మనసు లగ్నం కావడం లేదెలా?

ABN , First Publish Date - 2020-03-11T05:34:07+05:30 IST

సుమారు రెండేళ్లుగా ఓ ప్రైవేట్‌ కంపెనీలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నా. ఆత్మస్తుతి కాదు కానీ, ఒక ట్యాలెంటెడ్‌ ఆఫీసర్‌గా నాకు మంచి పేరే వచ్చింది. అయితే, ఆఫీసు కార్యకలాపాల్లో భాగంగా మా అసిస్టెంట్‌ మేనేజర్‌కూ...

మనసు లగ్నం కావడం లేదెలా?

సుమారు రెండేళ్లుగా ఓ ప్రైవేట్‌ కంపెనీలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నా. ఆత్మస్తుతి కాదు కానీ, ఒక ట్యాలెంటెడ్‌ ఆఫీసర్‌గా నాకు మంచి పేరే వచ్చింది. అయితే, ఆఫీసు కార్యకలాపాల్లో భాగంగా మా అసిస్టెంట్‌ మేనేజర్‌కూ, నాకూ  సాన్నిహిత్యం ఏర్పడింది. క్రమంగా అది ప్రేమగా మారింది కూడా! ఇప్పుడొచ్చిన సమస్య ఏమిటంటే, ఆఫీసు బాధ్యతల విషయంలో నా ఏకాగ్రత తగ్గిపోయింది. అప్పుడప్పుడు కొన్ని తప్పులు కూడా జరిగిపోతున్నాయి దీనివల్ల యాజమాన్యం నుంచి విమర్శలు వస్తున్నాయి.  దీనికంతటికీ నిరంతరం నా మనసు అతని పైన లగ్నమై ఉండడమేనని నాకు తెలుస్తూనే ఉంది. అయినా, నా మనసును నియంత్రించలేకపోతున్నా. నాకు తెలిసి ఈ సమస్యకు ఓ రెండు పరిష్కారాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి అతనితో నాకున్న ప్రేమను తెంచేసుకోవడం! రెండోది ఈ ఉద్యోగం వదిలేసి వేరే రాష్టంలో ఎక్కడో ఉద్యోగం చూసుకోవడం! కానీ, ఈ రెండింటిలో ఏ ఒక్కటీ నాకు సాధ్యం కాదనేది వాస్తవం.  అలాగనీ, పెళ్లికి సిద్ధం కావడం అంటే నా భవిష్యత్‌ ప్రణాళికలకు పాతర వేయడమే అవుతుంది. అటూ ఇటూ కాని ఈ స్థితిలో నన్ను ఏం చేయమంటారు?


- ఎన్‌. లాస్య, రంగారెడ్డి జిల్లా


మెదడుతో పనిచేసే చోట హృదయాన్ని ఉంచితే ఇలాంటి చిక్కులే వచ్చిపడతాయి మరి! ఆఫీసును ఆఫీసుగానే... కొలీగ్‌ను కొలీగ్‌గానే చూడడం చాలా అవసరం. అలా అయితేనే, ఎవరి హృదయాలు వారి చేతుల్లో భద్రంగా ఉంటాయి. ఒకవేళ హృదయానికి స్వేచ్ఛ ఇచ్చారే అనుకోండి... దాన్ని ఒక స్థాయిలో నియంత్రించడం కూడా తెలియాలి. ఆ శక్తి లేనప్పుడు మనసు మనసులో ఉండదు. దాని వల్ల పలురకాల తప్పులు జరిగిపోతాయి. నిజానికి, భావోద్వేగాలు చాలా చిత్రమైనవి. అవి  కొందరిని శక్తిమంతుల్ని చేస్తే, మరికొందరిని బలహీనపరుస్తాయి. మీ విషయంలో ఆ రెండోదే జరిగింది. మీ దృష్టికి వచ్చినట్లు లేదు గానీ, ఆఫీసు వ్యవహారాల్లో ఎంతో బాధ్యతాయుతంగా ఉండే ప్రేమికులు ఎంతమంది లేరు? మీరు అలా ఉండలేకపోవడం అనేది మీ మానసిక బలహీనతే తప్ప మరొకటి కాదు. అయినా, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం అంటే, భవిష్యత్‌  ప్రణాళికలన్నింటికీ పాతర వేయడమే అన్న ఒక తీవ్రమైన భావన మీలో ఉన్నప్పుడు అసలు ఆ వైపు ఎందుకు అడుగులు వేసినట్లు? ఊగే స్తంభం ఊగీ ఊగీ ఎటువైపు పడిపోతుందో దానికే తెలియదు. మీ  పరిస్థితి కూడా అలాగే ఉంది. కాస్త నిలకడగా, నిబద్ధతగా ఉండడం అలవర్చుకోండి. ఉద్యోగం చేస్తున్నప్పుడు దాని పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రేమించినప్పుడు దానిపట్ల నిబద్ధతగా ఉండాలి. ప్రేమ కారణంగా ఉద్యోగానికి దెబ్బ రాకూడదు. ఉద్యోగం కారణంగా ప్రేమకు ముప్పు రాకూడదు. ఆ రెండింటినీ వేర్వేరుగా ఉంచడం మీకూ, మీ భవిష్యత్తుకూ చాలా అవసరం.


డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చింతపంటి, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌, హైదరాబాద్‌

Updated Date - 2020-03-11T05:34:07+05:30 IST