రూ.100 కోట్లతో ‘మ్యాక్సీవిజన్‌’ విస్తరణ

ABN , First Publish Date - 2020-03-11T06:37:44+05:30 IST

మెడికల్‌ డివైసెస్‌, టెక్నాలజీ కంపెనీ ట్రివిట్రాన్‌ హెల్త్‌కేర్‌ గ్రూప్‌నకు చెందిన మ్యాక్సీవిజన్‌ హాస్పిటల్స్‌ తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఐకేర్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేయనుంది. సొంతంగా ఆసుపత్రులను...

రూ.100  కోట్లతో ‘మ్యాక్సీవిజన్‌’ విస్తరణ

మెడికల్‌ డివైసెస్‌ యూనిట్ల ఏర్పాటుకు యోచన

తెలుగు రాష్ట్రాల్లో డయాగ్నోస్టిక్‌ కేంద్రాల ఏర్పాటు

ట్రివిట్రాన్‌ సీఎండీ వేలు


మెడికల్‌ డివైసెస్‌, టెక్నాలజీ కంపెనీ ట్రివిట్రాన్‌ హెల్త్‌కేర్‌ గ్రూప్‌నకు చెందిన మ్యాక్సీవిజన్‌ హాస్పిటల్స్‌ తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ఐకేర్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేయనుంది. సొంతంగా ఆసుపత్రులను ప్రారంభించడంతో పాటు ఇప్పటికే ఉన్న కంటి ఆసుపత్రులను కొనుగోలు చేయడం ద్వారా వచ్చే ఏడాదిన్నర కాలంలో రెండు రాష్ట్రాల్లోని జిల్లా కేంద్రాల్లో ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ట్రివిట్రాన్‌ హెల్త్‌కేర్‌ గ్రూప్‌, మ్యాక్సీవిజన్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌, ఎండీ జీఎ్‌సకే వేలు వెల్లడించారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ‘న్యూబెర్గ్‌’ పేరుతో అందిస్తున్న డయాగ్నోస్టిక్‌ సేవలను విస్తరించనున్నామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సీవిజన్‌ ద్వారా కంటి చికిత్స సేవలు, తమిళనాడులో కావేరీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ ద్వారా వైద్య సేవలతోపాటు డయాగ్నోస్టిక్స్‌, మెడికల్‌ డివైసెస్‌ తయారీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ట్రివిట్రాన్‌ గ్రూప్‌ టర్నోవర్‌ రూ.2,000 కోట్లకు పైగా ఉంది. సంస్థ కార్యకలాపాలు, విస్తరణ అంశాలపై ‘ఆంధ్రజ్యోతి బిజినె్‌స’తో వేలు ఇష్ఠాగోష్టిగా మాట్లాడారు. 


కొత్తగా ఎన్ని మ్యాక్సీవిజన్‌ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారు?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సీవిజన్‌ ఆసుపత్రులు ఉన్నాయి. తాజాగా కరీంనగర్‌లో ఆసుపత్రిని ప్రారంభించటంతో ఈ సంఖ్య 14కి చేరింది. త్వరలో హైదరాబాద్‌లో మరో ఆసుపత్రిని ప్రారంభించనున్నాం. హైదరాబాద్‌లోని 9 ఆసుపత్రులతో సహా తెలంగాణలో పదకొండు, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖ, భీమవరంలో మ్యాక్సీవిజన్‌ కంటి ఆసుపత్రులు నిర్వహిస్తున్నాం. వచ్చే ఏడాది ఏడాద్నిర కాలంలో మొత్తం ఆసపత్రులను 31కి పెంచుకోవాలని భావిస్తున్నాం. హబ్‌ అండ్‌ స్పోక్‌ విధానంలో లెవల్‌ 1,2,3 ఆసుపత్రులను ఏర్పాటు చేస్తాం. ప్రతి జిల్లా కేంద్రంలో ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. తమిళనాడు, కేరళ ఆ తర్వాత కర్ణాటకల్లో ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నాం. ఏడాదిలో తమిళనాడు, కేరళలో 4-5 ఆసుపత్రులను ఏర్పాటు చేసే వీలుంది. 


ఏ మేరకు పెట్టుబడులు పెడుతున్నారు? 

మ్యాక్సీవిజన్‌ ఆసుపత్రుల విస్తరణకు రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాం. వీటిని అంతర్గతంగానే సమకూర్చుకుంటాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశాం. 2019-20లో ఇది రూ.120-130 కోట్లకు చేరే వీలుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.200 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కంటి ఆసుపత్రుల్లో దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉన్నాం. 


తెలుగు రాష్ట్రాల్లో కంటి వైద్య మార్కెట్‌ పరిమాణం?

కార్పొరేట్‌ ఆసుపత్రులతోపాటు చిన్న చిన్న ఆసుపత్రులు, చారిటబుల్‌ ట్రస్ట్‌లు మొదలైనవి అన్నీ కంటి వైద్య సేవలను అందిస్తున్నాయి. అందువల్ల మార్కెట్‌ పరిమాణాన్ని చెప్పలేం. అయితే, ఆకర్షణీయంగా పెరుగుతోంది. రోబోటిక్‌ శస్త్రచికిత్సలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు కంటి వైద్య చికిత్స రంగంలో అందుబాటులోకి వస్తున్నాయి. ఏపీ, తెలంగాణల్లో కార్పొరేట్‌ కంటి వైద్యంలో అగ్రగామిగా ఉన్న మాక్సీవిజన్‌ సమగ్ర, నాణ్యమైన కంటి వైద్యసేవలను అందిస్తోంది. వైద్య సేవలతోపాటు, విద్యా, పరిశోధన రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కంటి వైద్యంలో క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు మ్యాక్సీవిజన్‌ ధ్రువీకరణ పొందిన సంస్థ.


ట్రివిట్రాన్‌కు తెలుగు రాష్ట్రాల్లో యూనిట్ల ఏర్పాటు యోచన ఉందా?

దేశీయంగా చెన్నై, ముంబై, పుణేలో యూనిట్లు ఉన్నాయి. టర్కీ, చైనాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. మొత్తం 4 దేశాల్లో 11 యూనిట్లు ఉన్నాయి. రేడియోగ్రఫీ, బోన్‌డెన్సోమీటర్‌, మాలిక్యులర్‌ డయాగ్నోస్టిక్స్‌ వంటి విభాగాల్లో మెడికల్‌ డివైసె్‌సను తయారు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, తెలంగాణాలో హైదరాబాద్‌లో మెడికల్‌ డివైసెస్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. ఈ మేరకు ప్రభుత్వాలను కూడా కలిశాం. అయితే, పెట్టుబడులు, ఏం తయారు చేయాలన్న దానిపై ఇప్పటి వరకూ ఎటువంటి ప్రణాళికలు లేవు. చెన్నైలో 25 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్లాంట్‌లో గత ఏడేళ్లలో అనేక ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశాం. మేం ఉత్పత్తి చేసే కొన్ని ఉత్పత్తులను ఇక్కడ తయారు చేయగలమా అని ఆలోచిస్తున్నాం.


తెలుగు రాష్ట్రాల్లో ఇతర వ్యాపారాల విస్తరణ ప్రణాళికలు?

న్యూబెర్గ్‌ పేరుతో డయాగ్నోస్టిక్‌ సేవలను తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాలని భావిస్తున్నాం. హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా సేవలు అందిస్తున్నాం. కరీంనగర్‌లో తాజాగా న్యూబెర్గ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. 2020 చివరి నాటికి తెలంగాణలో మరో 10 ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని న్యూబెర్గ్‌ డయాగ్నోస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యోచిస్తోంది. రెండు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో న్యూబెర్గ్‌  కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అపోలో హాస్పిటల్స్‌తో కలిసి అపోలో వైట్‌ డెంటల్‌, అపోలో డయాలిసిస్‌ క్లినిక్‌లను నిర్వహిస్తున్నాం.         

- హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌)

Updated Date - 2020-03-11T06:37:44+05:30 IST