మేం పారిపోలేదు.. వాళ్లే కాల్పులు జరిపారు: నాగాలాండ్ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ వ్యక్తి

ABN , First Publish Date - 2021-12-08T23:06:23+05:30 IST

డిసెంబర్ 4వ తేదీ నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో కూలీలతో వెళ్తున్న వాహనంపై ఆర్మీ జవాన్లు కాల్పులు జరపడంతో 13 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మాటలకు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చెబుతున్న..

మేం పారిపోలేదు.. వాళ్లే కాల్పులు జరిపారు: నాగాలాండ్ ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డ వ్యక్తి

గువహాటి: డిసెంబర్ 4వ తేదీ నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో సాయంత్రం నాలుగు గంటల సమయంలో కూలీలతో వెళ్తున్న వాహనంపై ఆర్మీ జవాన్లు కాల్పులు జరపడంతో 13 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మాటలకు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చెబుతున్న మాటలకు పొంతన కుదరడం లేదు. ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందని, మిలిటరీ సిగ్నల్ ఇచ్చినప్పటికీ వాహనం కదలడంతో ఉగ్రవాదులనే అనుమానంతో కాల్పులు జరిపారని లోక్‌సభలో అమిత్ షా చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొద్ది మేరకు కోలుకున్న 23ఏళ్ల షివాంగ్ అనే వ్యక్తి మాత్రం ఇందుకు విరుద్దంగా స్పందించాడు. తమ వాహనాన్ని ఆపమన్నట్లు ఎలాంటి సంకేతాలు రాలేదని, తమ వాహనం దిగి పారిపోయే ప్రయత్నం కూడా చేయలేదని, చూస్తుండగానే తమపై కాల్పులు జరిపారని, ఏం జరుగుతుందో తెలిసే లోపు బుల్లెట్లు తమ శరీరంలోకి దిగాయని చెప్పుకొచ్చాడు.


ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడి అస్సాం మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రిలో చావుతో పోరాడి బయటపడ్డ ఇద్దరు వ్యక్తుల్ని ఓ జాతీయ మీడియా ప్రశ్నించింది. అనంతరం షివాంగ్ మాట్లాడుతూ ‘‘నేను వారం రోజులుగా మైనింగ్‌లో పని చేస్తున్నా. ఆరోజు సాయంత్రం 3 గంటలకు పని ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యాము. మార్గమధ్యంలో ఒక్కసారిగా బాంబులు పేలుతున్న శబ్దం వినిపించింది. చూస్తుండగానే తుపాకీ తూటాలు మావైపే వస్తున్నాయి. వాహనంలో ఉన్న వారి శరీరాల్లోకి తూటాలు దిగుతున్నాయి. అంత చీకటి కూడా ఏం లేదు. వాళ్లు మాపై చాలా సేపు కాల్పులు జరిపారు’’ అని చెప్పుకొచ్చాడు. ఇంకా మాట్లాడుతూ ‘‘చాలా సమయం తర్వాత నన్ను వేరే వాహనం ఎక్కించారు. నా సోదరుడు సహా కొంత మంది చనిపోయినట్లు నాకు తర్వాత తెలిసింది. కానీ మా చేతుల్లో ఏమీ లేదని అర్థమైంది’’ అని షివాంగ్ చెప్పాడు.

Updated Date - 2021-12-08T23:06:23+05:30 IST