నాయీబ్రాహ్మణులకు, ఉద్యమకారులకు గుర్తింపు లేదు

ABN , First Publish Date - 2021-12-01T04:56:23+05:30 IST

టీఆర్‌ఎస్‌లో నాయీ బ్రాహ్మణులకు, ఉద్యమకారులకు గుర్తింపు లేదని ఆ పార్టీ జిల్లా అధికారప్రతినిధి, తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గుంజపడుగు హరిప్రసాద్‌ విమర్శించారు.

నాయీబ్రాహ్మణులకు, ఉద్యమకారులకు గుర్తింపు లేదు
రాజీనామా పత్రాలను చూపుతున్న టీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి, మీడియా సెల్‌ ఇన్‌చార్జి జి హరిప్రసాద్‌, పాల్గొన్న నాయకులు

- టీఆర్‌ఎస్‌పార్టీకి పలువురి రాజీనామా 

కరీంనగర్‌ టౌన్‌, నవంబర్‌ 30: టీఆర్‌ఎస్‌లో నాయీ బ్రాహ్మణులకు, ఉద్యమకారులకు గుర్తింపు లేదని  ఆ పార్టీ జిల్లా అధికారప్రతినిధి, తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గుంజపడుగు హరిప్రసాద్‌ విమర్శించారు. మంగళవారం నగరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2009 డిసెంబరు 23న సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరి ఆ నాటి నుంచి నిబద్ధత గల కార్యకర్తగా తెలంగాణ ఉద్యమంలో, పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేశామని అన్నారు. నాయీ బ్రాహ్మణుల జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమంలో భాగస్వాములను చేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం నాయీబ్రాహ్మణ ఫెడరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. నాయీబ్రాహ్మణుల సంక్షేమం కోసం 500 కోట్లను బడ్జెట్‌లో కేటాయించినప్పటికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. లక్ష రూపాయలతో నవీన క్షౌరశాలలు తీసుకువస్తామని ప్రకటించిన కేసీఆర్‌ ఏ ఒక్క గ్రామంలో ఆ పథకాన్ని అమలు చేయలేదని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా నాయీబ్రాహ్మణులకు కమర్షియల్‌ కరెంట్‌తోపాటు నివాస గృహాలకు కనెక్షన్‌ ఇస్తామని ప్రకటించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. చట్టసభల్లో నాయీబ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తామని చెప్పిన కేసీఆర్‌ ఒక్కటి కేటాయించాలేదన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ పాలనలో నాయీబ్రాహ్మణులకు ఒరిగేదేమి లేదని, ఆయన మాటలు వట్టివేనని తేలడంతో నాయీబ్రాహ్మణులు మూకుమ్మడి రాజీనామాలకు చేస్తున్నామని హరిప్రసాద్‌ ప్రకటించారు. ఆయనతోపాటు విలేకరుల సమావేశంలో పాల్గొన్న నగర ప్రధాన కార్యదర్శి దండబోయిన రాము, నగర ప్రధాన కార్యదర్శి శ్రీరాముల శ్రీకాంత్‌, తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జంపాల నర్సయ్య, నాయకులు శ్రీరాముల రమేశ్‌, శావనపల్లి రాజు, కొత్వాల ఆంజనేయులు, శ్రీరాముల శ్రీనివాస్‌, జనగామ సత్యనారాయణ, గర్శకుర్తి విద్యాసాగర్‌, చెరుకు రమేశ్‌ తదితరులు టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

Updated Date - 2021-12-01T04:56:23+05:30 IST