ఇలా అయితే ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్తాం!

ABN , First Publish Date - 2021-09-09T06:11:03+05:30 IST

ఇలా అయితే..

ఇలా అయితే ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని వెళ్తాం!

‘నవ’గ్రహణం 

మైలవరంలో పేట్రేగిపోతున్న నవరత్నాల ఇన్‌చార్జ్‌లు 

అక్రమ సంపాదనే ధ్యేయం 

అండగా మైలవరం కంసుడు

బామ్మరిది ఆధ్వర్యంలో వసూళ్ల పర్వం 

విసిగిపోతున్న అధికార పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు 


విజయవాడ: మైలవరం నియోజకవర్గానికి ‘నవ’గ్రహణం పట్టింది. అధికార పార్టీకి చెందిన తొమ్మిది మంది ఇన్‌చార్జ్‌లదే ఇక్కడ పెత్తనమంతా. మైలవరం కంసుడి అనుచురులైన ఈ తొమ్మిది మందీ నియోజకవర్గంలో ఉన్న సహజ వనరులను అడ్డగోలుగా దోచేస్తున్నారు. సెంటు పట్టాను అడ్డు పెట్టుకొని కోట్లు కొల్లగొట్టారు. కొండపల్లి అభయారణ్యంలో గ్రావెల్‌ రూపంలో కోట్లు కుమ్మేశారు. నియోజకవర్గంలో ఉన్న ల్యాండ్‌, శ్యాండ్‌, వైన్‌, మైన్‌ అన్నింటినీ ఇష్టానుసారంగా దోచేస్తున్నారు. నవరత్నాల ఫలాలను అడ్డు పెట్టుకొని అమాయక మహిళల మాన ప్రాణాలకు వెల కడుతున్నారు. 


మైలవరం కంసుడు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు నందిగామ నుంచి తన అనుచరులను తీసుకువచ్చి ఇన్‌చార్జ్‌లుగా నియమించాడు. నియోజకవర్గం మొత్తం మీద తొమ్మిది మందికి పెత్తనం అప్పగించాడు. తన చేతికి మట్టి అంటకుండా అన్ని రకాల వసూళ్లు వారితో చేయిస్తున్నాడు. ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్ములను వారి ద్వారా పలు రూపాల్లో వసూలు చేయిస్తున్నాడు. ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారు. ఇటీవల ఓ ప్రాంత ఇన్‌చార్జ్‌ రాసలీలలు బయట పడటంతో అక్రమంగా సంపాదించిన డబ్బు నుంచి లక్షలు చెల్లించి, బాధిత మహిళతో సెటిల్‌ చేసుకున్నాడు. దీంతో ఇన్‌చార్జ్‌ల తీరుపై అధికార పార్టీలోనే తీవ్ర చర్చ నడుస్తోంది. ఇలా అయితే ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని వెళతామని స్థానిక నాయకత్వం తలలు పట్టుకుంటోంది.


కొండపల్లి మున్సిపాలిటీలో ఇటీవల చేపట్టిన పక్కా డ్రెయినేజీ పనుల్లో నాణ్యత లోపం కారణంగా సుమారు 100 మీటర్ల మేర డ్రెయినేజీ నేల కూలింది. అయినా పనులు చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు శూన్యం. ఇలా ఒకటేమిటి అభివృద్ధి పనుల్లో అంతులేని అవినీతి, సంక్షేమ పథకాల వర్తింపులో పక్షపాతం, ప్రలోభాల పర్వం, అతివలకు వేధింపుల పర్వం, నచ్చని నాయకులను కేడర్‌కు దూరం చేయడం ఇలా ఇన్‌చార్జ్‌లు వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతోంది. ఇన్‌చార్జ్‌ల తప్పులపై కంసుడు చర్యలు తీసుకోడు. అన్నీ ఆయనకు తెలిసినా, ఏం తెలియనట్టు నటిస్తుంటాడు. ఈ బాగోతాలను వెలుగులోకి తీసుకువచ్చే మీడియాపై బహిరంగ సమావేశాల్లో కంసుడు బూతు పురాణం విప్పుతాడు. ఇన్‌చార్జ్‌లను అడ్డుపెట్టుకొని తాను సాగిస్తున్న అవినీతి అక్రమాలు బయటకు వస్తే అధినేత వద్ద అక్షింతలు పడతాయనే ఉద్దేశంతో అంతా మీడియా సృష్టేనని కట్టుకథలల్లుతాడు. ఇన్‌చార్జ్‌ల తీరుతో విసిగిపోయిన స్థానిక నేతలు ఈ విషయాన్ని అధిష్ట్ఠానం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.


తలలు పట్టుకుంటున్న ద్వితీయశ్రేణి నాయకులు 

మైలవరం నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులకు, కార్యకర్తలకు విలువే లేకుండా పోయింది. మొత్తం నందిగామ నుంచి వచ్చిన ఇన్‌చార్జ్‌లదే ఇక్కడ పెత్తనమంతా. పార్టీని నమ్ముకొని ఆది నుంచి జెండాలు మోసి, ఆస్తులను కరిగించుకొని, కేడర్‌ను కాపాడుకున్న అధికార పార్టీ స్థానిక నేతలకు ఇన్‌చార్జ్‌లు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ప్రతి చిన్న పనికీ ఇన్‌చార్జ్‌లను ఆశ్రయించాల్సి రావడం స్థానిక నేతలకు ఏమాత్రం రుచించడం లేదు. ఏపని చెప్పినా కంసుడు ఇన్‌చార్జ్‌లకు చెప్పమనడం, వారు చులకనగా చూడడంతో తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక స్థానిక నేతలు లోలోపల మదనపడుతున్నారు. అడిగిన పని చేయకపోయినా పర్వాలేదు. కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. 


బీసీ నేతలకు చెక్‌

మైలవరం నియోజకవర్గంలోని బీసీ నేతలకు కంసుడు తెలివిగా చెక్‌ పెట్టాడు. మైలవరానికి చెందిన ఒక బీసీ నేతకు కీలక పదవి ఇచ్చినట్టే ఇచ్చి, అతనికి పోటీగా ఓ ఇన్‌చార్జ్‌ని నియమించాడు. దీంతో బీసీ నేతకు దిమ్మతిరిగిపోయింది. ఇప్పుడు ఆ బీసీ నేతకు, ఇన్‌చార్జ్‌కి పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అలాగే నియోజకవర్గంలోని ఓ పెద్ద మండలంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు గత 10 ఏళ్లుగా పార్టీని బతికిస్తూ వస్తున్నారు. వారిని కాదని తన సొంత మనిషిని ఆ మండలంలో ఇన్‌చార్జ్‌గా నియమించడం ద్వారా, ఆ మండలంలోని బీసీ నేతలకు చెక్‌ పెట్టాడు. బీసీ నేతలపై ఆయనది కపట ప్రేమ అని ఇన్‌చార్జ్‌ల పాలన ద్వారా తేటతెల్లమైంది. 


మొత్తం అక్కడి నుంచే

మైలవరంలో అధికార పార్టీ ముఖ్యనేతకు స్థిర నివాసం లేదు. వ్యవహారాలన్నీ నందిగామ నుంచే నడుపుతున్నారు. ఆయనను కలవాలంటే స్థానిక నేతలు అక్కడికి పరుగులు పెట్టాల్సి వస్తోంది.. కొండపల్లిలో సొంత ఇల్ల్లు కట్టుకుంటానని ఎన్నికలకు ముందు చెప్పిన ఆ నేత, ఆ దిశగా అడుగులు వేయడం లేదు. మైలవరం నియోజకవర్గంపై సవతి ప్రేమ కనబరుస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.  



Updated Date - 2021-09-09T06:11:03+05:30 IST