Abn logo
Oct 23 2020 @ 00:18AM

నల్లనేలపై నాయిని ముద్ర

రాత్రికి రాత్రి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో యువకులు, కార్మికులను మాయం చేసి నిర్భందించి ఎన్‌కౌంటర్లకు గురి చేసినప్పుడు; రమేజాబీ, రాజేశ్వరి లాంటి కేసుల సందర్భంగా కాల్పులు జరిగినప్పుడు; మందమర్రిలో కార్మికులపై తూటాలు పేలినప్పుడు- ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీలలో నాయిని నర్సింహారెడ్డి సభ్యునిగా ఉండి రాజ్యహింసను బాహటంగా వ్యతిరేకించారు. మాజీ మంత్రిగా, ప్రముఖ ట్రేడ్‌ యూనియనిస్టుగా, బొగ్గుగని కార్మికులకు ఐదు దశాబ్దాలుగా పలు పోరాటాలలో మద్దతుగా నిలిచిన నేతగా నాయిని నర్సింహారెడ్డి నల్లనేల గుండెల్లో చిరస్మరణీయుడై ఉండిపోతారు.


నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అనారోగ్యంతో తన 86వ ఏట కన్నుమూయటంతో, సింగరేణి ప్రాంత నల్లనేలలో కార్మికులు ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. మాజీ మంత్రిగా, ప్రముఖ ట్రేడ్‌ యూనియనిస్టుగా, బొగ్గుగని కార్మికులకు ఐదు దశాబ్దాలుగా పలు పోరాటాలలో మద్దతుగా నిలిచిన నేతగా నాయిని నర్సింహారెడ్డి నల్లనేల గుండెల్లో చిరస్మరణీయుడై ఉండిపోతారు.


హైదరాబాదులో కార్మిక నాయకునిగా నాయిని తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1970 ప్రాంతంలో సోషలిస్టు పార్టీలో చేరి కార్మిక నాయకునిగా ఎదిగారు. పదేండ్ల క్రితం వరకు కూడా బుల్లెట్‌ పైనే హైదరాబాదులో తిరిగేవారు. దాదాపు పాతిక యూనియన్లకు అధ్యక్షునిగా కొనసాగారు. హైదరాబాదులో 1978లో ముషీరాబాదు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985, 2004లోనూ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 2005 నుంచి 2008 వరకు సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్‌ వైపు నుంచి దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా కొనసాగారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి హోం మంత్రిగా, అలాగే కార్మిక శాఖ మంత్రిగా కూడా 2014 నుంచి 2019 వరకు కొనసాగారు. ఎమ్మెల్సీగా ఉండి మంత్రి అయ్యారు. ఇటీవల కొంత కాలం క్రితమే ఆయన ఎమ్మెల్సీ కాల పరిమితి ముగిసింది. 


నల్గొండ జిల్లా దేవరకొండ సమీపంలోని నేరేడుగొమ్మ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో 1934 మే 12న జన్మించిన నాయిని నర్సింహారెడ్డి హెచ్‌ఎస్‌సీ వరకు చదువుకున్నారు. వజీర్‌ సుల్తాన్‌ టొబాకో చార్మినార్‌ సిగరేట్‌ ఫ్యాక్టరీలో కార్మిక నాయకునిగా ఉన్నారు. 1984లో ఇల్లందులో జరిగిన హెచ్‌ఎంఎస్‌ మహా సభల్లో ఆయనను సింగరేణి హెచ్‌ఎంఎస్‌ అనుబంధ కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అప్పుడు యూనియన్‌కు ప్రధాన కార్యదర్శి దివంగత జాడి దుర్గయ్య కొనసాగేవారు. జాడి దుర్గయ్య మరణానంతరం అధ్యక్షునిగా 2014 వరకు నర్సింహారెడ్డి కొనసాగారు. ఆ యూనియన్‌కు ప్రధాన కార్యదర్శిగా రియాజ్‌ అహ్మద్‌ ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. జాతీయ హెచ్‌ఎంఎస్‌ ఉపాధ్యక్ష పదవిలో ఇంకా నాయిని నర్సింహారెడ్డి కొనసాగుతూనే ఉన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ ఏర్పడినప్పటికి నర్సింహారెడ్డి ఆ యూనియన్‌లో చేరలేదు. ప్రస్తుతం రాష్ట్ర హెచ్‌ఎంఎస్‌ అడహక్‌ కమిటీ అధ్యక్షునిగా నాయిని నర్సింహారెడ్డినే ఉన్నారు. ప్రముఖ జాతీయ సోషలిస్టు జనతా పార్టీ నాయకులు మధు దండావతే, జార్జిఫెర్నాండెజ్‌, కమలాసింహా, కేంద్ర మంత్రి జయపాల్‌రెడ్డి, బాబుల్‌రెడ్డి లాంటి వారితోనూ నాయిని నరసింహారెడ్డికి అనుబంధం ఉండేది. జాతీయ స్థాయిలో జరిగిన పలు సమ్మెలు పోరాటాలకు నర్సింహారెడ్డి నాయకత్వం వహించారు. ఏపీసీఎల్‌సీ (పౌర హక్కుల సంఘం)తోనూ ఆయనకు అనుబంధం ఉండేది. రాత్రికి రాత్రి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంలో కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో యువకులు, కార్మికులను మాయం చేసి నిర్భందించి ఎన్‌కౌంటర్లకు గురి చేసినప్పుడు రమేజాబీ, రాజేశ్వరి లాంటి కేసుల సందర్భంగా కాల్పులు జరిగినప్పుడు మందమర్రిలో కార్మికులపై కాల్పులు జరిగినప్పుడు ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీలలో నాయిని నర్సింహారెడ్డి సభ్యునిగా ఉండి రాజ్యహింసను బాహటంగా వ్యతిరేకించారు. గోదావరిఖని, బెల్లంపల్లి ప్రాంతాలలో మంచినీరు, విద్యుత్తు, ఇంటి స్థలాల కోసం జరిగిన పలు ఆందోళనలలో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సింగరేణి కార్మిక సమాఖ్య ఐఎఫ్‌టీయూ తదితర విప్లవ సంఘాలు నిర్వహించిన పోరాటల్లో, సమ్మెల్లో నర్సింహారెడ్డి నేరుగా పొల్గొని పలు మార్లు అరెస్టు అయిన దాఖలాలున్నాయి. గోదావరిఖనిలో రియాజ్‌అహ్మద్‌ ఆమరణ నిరహార దీక్ష చేసిన సందర్భంలోనూ నిర్బంధాలు ఎదురుకాగా కార్మికులకు మద్దతుగా నిలబడ్డారు. ‌


99 రోజుల సింగరేణి ట్రేడ్‌మెన్ల సమ్మె, 45 రోజుల హెల్పర్ల సమ్మెకు నాయిని నర్సింహారెడ్డి నాయకత్వం వహించారు. శాసనసభ్యుడిగా ఉన్న సందర్భంలో నర్సింహారెడ్డి కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో గొంతెత్తి పోరాడేవారు. ఆసుపత్రులు, తట్టాచెమ్మస్‌ విషయంలో, అటు విద్యా సంస్థల విషయంలో జరిగిన భారీ సమ్మెకు, పోరాటానికి అండగా ఆయన నిలబడ్డారు. కొమురం భీం జిల్లాలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు కార్మిక సంఘానికి అధ్యక్షునిగా కొనసాగారు. కార్మికుల సమస్యలపై ఆయన అన్ని కార్మిక సంఘాలతోనూ కలిసి పని చేసేవారు. కార్మికుల ఇండ్ల స్థలాల విషయంలో గోదావరిఖని ప్రాంతంలో ఖాళీగా ఉన్న స్థలాలలో ఆక్రమణ చేసి మరీ స్థలాలు ఇప్పించారు. సామాన్య కార్మికుని ఇంటికి వచ్చి మరీ భోజనం చేసేవారు. 


1969లో తొలి తెలంగాణ సాధన ఉద్యమం నుంచి మలి సాధన ఉద్యమం వరకు నాయిని నర్సింహారెడ్డి కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రమే ఆయన పెద్దన్న కాదు, ఆయన మలి దశ తెలంగాణ ఉద్యమానికే ఆయన్ను పెద్దన్నగా పేర్కొనవచ్చు. వయసు 80 దాటినా తెలంగాణ ఉద్యమంలో మనుమళ్ల వయసున్న తెలంగాణ యువతతో ఆడి పాడే వారు. నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎవరైనా ఒక్క మాటంటే భరించేవారు కాదు. నాయిని నర్సింహారెడ్డిని దేశంలోనే ఒక అత్యుత్తమ ట్రేడ్‌ యూనియనిస్టుగా పేర్కొనవచ్చు. ఆయన తెలంగాణ ఉద్యమంలో, అంతకుముందు సింగరేణిలో జరిగిన సభలు, సమావేశాలకు వచ్చినప్పుడు ఆయనతో నాకు మంచి అనుబంధం ఉండేది. కనబడితే చాలు కౌగిలించుకునే వారు. 


నాయిని నర్సింహారెడ్డి చాలా నిర్మొహమాటస్థుడు. చివరి రోజుల్లో తనను కేసీఆర్‌ నిర్లక్ష్యం చేస్తున్నారనే అసంతృప్తి ఆయనలో ఉండేది. తనకేం పదవి ఇవ్వలేదని చెప్పేవారు. తన అల్లుడికి ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వలేదని పేర్కొనేవారు. బాహటంగానే ఈ విషయంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆసుపత్రిలో నర్సింహారెడ్డిని పరామర్శించి ప్రత్యక్షంగా చూసి కుటుంబ సభ్యులను ఓదార్చి వచ్చిన కొన్ని గంటల్లోనే, ఆయన ‘నర్సిం అన్నా’ అని ఎంతో ప్రేమతో పిలిచే నాయిని ఊపిరి విడిచిండు. సీఎం కేసీఆర్‌ను పల్లెత్తు మాట కూడా అననివ్వని నేత, కార్మికుల పక్షాన అరుదైన నాయకుడు నర్సిం అన్న జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి.

ఎండి. మునీర్‌

Advertisement
Advertisement
Advertisement