Jun 8 2021 @ 22:31PM

‘మూడు ముళ్ళ బంధం’.. నిజ జీవితాన్నే కథగా మార్చా: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 9)

అంతా విన్న తర్వాత నాలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఈ సంఘటనను ఓ వైవిధ్యమైన ప్రేమకథగా మలచవచ్చనిపించింది. ముందు ఓ లైన్‌ తయారు చేసుకుని, దాని చుట్టూ సంఘటనలు అల్లాను. చాలా రోజులు ఆ కథ నా దగ్గర అలాగే ఉంది. వీలు దొరికనప్పుడల్లా ఆ కథకు మెరుగులు దిద్దుతూనే ఉన్నాను. మిత్రుడు పొన్నతోట రఘురామ్‌ సినిమా అనగానే నాకు ఆ కథే గుర్తుకువచ్చింది. ‘ఈ కథ ఎలా ఉంటుందో చెప్పండి’ అంటూ క్లుప్తంగా కథ చెప్పగానే అతనికి బాగా నచ్చేసి ‘బ్రహ్మండం.. సూపర్‌’ అనేశారు. వాళ్ల పార్టనర్‌కి కూడా నచ్చడంతో నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఓ ఎనిమిదేళ్ల పిల్లాడు తనకంటే పదేళ్లు పెద్దదైన యువతి మెడలో తాళి కట్టడం ఆ కథలో మెయిన్‌ పాయింట్‌. సినిమాలో ప్రారంభ సన్నివేశమే కల్యాణమండపంలో మొదలవుతుంది. 


మరికొన్ని గంటల్లో పెళ్ళి జరుగుతుందనగా కరెంట్‌ షాక్‌తో పెళ్ళికొడుకు చనిపోతాడు. అంతవరకూ సరదాలు, సంతోషాలతో సందడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా విషాదభరితంగా మారుతుంది. అనుకోని ఈ విషాద సంఘటనతో పెళ్ళికూతురు షాక్‌కు లోనై శిలలా ఉండిపోతుంది. ఈ అనర్ధానికి ఆమే కారణమని పెళ్ళికొడుకు బంధువులు, ఇతరులు ఆడిపోసుకుంటారు. ‘అయ్యో పాపం’ అని ఒక్కరు కూడా జాలిపడరు. దూరం నుంచి ఓ ఎనిమిదేళ్ల కుర్రాడు ఇదంతా గమనిస్తుంటాడు. చనిపోయిన పెళ్ళికొడుకు తమ్ముడతను. ‘దీని మొహానికి తాళి కట్టించుకునే రాతలేదు.. ఇంకా ఈ పెళ్ళి మండపంలో ఎందుకది, బయటకు తోసెయ్యండి’ అంటారు ఎవరో. ఆ మాటలు వింటూ ఆలోచిస్తుంటాడు ఆ కుర్రాడు. ఎదురుగా పెళ్ళిపీటల మీద తాళిబొట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆ తాళి కోసం ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారో అతని చిన్నమనసుకు అర్థం కాదు.

బొమ్మలపెళ్ళిలో సరదాగా తాళి కట్టిన సంఘటన అతనికి గుర్తుకు వచ్చింది. ఆమె మెడలో ఆ తాళి కడితే అక్కడున్న జనమంతా ఆమెను తిట్టడం మానేస్తారనిపించిందతనికి. వెంటనే లేచి వెళ్లి ఆ తాళిని తీసుకొని ఆ యువతి మెడలో కట్టేస్తాడు. అది గమనించి అక్కడున్నవారంతా ఒక్కసారిగా ‘‘అయ్యో.. ఎంత పనిచేశావురా’’ అని అరుస్తారు. ఆ అరుపులకి పెళ్ళికూతురు స్పృహలోకి వస్తుంది. తన మెడలో తాళి... ఎదురుగా ఎనిమిదేళ్ల కుర్రాడు! ఏం జరిగిందో క్షణకాలంపాటు ఆమెకు అర్థం కాదు. ‘‘సిగ్గులేనిదానా.. పసిబిడ్డతో తాళి కట్టించుకుంటావా, అది తీసి అవతల పారెయ్‌’’ అంటారెవరో. ఆ కుర్రాడు జాలిపడి తన మెడలో తాళి కట్టాడన్న విషయం అప్పటికిగానీ ఆమెకు అర్థంకాదు. ఇంతలో ఎవరో ఆమె మెడలో తాళి తీసెయ్యడానికి ముందుకు వస్తారు. 


అంతే ఒక్కసారిగా ఆ యువతి లేచి నిల్చుని ‘‘ఆగండి.. ఇంతసేపూ మీరు నా గురించి రకరకాలుగా మాట్లాడారు. అయినా సహించాను. ఇంతమందిలో ఒక్కరైనా నా తప్పేమీలేదని అన్నారా? కరెంటు షాక్‌ కొట్టి పెళ్ళికొడుకు చనిపోతే నేను అందుకు బాధ్యురాలినా? మీ అందరికంటే ఈ కుర్రాడేనయం. నా మెడలో తాళి కట్టవచ్చో కట్టకూడదో అతనికి తెలీదు. కానీ మీరందరూ నన్ను తిడుతుంటే చూడలేక సానుభూతితో నా మెడలో తాళి కట్టాడు. ఆ తాళిని తెంపే హక్కు మీకెవరిచ్చారు? దేవుడు ఎలా రాసిపెడితే అలా జరుగుతుంది, ఇతనే నా భర్త’’ అని వాళ్లతో వాదించి ఆ కుర్రాడి చెయ్యి పట్టుకుని బయటకు వస్తుంది. ఇక అక్కడినుంచి ‘మూడు ముళ్ల బంధం’ అంటూ టైటిల్స్‌ ప్రారంభమవుతాయి.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

FilmSerialమరిన్ని...