సాగర్‌ వైపు కృష్ణమ్మ పరవళ్లు

ABN , First Publish Date - 2021-07-30T06:02:25+05:30 IST

భారీ వర్షాలతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రాజెక్ట్‌లకు వరద పోటెత్తి పూర్తిస్థాయి నీటి మట్టాన్ని సంతరించుకున్నాయి.

సాగర్‌ వైపు కృష్ణమ్మ పరవళ్లు
నాగార్జున సాగర్‌ బ్యాక్‌ వాటర్‌

3,26,577 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో 

విజయపురిసౌత్‌, జూలై 29: భారీ వర్షాలతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రాజెక్ట్‌లకు వరద పోటెత్తి పూర్తిస్థాయి నీటి మట్టాన్ని సంతరించుకున్నాయి. దీంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం సంతరించుకోవడంతో పది క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువున ఉన్న ప్రాజెక్ట్‌ల నుంచి కృష్ణమ్మ గురువారం సాగర్‌ వైపు పరవళ్లు తొక్కుతూ వస్తోంది. మరో నాలుగు రోజులపాటు ఇదే ప్రవాహం కొనసాగే సూచన ఉంది. ఇదే జరిగితే  సాగర్‌ ప్రాజెక్ట్‌ సైతం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం సంతరించుకోనుంది. గురువారం సాగర్‌ నీట్టం 547.40 అడుగులు(204.08 టీఎంసీలు) ఉంది.  ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1100, ప్రధాన జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 23,699 మొత్తం ఔట్‌ఫ్లో 24,799 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో 3,26,577 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం నీటిమట్టం 884.40 అడుగులుంది. జూరాల నుంచి 4,47,299 క్యూసెక్కులు, రోజా నుంచి 65,616 క్యూసెక్కులు, మొత్తంగా 5,12,915 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. 

టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి 

రెంటచింతల: సత్రశాలలోని టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టులో గురువారం ఉదయం నుంచి 2 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించినట్లు ఈఈ రామకృష్ణ చెప్పారు. సాగర్‌ నుంచి 23,744 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టుకున్న 20 క్రస్ట్‌ గేట్లకు 4 గేట్లను 0.83 మీటర్ల  ఎత్తి 16273 క్యూసెక్కుల నీటిని టేల్‌రేస్‌ చానల్‌ ద్వారా 7870 క్యూసెక్కుల నీటిని 24143 క్యూసెక్కు(క్యూబిక్‌ ఫీట్‌ ఫర్‌ సెకండ్‌) నదిలోకి విడుదల చేస్తున్నామన్నారు. రిజర్వాయర్‌లో 7.080 టీఎంసీ నీరుందని, ఇది  75.50 మీటర్లకు సమానమన్నారు.

 


Updated Date - 2021-07-30T06:02:25+05:30 IST