పైపై పూత.. ‘నాడు-నేడు’లో మేత!

ABN , First Publish Date - 2020-08-13T15:57:02+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రవేశపెట్టిన..

పైపై పూత.. ‘నాడు-నేడు’లో మేత!

పనుల్లో అడ్డగోలు అవినీతి

నిద్రావస్థలో విద్యా, ఇంజనీరింగ్‌ సిబ్బంది


సీతారామపురం(నెల్లూరు): ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రవేశపెట్టిన నాడు - నేడు పథకంలో అవినీతి చోటుచేసుకుంటోంది. పనుల నిర్వహణ పేరిట కొందరు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారు. కరోనా సాకుతో విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తుండటంతో సీతారామపురం మండలంలో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తున్నాయి. పాఠశాల కమిటీలు, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో జరగవలసిన పనులను కొంతమంది అధికార పార్టీ నాయకులు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్వలు గుప్పుమంటున్నాయి.


రికార్డుల్లో మాత్రం కమిటీల పేరుతో పారదర్శకంగా పనులు జరుగుతున్నట్లు విద్యాశాఖ అధికారులు నమోదు చేస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నారు. మండలంలోని 15 పాఠశాలల్లో నాడు - నేడు పఽథకం ద్వారా పనులు చేసేందుకు రూ.2.96 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అందులో రూ.1,08,06,000 విడుదల చేయగా వాటిలో రూ.85,78,000 ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే, చేపట్టిన పనుల్లో ఎక్కడా ఎస్‌ఎ్‌సఆర్‌ను అమలు చేయడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. పాఠశాలల్లో ప్రహరీలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, నీటి వసతి, శిఽథిల భవనాలకు మరమ్మతులు వంటి పనులు చేపట్టాల్సి ఉండగా, పలుచోట్ల ఇష్టానుసారంగా చేసి నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో చేయాల్సిన పనులకు పైపై మెరుగులు దిద్ది లక్షలాది రూపాయల నిధులను కాజేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు బోగట్టా.  స్థానిక ఆదర్శ పాఠశాలలో బాగున్న మెట్లను పగులగొట్టి పైపై మెరుగులు దిద్దుతున్నారు.


దేవమ్మచెరువు, పీఆర్‌ దొడ్ల, నెమళ్లదిన్నె, సింగారెడ్డిపల్లి, పబ్బులేటిపల్లి తదితర గ్రామాల్లోని పాఠశాలల్లో పాత వాటికే మరమ్మత్తులు చేస్తూ కొత్తగా నిర్మించినట్లు సృష్టిస్తున్నారు. అలాగే కొన్ని పాఠశాలల్లో మురుగుదొడ్లు బాగానే ఉన్నా పనులు కల్పించి సొమ్ము చేసేందుకు వీలుగా మరమ్మతులు చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కమిటీ  చైర్మన్లు, ప్రధానోపాధ్యాయుల మధ్య సమన్వయం కొరవడటంతో మెటీరియల్‌ కొనగోళ్లలో కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడుతూ నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తున్నారు. మరోవైపు విద్యుత్‌ సామగ్రి కొనుగోళ్లలో కూడా బిల్లులు అధికంగా చూపడం, తక్కువ మంది కూలీలతో పనులు చేయించి రికార్డుల్లో ఎక్కువ మంది పేర్లు నమోదు చేసి దోచుకుంటున్నారు. ఏది ఏమైనా జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి మండలంలో జరుగుతున్న నాడు - నేడు పనుల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయకపోతే పెద్ద ఎత్తున నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉంది.  


సక్రమంగానే జరుగుతున్నాయి 

మండలంలో నాడు - నేడు పనులు సక్రమంగానే జరుగుతున్నాయి. మరమ్మతు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పాఠశాలల రూపురేఖలు మార్చి ఆకర్షణీయంగా ఉండేలా పనులు చేయిస్తున్నాం.

- అహ్మద్‌బాషా, సమగ్రశిక్ష ఏఈ


Updated Date - 2020-08-13T15:57:02+05:30 IST