సాగర్‌కు ఒక్క రోజులో 33 టీఎంసీలు

ABN , First Publish Date - 2021-07-31T08:24:19+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆలమట్టి నుంచి శ్రీశైలం వరకు భారీగా నీటి విడుదల నేపథ్యంలో సాగర్‌ వేగంగా నిండుతోంది. మొత్తమ్మీద ఒక్క రోజులోనే 33 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది.

సాగర్‌కు ఒక్క రోజులో 33 టీఎంసీలు

పూర్తి స్థాయి నిల్వకు చేరువవుతున్న ప్రాజెక్టు

శ్రీశైలం నుంచి 5.27 లక్షల క్యూసెక్కుల రాక

పూర్తి నీటి మట్టానికి ఇంకా 28 అడుగులే...


హైదరాబాద్‌, నల్లగొండ/ దోమలపెంట, ధరూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆలమట్టి నుంచి శ్రీశైలం వరకు భారీగా నీటి విడుదల నేపథ్యంలో సాగర్‌ వేగంగా నిండుతోంది. మొత్తమ్మీద ఒక్క రోజులోనే 33 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలం నుంచి 5,27,764 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.05 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 562.50 అడుగుల (235.26 టీఎంసీలు) మేరకు నీరు చేరింది. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు వరద ప్రవాహం నిలకడగా కొనసాగడంతో జలాశయంలో 16 అడుగుల మేర నీటి నిల్వలు పెరిగాయి.  కాగా, శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.63 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చిచేరింది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. 209.16 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పది గేట్లను 20 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.


కర్ణాటకలోని ఆలమట్టి జలాశయానికి 4.20 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్‌కు 4.23 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ ప్రాజెక్టులకు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. దాంతో జూరాలకు 4.72 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. 47 గేట్ల ద్వారా 4.72 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.  సుంకేశుల నుంచి వస్తున్న 39 వేల క్యూసెక్కులతో కలిపి శ్రీశైలం జలాశయంలోకి 4.93 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇక తుంగభద్ర రిజర్వాయర్‌కు 52,140 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 29,500 క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రంలో 30,735 క్కూసెక్కుల నీటిని ఉపయోగిస్తూ 14.116 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో మొత్తం ఎనిమిది టర్బైన్లతో రోజుకు 16 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. పులిచింతల రెండో గేటునూ ఎత్తారు. 

Updated Date - 2021-07-31T08:24:19+05:30 IST