆఫర్‌ వదిలేసుకున్నా. అలాగే ‘పవిత్రబంధం’ చిత్రాన్ని అల్లు అరవింద్‌గారు కన్నడంలో రీమేక్‌ చేస్తూ, నాకు కబురు చేశారు. వెళ్లాను. ‘‘సుబ్బయ్యా.. కన్నడంలో ‘పవిత్రబంధం’ చేద్దామయ్యా’’ అన్నారు. అప్పటికే నేను జగపతిబాబు, ఇంద్రజ నటించే ‘ఒక చిన్నమాట’ సహా కొన్ని సినిమాలు ఒప్పుకున్నాను. ఆ సమయంలోనే శివరాజు, వెంకట్రాజులకు మళ్లీ వెంకటేశ్‌గారు డేట్స్‌ ఇస్తానని కబురు చేశారు. ఆ సినిమాకు సబ్జెక్ట్‌ రెడీ చేస్తున్నాం. అందుకే అరవింద్‌గారు అలా అడగ్గానే దండంపెట్టేసి, ‘‘నేను కొంచెం బిజీగా ఉన్నాను గురువుగారూ. దయచేసి అపార్థం చేసుకోవద్దు. తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాలు ఒప్పుకున్నాను. వాటిని వదులుకోలేను. అదీగాక నాకు కన్నడభాష మీద కమాండ్‌ లేదు. మీకు నా మీద ప్రేమ ఉంటే గీతా ఆర్ట్స్‌లో ఎప్పుడైనా అవకాశం ఇవ్వండి’’ అని అభ్యర్థించాను. ఆయన నవ్వేసి ‘‘సరే...చూద్దాం’’ అన్నారు.

నా ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేసిన సినిమా ‘ఒక చిన్నమాట’. బూరుగుపల్లి శివరామకృష్ణగారు దీనికి నిర్మాత. సినిమా చేయమని చాలా రోజుల నుంచి ఆయన అడుగుతుండటంతో సరేనన్నాను. ‘హిట్లర్‌’ తర్వాత నేను చేసిన సినిమా అదే! ఆ చిత్రం కోసం భూపతిరాజా ఓ లైన్‌ చెప్పారు. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ నటించిన ‘చరణదాసి’ చిత్రాన్ని బేస్‌ చేసుకుని తయారు చేసిన ఆ లైన్‌ నాకు బాగా నచ్చింది. బూరుగుపల్లి శివరామకృష్ణగారికీ, హీరో జగపతిబాబుగారికీ కూడా నచ్చడంతో ప్రొసీడ్‌ అయ్యాం. తీరా సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యే సమయానికి భూపతిరాజా చెప్పిన కథలోని ఫీలింగ్‌ కనిపించలేదు. నిర్మాత, రచయిత దివాకరబాబు ఆ కథ రూపురేఖలే మార్చేశారు. నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది.


కథ విషయంలోనే కాదు.. రచయిత, హీరోయిన్‌, టైటిల్‌.. వీటిల్లో ఎక్కడా నాకు చెప్పకుండానే నిర్మాత అన్ని నిర్ణయాలూ తీసుకోవడం బాధగా అనిపించింది. హీరోయిన్‌గా సౌందర్య చేయాల్సిన సబ్జెక్ట్‌ అది. కానీ బూరుగుపల్లి శివరామకృష్ణగారు ఇంద్రజతో మాట్లాడి అడ్వాన్స్‌ ఇచ్చేశారు. ‘అదేమిటి గురువుగారు.. సౌందర్య బాగుంటుంది కదా’ అంటే, ‘సొగసు చూడతరమా చిత్రంలో ఇంద్రజ బాగా చేసిందండీ’ అన్నారు. ఇంద్రజ మంచి నటే కాదనను. కానీ ఎంతో డెప్త్‌ ఉన్న ఆ పాత్రను సౌందర్య పోషిస్తే సినిమా బాగా ఆడేదని నా ఫీలింగ్‌. అలాగే నాతో సంప్రదించకుండానే ‘ఒక చిన్నమాట’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఆ రోజుల్లో నా చిత్రాలకు పోసాని కృష్ణమురళి రచయితగా ఉండేవారు. ఆయన్ని కాదని దివాకరబాబును ఎంపిక చేశారు. దివాకరబాబు మంచి రచయితే కాదనను. కానీ నాకు, పోసానికీ వేవ్‌ లెంగ్త్‌ బాగా కుదిరింది.


మంచి డ్రామా ఉన్న సన్నివేశాలను కూడా వెకిలి కామెడీతో నింపేశారు. స్ర్టెయిట్‌ నేరేషన్‌ కలిగిన కథ అది. అయితే మధ్యలో ఎక్కడో ఫ్లాష్‌బ్యాక్‌ ఓపెన్‌ చేసి నానా కంపు చేశారు. నేను ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ఇన్ని అవమానాలు భరిస్తూ సినిమా చేయడం కంటే మధ్యలోనే తప్పుకుంటే బాగుంటుందనిపించింది. అదే మాట మా స్టాఫ్‌తో అన్నాను. ‘సార్‌.. మనకు వరుసగా హిట్స్‌ ఉన్నాయి. మధ్యలో వదిలేసి వెళ్లడం వల్ల మన పేరే దెబ్బతింటుంది.. ఆలోచించండి’ అన్నారు. అదీ నిజమేననిపించింది. అందుకే బాధను దిగమింగుకుని ‘ఒక చిన్నమాట’ సినిమా పూర్తి చేశాను. చిత్రం పెద్దగా ఆడలేదు. ఎందుకు ఆడలేదో, అపజయానికి కారణాలు ఏమిటో నాకూ తెలుసు, బూరుగుపల్లి శివరామకృష్ణగారికీ తెలుసు. పొరపాటు జరుగుతోందని తెలిసి కూడా ఆ సినిమా చేయాల్సి వచ్చింది. నిర్మాతకీ, దర్శకుడికీ మధ్య చక్కని అవగాహన ఉండాలి. లేకపోతే ఇలాంటి పొరపాట్లే జరుగుతాయి.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...