Jun 4 2021 @ 22:51PM

అలా పి.సి. రెడ్డిగారి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరా!: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 5)

రోజులు ఇలా భారంగా గడుస్తున్న తరుణంలో అక్కినేని సంజీవిగారు మరో సినిమా ఒప్పుకున్నారన్న వార్త తెలిసింది. అయితే మనకు ఉద్యోగం దొరికినట్లే అనుకుని ఆయన్ని కలవడానికి ఆఫీసుకు వెళ్లాను. ఆ సమయంలో సంజీవిగారు లేరు. నిర్మాత చెంచురామయ్య ఆఫీసులో ఉన్నారు. ఎంతో అనుభవమున్న ప్రొడక్షన్‌ మేనేజర్‌ ఆయన. వాణిశ్రీగారిని పైకి తీసుకువచ్చింది ఆయనే. తనకున్న పరిచయాలతో నిర్మాతగా మారి ‘మల్లమ్మ కథ’ సినిమా తీస్తున్నారు. అందులో కృష్ణగారు హీరో. శారదగారు హీరోయిన్‌. నన్ను చూడగానే ‘‘ఏం సుబ్బయ్యా.. బాగున్నావా?’’ అని నన్ను పలకరించారు చెంచురామయ్య. నేను ఈయనకెలా తెలుసు అని మనసులో అనుకుంటూ ‘‘బాగున్నాను సార్‌’’ అన్నాను.


‘‘ఈ షెడ్యూల్‌లో వేషాలు లేవుగానీ, వచ్చే షెడ్యూల్‌ మొదలుపెట్టే ముందు వచ్చి కలువ్’’ అన్నాడాయన. నేను తెల్లబోయాను. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరదామని వస్తే ఈయన వేషాలు లేవని అంటాడేమిటాని ఫీలయ్యాను. ‘‘సార్‌, నేను వేషం కోసం రాలేదు, సంజీవిగారి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను సార్‌. ఈ సినిమాకి కూడా ఏమన్నా అవకాశం ఇస్తారేమోనని ఆయన్ని కలవడానికి వచ్చాను’’ అన్నాను. ‘‘ఓరి నీ... నువ్విప్పుడు వేషాలు మానేశావా! అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నావా’’ ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడాయన. ‘‘అవును సార్‌.. నేను ఆర్టిస్ట్‌ నన్న విషయం మీకెలా తెలుసు సార్‌’’ అని కుతుహలంగా ప్రశ్నించాను. ‘‘బుచ్చిరెడ్డిపాలెం నాటక పోటీల్లో నువ్వు పాల్గొన్నావు కదా. బహుమతి ప్రదానోత్సవం రోజున ఇక్కడినుంచి రామకృష్ణనీ, విజయలలితను ఆ ఊరు తీసుకువచ్చింది నేనే’’ అన్నాడాయన. నాకు అప్పుడు వెలిగింది. నిజమే. బుచ్చిరెడ్డి పాలెంలో జరిగిన నాటక పోటీల్లో మా బృందం పాల్గొంది. సినీ తారలు రామకృష్ణ, విజయలలిత చేతుల మీదుగా బహుమతులు కూడా అందుకున్నాను. చెంచురామయ్య స్టేజీ మీదకు రాలేదు కానీ ముందు వరుసలో కూర్చుని ఉంటారు. ఆ రోజు నేను ఎక్కువ బహుమతులు తీసుకోవడంతో ఆర్టిస్ట్‌గా ఆయనకు బాగా గుర్తుండి ఉంటాను. అందుకే నన్ను చూడగానే వేషానికే వచ్చాననుకుని అలా చెప్పారని నాకు అర్థమైంది. ‘‘మీరు చెప్పింది నిజమే సార్‌, కానీ ఇప్పుడు నాటకాలు మానేసి డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాను మీరు అవకాశం ఇస్తే మీ కంపెనీలో చేస్తాను సార్‌’’ అన్నాను. ‘లేదు సుబ్బయ్యా, ఇప్పటికే చాలామంది ఉన్నారు, ఏమనుకోకు. మరోసారి చూద్దాం’’ అన్నారాయన.


చెంచురామయ్య అలా అనేసరికి నాకు కొంచెం నిరాశ కలిగింది. సంజీవిగారిని కలిసే అవకాశం లేదు. మరెలా?ఈ సినిమా ఛాన్స్‌ వదులుకోవాల్సిందేనా?! ఆ సమయంలో నాకు తాతినేని చలపతిరావుగారు గుర్తుకు వచ్చారు. ఆయనతో చెప్పిస్తే...? అంత పెద్ద సంగీత దర్శకుడు చెబితే చెంచురామయ్య కాదనే అవకాశం ఉండదు. అందుకే వెంటనే చలపతిరావుగారి ఇంటికి వెళ్లాను. ఆ సమయంలో ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. వెళ్లగానే నమస్కరించి, విషయమంతా వివరించి, ‘మీరు ఓ మాట చెప్పండి సార్‌’ అని రిక్వెస్ట్‌ చేశాను.. ‘సరే.. నేను చెప్తాలే. నువ్వేం వర్రీ అవకు’ అని అంటారనుకున్నాను కానీ ఈసారి ఆయన అంతగా స్పందించలేదు. ‘చెంచురామయ్య ఎవరిమాటా వినడయ్యా..’ అని మాత్రం అన్నారు. ‘ఇక నీ తిప్పలేవో నువ్వేపడు.. పదే పదే నా దగ్గరకు రావద్దు’ అనే భావం చలపతిరావుగారి ముఖంలో కనపడటంతో ఇక ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ‘సరే సార్‌.. వస్తాను’ అని చెప్పేసి బయటకు వచ్చేశాను.

మళ్లీ గ్యాప్‌. ‘మల్లమ్మ కథ’ మిస్‌ కావడంతో నా పరిస్థితి మొదటకు వచ్చినట్లయింది. ఫుడ్డుకీ, బెడ్డుకీ ఇబ్బంది లేదు. ఎప్పుడన్నా డబ్బు అవసరమైతే మొహమాటం లేకుండా పదో పరకో వాళ్ల దగ్గరే తీసుకునేవాడిని. కానీ ఖాళీగా ఎన్ని రోజులని ఉంటాం! పాండీబజార్‌లో ‘హోటల్‌ సుప్రియా’ ఉండేది. ఓసారి ఓ మిత్రుడితో కలసి అక్కడికి భోజనానికి వెళ్లినప్పుడు దాని ఓనర్‌ పరంధామరెడ్డిది మా ఊరే అని తెలిసింది. ఇద్దరం ఒకే ఊరి వాళ్లం కావడంతో అప్పుడప్పుడు కలిసేవాళ్లం. నేను ఖాళీగా ఉన్నానని తెలిసి పరంధామరెడ్డి ధైర్యం చెబుతుండేవారు. తప్పకుండా మంచి రోజులు వస్తాయనేవారు. ఓ కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా ఆయనకి దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి(పి.సి.రెడ్డి)గారు పరిచయం. ఓ రోజు నన్ను పి.సి.రెడ్డిగారి దగ్గరకు తీసుకెళ్లారు పరంధామరెడ్డి. అంతకుముందు ఓ సినిమాకు పనిచేశానని చెప్పగానే పి.సి.రెడ్డి కాదనలేకపోయారు. తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేర్చుకోవడానికి అంగీకరించారు. అలా ‘తల్లీకొడుకులు’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాను.


అందులో కృష్ణగారు హీరో. చంద్రమోహన్‌ మరో హీరో. అంజలీదేవి తల్లి పాత్రధారి. కాంచన కథానాయిక. నిజం చెప్పాలంటే తొలి సినిమా కంటే రెండో సినిమాలోనే ఎక్కువ పని నేర్చుకోగలిగాను. దానికి కారణం పి.సి.రెడ్డిగారి ప్రోత్సాహమే. సీన్‌ పేపర్‌ కాపీ చేసే దగ్గరనుంచి ఆ సీన్‌ను ఆర్టిస్టులకు చదివి వినిపించే స్థాయికి ఎదగగలిగాను. ఆ రోజుల్లో ఆర్టిస్టులు మేకప్‌ చేయించుకుంటూ సీన్‌ వివరిస్తుంటే వినేవారు. డైలాగులతో సహా చెప్పేవాళ్లం. దీనివల్ల ఆర్టిస్టుల దగ్గర కొంత చనువు ఏర్పడింది. చాలా సందర్భాల్లో నా చేత క్లాప్‌ కొట్టించేవారు పి.సి.రెడ్డిగారు.


‘తల్లీకొడుకులు’ చిత్రం వల్ల నాకు జరిగిన మరో మేలు ఏమిటంటే.. ఇళయరాజాతో పరిచయం. ‘తల్లీకొడుకులు’ చిత్రానికి జి.కె. వెంకటేశ్‌ సంగీత దర్శకుడు. ఆయన శిష్యుడు ఇళయరాజా. ఆ రోజుల్లో నాలాంటి అసిస్టెంట్‌ డైరెక్టర్లని కాస్ట్యూమ్స్‌ వ్యాన్‌లో షూటింగ్‌ స్పాట్‌కు చేర్చేవారు. కాస్ట్యూమ్స్‌ వాళ్ల వ్యాన్‌ వాళ్ల సామాగ్రితో సహా తెల్లారి ఐదూ, ఐదున్నరకల్లా ‘ద్వారకా లాడ్జ్‌’ దగ్గరకు వచ్చేది. ఇళయరాజా ఆ రోజుల్లో మైలాపూర్‌ ప్రాంతంలో ఉండేవారు. వ్యాన్‌ బయలుదేరడంతోనే మొదట ఆయన్ని ఎక్కించుకుని, తర్వాత నా దగ్గరకు వచ్చేవారు. అలా ఊరంతా తిరుగుతూ, అవసరమైనవాళ్ళని ఎక్కించుకుని స్టూడియో చేరేసరికి ఏడున్నర అయ్యేది. పలకరిస్తే పలకడంతప్ప ఆ ప్రయాణ సమయంలో ఇళయరాజా పెద్దగా మాట్లాడేవారు కాదు. ఎక్కువ మౌనంగానే ఉండేవారు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...