కొత్త సొబగులు!

ABN , First Publish Date - 2021-04-17T05:41:51+05:30 IST

‘నాడు-నేడు’ పథకంలో భాగంగా ఫేజ్‌-1లో 247 కొత్త భవనాల నిర్మాణం, 172 పాత భవనాలను అధునీకరించడానికి నిర్ణయించారు. గృహా నిర్మాణ శాఖ పర్యవేక్షణలో జరిగే ఈ పనులు తొలు

కొత్త సొబగులు!
నాడు-నేడులో భాగంగా ఆధునికీకరణ పనులకు గుర్తించిన శ్రీనివాసకాలనీలో అంగన్‌వాడీ కేంద్రం




అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘నాడు-నేడు’ పనులు

పాత భవనాలను ఆధునీకరించడం, కొత్తవాటి నిర్మాణం

సెప్టెంబరు 30లోగా పూర్తిచేయాలని లక్ష్యం

కమిటీల ఏర్పాటు, శిక్షణలో జాప్యం

గడువులోగా పూర్తి అనుమానమే..

(శృంగవరపుకోట)

 అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మారనున్నాయి. పాత భవనాలను ఆధునీకరించడంతో పాటు కొత్త వాటి నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘నాడు-నేడు’ పనుల్లో భాగంగా పనులు చేపట్టేందుకు నిర్ణయించింది. నిర్వహణ బాధ్యతలను స్త్రీ శిశు సంక్షేమ శాఖకు అప్పగించింది. ఇందుకుగాను కమిటీలను నియమించనున్నారు. గురువారం ప్రాజెక్టుల వారీగా శిక్షణలు ఇస్తున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

‘నాడు-నేడు’ పథకంలో భాగంగా ఫేజ్‌-1లో 247 కొత్త భవనాల నిర్మాణం, 172 పాత భవనాలను అధునీకరించడానికి నిర్ణయించారు. గృహా నిర్మాణ శాఖ పర్యవేక్షణలో జరిగే ఈ పనులు తొలుత ఏప్రిల్‌ 1 నుంచే ప్రారంభించేందుకు నిర్ణయించారు. సెప్టెంబరు 30లోగా పనులు పూర్తిచేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇంకా కమిటీల నియామకాన్ని పూర్తిచేయలేదు. ఇప్పటికే పక్షం రోజులు దాటడంతో సకాలంలో పనులు పూర్తి సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా కమిటీల నియామకంలో ఎడతెగని జాప్యం జరిగింది. ఈ కమిటీలో అంగన్‌వాడీ కార్యకర్త, సూపర్‌వైజర్‌, మహిళ సంరక్షణ కార్యదర్శి, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ (కన్వీనర్‌), 2 నుంచి 4 సంవత్సరాల వయస్సు పిల్లల తల్లి (అంగన్‌ వాడీ కేంద్రంలో నమోదై ఉండాలి) తదితరులతో అభివృద్ధి కమిటీలను నియమించారు. వీరందరికి ప్రస్తుతం శిక్షణనిస్తున్నారు. నాడు-నేడు అభివృద్ధి పనులు ఏలా చేయాలో అవగాహన కల్పిస్తున్నారు. కొత్త భవన నిర్మాణానికి రూ.12.45 లక్షలు, పాత భవనాల అధునికీకరణకు రూ.5.50 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ఉమ్మడి ఖాతాలో నిధులు జమ అవుతాయి. అందరి ఆమోదంతోనే నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన నాటికే మరో నెల రోజులు దాటే అవకాశముందని..ఈ లెక్కన గడువులోగా పనులు పూర్తిచేయడం సాధ్యమయ్యే పనికాదని అధికారులు చెబుతున్నారు.


సకాలంలో పనులు

జిల్లావ్యాప్తంగా కమిటీలను ఏర్పాటుచేశాం. వాటికి శిక్షణనిస్తున్నాం.  శనివారం నాటికి ప్రక్రియ పూర్తవుతుంది. రెండురోజులుగా ప్రాజెక్టుల వారీగా సీడీపీవోలు శిక్షణనిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం. పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తాం. సకాలంలో పనులు పూర్తిచేస్తాం

-ఎం.రాజేశ్వరి, ఐసీడీఎస్‌ పీడీ, విజయనగరం





Updated Date - 2021-04-17T05:41:51+05:30 IST