నగర పంచాయతీల్లో రసవత్తర పోరు

ABN , First Publish Date - 2021-02-28T05:26:49+05:30 IST

పురపాలక పోరు ఊపందుకుంది. ఉత్కంఠను రేపిన కోర్టు తీర్పు కూడా వెల్లడి కావటంతో ప్రధాన పార్టీలు, ముఖ్యంగా పోటీలో ఉన్న అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాల్లో వేగం పెంచారు. అధికార పార్టీ నాయకులు సామ,దాన,భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నప్పటికీ, ఎక్కువ చోట్ల టీడీపీ నాయకులు వెరవకుండా పోటీకి సై అంటున్నారు.

నగర పంచాయతీల్లో రసవత్తర పోరు
అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం (ఫైల్‌)

నాలుగుచోట్ల  హోరాహోరీ

గిద్దలూరులో తేలని చైర్మన్‌ అభ్యర్థి

కనిగిరిలో బెదిరింపుల పర్వం

చీమకుర్తి వైసీపీలో వర్గపోరు

తీవ్ర పోటీకి సిద్ధమవుతున్న టీడీపీ

అద్దంకిలో అభ్యర్థులు అదృశ్యం 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలోని నాలుగు నగర పంచాయతీల్లో పోరు రసవత్తరంగా మారింది. అన్నిచోట్లా పోటాపోటీ వాతావరణం నెలకొంది. పలుచోట్ల వైసీపీకి చైౖర్మన్‌ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇంకోవైపు ఏకగ్రీవాల కోసం అధికారపార్టీ నాయకులు బెదిరింపులు, ప్రలోభాల పర్వానికి పూర్తిస్థాయిలో తెరతీశారు. అయినా మేముంటామంటూ టీడీపీ, కొన్నిచోట్ల జనసేన పక్షాన అభ్యర్థులు ముందుకు రావటంతో క్రమేపీ ప్రధాన పార్టీల మధ్య పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కొన్ని నగర పంచాయతీల్లో వైసీపీకి వర్గపోరు సమస్యగా మారింది. అధికారం, డబ్బును ఉపయోగించి లబ్ధి పొందేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అద్దంకిలో ఓ వార్డు నుంచి టీడీపీ తరఫున నామినేషన్‌ వేసిన ఇద్దరు, వైసీపీ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన వారిలో ఒకరు అదృశ్యమయ్యారు. అక్కడ వ్యవహారం ఏ మలుపుతిరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. 


పురపాలక పోరు ఊపందుకుంది. ఉత్కంఠను రేపిన కోర్టు తీర్పు కూడా వెల్లడి కావటంతో ప్రధాన పార్టీలు, ముఖ్యంగా పోటీలో ఉన్న అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాల్లో వేగం పెంచారు. అధికార పార్టీ నాయకులు సామ,దాన,భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నప్పటికీ, ఎక్కువ చోట్ల టీడీపీ నాయకులు వెరవకుండా పోటీకి సై అంటున్నారు. 


గిద్దలూరులో సరికొత్త తలనొప్పి

గిద్దలూరులో ఇప్పటివరకూ అధికారపార్టీ చైర్మన్‌ అభ్యర్థిగా ఆర్డీ రామకృష్ణ పేరు ప్రచారంలో ఉంది. ఆయన బీసీ కాదని, ఆ వర్గంలో అత్యధికంగా ఉన్న తమని ఎలా విస్మరిస్తారంటూ యాదవ సామాజికవర్గం నాయకులు తీవ్రస్థాయిలో వ్యతిరేకత తెలిపారు. దీంతో ఎమ్మెల్యే అన్నా రాంబాబు శుక్రవారం సాయంత్రం హడావుడిగా ఒక ప్రకటన విడుదల చేస్తూ తామింకా ఛైర్మన్‌ అభ్యర్థిని నిర్ణయించలేదని, ఎన్నికల అనంతరం పార్టీ ప్రకటిస్తుందని వివరణ  ఇచ్చుకున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో అసంతృప్తులు, అధికారపార్టీకి రెబల్‌ అభ్యర్థుల పేరుతోనూ, నేరుగా తెలుగుదేశం అభ్యర్థుల నుంచి వచ్చిన విజయాలను చూసి టీడీపీ నేత అశోక్‌రెడ్డి మున్సిపల్‌ ఎన్నికలపై మరింత దృష్టిపెట్టారు. 20 వార్డుల్లో నాలుగైదు వార్డులను వైసీపీ కచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నట్లే మూడు నాలుగు వార్డులను టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఘంటాపథంగా చెప్పవచ్చు.  దీంతో రానున్న రోజుల్లో రాజకీయ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని అటు అన్నా రాంబాబుతోపాటు, ఇటు టీడీపీ పక్షాన మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి కూడా రంగంలోకి రావటంతో ఇరుపక్షాల మధ్య పోటీ తీవ్రత పెరిగింది.  


కనిగిరిలో రెచ్చిపోతున్న అధికార పార్టీ నేతలు

కనిగిరిలో అయితే పంచాయతీ ఎన్నికల తరహాలోనే బెదిరింపులు, ప్రలోభ రాజకీయాలకు వైసీపీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇటీవల ప్రతిరోజూ తెల్లవారుజామునే ప్రజలతో చాయ్‌ కార్యక్రమం పేరుతో మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి చేసిన పర్యటనకు విశేష ప్రజాస్పందన వచ్చింది. దీంతో టీడీపీ తరపున నామినేషన్‌ వేసిన వారిలో ఆరేడు మందిని అధికార పార్టీ నాయకులు ఎంపిక చేసుకుని వారు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు బెదిరింపులు, ప్రలోభ రాజకీయాలను ప్రారంభించారు. మీ షాపు రోడ్డు పక్కనే ఉంది, తొలగిస్తాం జాగ్రత్త అంటూ ఒక అభ్యర్థిని సాక్షాత్తూ అధికారపార్టీ ప్రజాప్రతినిధే బెదిరించటం అందుకు నిదర్శనం. నీ కుటుంబంలో చాలామంది ఉద్యోగులున్నారు, వారి సంగతీ చూస్తామంటూ మరికొందరిని హెచ్చరించారు. ఆర్థిక అవసరాల కోసం లొంగేవారిని ప్రలోభపెట్టడం కూడా పెరిగిపోయింది. అయితే అందుకు లొంగకుండా కొంతమంది ధైర్యంగా నిలబడుతుండటం కనిపిస్తోంది. 15కి పైగా వార్డుల్లో పోటీ తీవ్రంగా ఉంటుందా లేక పోటీ తీవ్రత 10 వార్డులకే పడిపోతుందా అనేది బెదిరింపు రాజకీయాల ప్రభావానికి అనుగుణంగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.


చీమకుర్తిలో వర్గపోరు

చీమకుర్తిలోనూ అధికార పార్టీలో అసంతృప్తి, వర్గ రాజకీయాల జోరు అధికంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఎన్నికల ఎత్తుగడలలో పూర్తిస్థాయి అనుభవంతోపాటు, స్థానికంగా పట్టున్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డిపై పూర్తిగా ఆధారపడి బాధ్యతలన్నీ ఆయనకే ఇచ్చారు. అయితే స్థానికంగా బూచేపల్లికి వ్యతిరేకంగా ఉన్న మారం వెంకారెడ్డి, ఆయన వర్గీయులు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇక చైర్మన్‌ అభ్యర్థి ఎంపిక కూడా వివాదాస్పదంగా మారింది. చీమకుర్తికి చెంది ఇటీవల వైసీపీలో చేరిన ఓ పెద్ద నాయకుడు, ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిన ఓ బుల్లి నాయకుడి ద్వారా అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నించి చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే విజయకుమార్‌ స్థానిక నేతలను సమన్వయం చేస్తూ డబ్బుకన్నా ప్రభుత్వ ప్రజావ్యతిరేకతనే సొమ్ము చేసుకునేవిధంగా ముందుకు సాగాలని కోరుతున్నారు.  పదో వార్డులో టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో 19 వార్డుల్లో టీడీపీ, 20 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వైసీపీకి చైర్మన్‌ అభ్యర్థి ఎంపిక కూడా సమస్యగా మారింది. బీసీ జనరల్‌కు చైర్మన్‌ పదవి రిజర్వు కాగా, గణనీయమైన సంఖ్యలో ఓట్లు ఉన్న పద్మశాలీలు తమకు కావాలాని పట్టుబడుతున్నారు. అయితే  వడ్డెర సామాజికవర్గం వైపు వైసీపీ నేతలు మొగ్గు చూపారు. దీంతో ఆ సమస్య ముదిరిపాకానపడుతోంది. 11వ వార్డులో టీడీపీ, వైసీపీకి మధ్య ప్రతిష్ఠాత్మకమైన పోరుకు రంగం సిద్ధమైంది. టీడీపీ అభ్యర్థులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు విదేశాలకు చెందిన ఓ సంస్థ నిర్వాహకులు ముందుకు రాగా వారిని నిరోధించే ప్రయత్నంలో వైసీపీ నాయకులు ఉన్నారు. దీనికితోడు రాజీ చేసుకుందామన్న సూచనను కూడా టీడీపీ నాయకులకు వైసీపీ నేతలకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే అందుకు టీడీపీలోని యువతరం నేతలెవ్వరూ అంగీకరించడం లేదని తెలుస్తోంది. దీంతో పోటీకి రంగంలో ఉన్న అత్యధిక మంది అభ్యర్థులు ప్రచారానికి శ్రీకారం పలకడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

 

అద్దంకిలో  ఎత్తుకుపైఎత్తులు

అద్దంకి నగర పంచాయతీలో టీడీపీ, వైసీపీల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటికే 3వ వార్డు నుంచి రంగంలో ఉన్న టీడీపీ అభ్యర్థి భర్త సందిరెడ్డి రమేష్‌ వైసీపీలో చేరిపోయారు.  ఆ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమైన మరో సీనియర్‌ నాయకుడు సందిరెడ్డి శ్రీనివాసరావు చివరలో మనసు మార్చుకున్నారు. మరో సీనియర్‌ నాయకుడు రెండు వార్డుల్లో పట్టు ఉన్న రామయ్య వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదేసమయంలో మొదటి నుంచి చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంనకు వ్యక్తిగతంగా అత్యంత సన్నిహితులుగా చెప్పే బొడపాటి రవి, మరికొందరు ఈ సారి టీడీపీ తరఫున చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. తొలిసారిగా వారు ఎమ్మెల్యే రవికుమార్‌ను కూడా కలిసి మద్దతు ప్రకటించి, కొన్ని బాధ్యతలు తీసుకున్నారు. విషయం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి చేరడంతో మీకు వ్యక్తిగతంగా సన్నిహితులైన వారు టీడీపీ పక్షాన పని చేయడం సమంజసం కాదని బలరాంనకు సూచించినట్లు తెలిసింది. దీంతో బలరాం బొడపాటి రవికి ఫోన్‌ చేసి సైలెంట్‌ కావాలని సూచించినట్లు చెప్తున్నారు. అయితే స్థానిక పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా వారు అనుకున్న పద్ధతిలో బలరాం అనుచరులు నడిచే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు అభ్యర్థుల అదృశ్యం కావడం కూడా ఇక్కడ సంచలనం సృష్టిస్తోంది. ఈ వార్డు ఎస్టీలకు రిజర్వు అయ్యింది. టీడీపీ పక్షాన నామినేషన్‌ దాఖలు చేసిన ఇద్దరు ముందు అదృశ్యమయ్యారు. ఒక పూట వ్యవధిలోని వైసీపీ పక్షాన నామినేషన్‌ వేసిన వారిలో ఒకరు కనిపించకుండా పోయారు. టీడీపీకి చెందిన ఇద్దరినీ వైసీపీ వారు, వైసీపీకి చెందిన ఒకరిని టీడీపీ రహస్య ప్రదేశాలకు తరలించినట్లు సమాచారం. వైసీపీ చేతిలో ఉన్న ఇద్దరు టీడీపీ వారు నామినేషన్‌ ఉపసంహరణ పత్రాలను పంపితే ఆ పార్టీ పోటీలో లేనట్లవుతుంది. అదృశ్యమైన వైసీపీ అభ్యర్థికి ఆపార్టీ బీఫాం ఇచ్చి ఉంది. అతడి చేత టీడీపీ వారు నామినేషన్‌ ఉపసంహరణ చేయిస్తే వైసీపీ వద్ద ఉన్న ఆ పార్టీ డమ్మీ అభ్యర్థి ఏకగ్రీవం అవుతారు. టీడీపీ వారి చేతిలో ఉన్న వైసీపీకి చెందిన మరో అభ్యర్థి కూడా రంగంలో ఉంటే ఎవరు ఏ పార్టీ అభ్యర్థి అవుతారు? విషయం ఏ మలుపుతు తిరుగుతుంది? అన్నది చూడాల్సి ఉంది. కాగా వైసీపీ తరఫున పార్టీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య, ఆయన తండ్రి గరటయ్య, ఇతర నాయకులు శనివారం నుంచి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. రోజువారీ అద్దంకిలోనే ఎక్కువ తిష్ట వేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్‌ ఫోన్‌లో రోజుకు ఒక్కో వార్డు నుంచి వంద మందిని పలుకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ పోటీ ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ఓటు రేటు కూడా భారీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 


Updated Date - 2021-02-28T05:26:49+05:30 IST