Abn logo
Apr 9 2021 @ 00:17AM

మైహోమ్‌ ఇంటిగ్రేటెడ్‌ ఐటీ హబ్‌

రూ.14,600 కోట్ల పెట్టుబడి

ఆసియాలోనే అతిపెద్ద కమర్షియల్‌ ప్రాజెక్టు

8-10 సంవత్సరాల్లో పూర్తి 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అన్ని విభాగాల్లో మరింత వేళ్లూనుకునే లక్ష్యంతో హైదరాబాద్‌కు చెందిన మైహోమ్‌ గ్రూప్‌ భారీ ప్రాజెక్టులను చేపడుతోంది. వచ్చే పదేళ్ల నాటికి గ్రూప్‌ టర్నోవర్‌ను రూ.40,000 కోట్లకు పెంచుకోవాలని భావిస్తోంది.  భవిష్యత్తు లో బెంగళూరు, పుణె నగరాలకు విస్తరించే ఉద్దేశంలో ఉంది. విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో అతిపెద్ద కమర్షియల్‌ ప్రాజెక్టును చేపడుతోంది. ఆసియాలోనే ఇది అతిపెద్ద ఆఫీస్‌ స్పేస్‌ ప్రాజెక్టు అవుతుందని మై హోమ్‌ కనస్ట్రక్షన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ రావు జూపల్లి తెలిపారు. దీన్ని ఇంటిగ్రేటెడ్‌ ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయనున్నామని వివరించారు. 70-80 ఎకరాల్లో 8-10 ఏళ్లలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారు. ప్రాజెక్టు అభివృద్ధికి దాదాపు 2 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.14,600 కోట్లు) అవుతుంది.  2.5-2.7 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్థలం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. మై హోమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రారంభమై 35 సంవత్సరాలైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఎస్‌ఈజెడ్‌), నాన్‌ ఎస్‌ఈజెడ్‌ ఐటీ భవనాలు, కాన్ఫరెన్స్‌, మీటింగ్‌ భవనాలు, స్టార్‌ హోటళ్లు, రిటైల్‌ మాల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మొదలైన అన్ని రకాల సదుపాయాలు ఇందులో ఉంటాయి. గురుగావ్‌లో డీఎల్‌ఎఫ్‌ అభివృద్ధి చేసిన సైబర్‌ హబ్‌ తరహాలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని మైహోమ్‌ భావిస్తోంది.


మొదటి దశ నిర్మాణ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వచ్చే 6-8 నెలల్లో కమర్షియల్‌ స్పేస్‌కు గిరాకీ తక్కువగా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఊపందుకోగలదని శ్యామ్‌ రావు అన్నారు. తెల్లాపూర్‌లో 250 నుంచి 400 ఎకరాల్లో టౌన్‌షిప్‌ ప్రాజెక్టులను మైహోమ్‌ చేపట్టనుంది. 15-20 ఎకరాల్లో ఒక్కొక్క ప్రాజెక్టు ఉంటుందన్నారు.


రూ.6,000 కోట్ల టర్నోవర్‌..

ప్రస్తుతం మైహోమ్‌ గ్రూప్‌ రియల్‌ ఎస్టేట్‌, సిమెంట్‌ తదితర రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గ్రూప్‌ టర్నోవర్‌ రూ.6,000 కోట్లు ఉంది. ఇందులో రియ ల్‌ ఎస్టేట్‌ విభాగం టర్నోవర్‌ రూ.3,200 కోట్లు ఉన్నట్లు తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని భారీ ప్రాజెక్టుల కారణంగా పదేళ్లలో గ్రూప్‌ టర్నోవరు రూ.40,000 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నా రు. ప్రస్తుతానికి పబ్లిక్‌ ఇష్యూకు వచ్చే అలోచన లేదని శ్యామ్‌ రావు తెలిపారు. కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి 2.7 కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని ఖాతాదారులకు మైహో మ్‌ గ్రూప్‌ అందించింది. ఈ ఏడాది చివరి నాటికి మరో 80 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఖాతాదారులకు అందించనుంది. అప్పుడు మొత్తం 35 మిలియన్‌ చ.అ స్థలాన్ని విక్రయించినట్లవుతుంది. కంపెనీ మొత్తం 25 ప్రాజెక్టుల్లో 10 వేల మంది ఖాతాదారులు ఉన్నారు. 35 ఏళ్ల ప్రస్థానంలో 10 వేల కుటుంబాల మనసుల్లో శాశ్వతంగా నిలిపోయేలా నాణ్యమైన గృహాలు అందించామని మైహోమ్‌ గ్రూప్‌ చైర్మన్‌ రామేశ్వర్‌ రావు జూపల్లి అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement