ఏజెన్సీ రైతులే లక్ష్యంగా ‘నకిలీ’ విక్రయాలు

ABN , First Publish Date - 2021-06-18T05:09:00+05:30 IST

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది నకిలీ విత్తనాల అమ్మకాలు రహాస్యంగా జరుగుతున్నాయి.

ఏజెన్సీ  రైతులే లక్ష్యంగా ‘నకిలీ’ విక్రయాలు
విత్తన షాపుల్లో తనిఖీ (ఫైల్‌)

 ఆందోళనలో రైతులు

సమాచారం ఇస్తేగాని స్పందించని వ్యవసాయాశాఖ అధికారులు

ఏన్కూరు, జూన్‌ 17: గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది నకిలీ విత్తనాల అమ్మకాలు రహాస్యంగా జరుగుతున్నాయి. ఏజన్సీ ప్రాంతాల రైతులే లక్ష్యంగా కొంతమంది ఈ నకిలీ విత్తనాల అమ్మకాలను సాగిస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఇటీవల నకిలీ విత్తనాల గుట్టును పోలీసులు, వ్యవసాయ అధికారులు చేదించారు. ప్రధానంగా ఈ జిల్లాల్లో పత్తి, మిర్చి పంటలను వేలాది ఎకరాల్లో రైతులు సాగుచేస్తుంటారు. నాణ్యమైన విత్తన ప్యాకెట్లకు తీసిపోని విధంగా ఈ నకిలీ విత్తన ప్యాకెట్లను ఆకర్షణీయమైన ప్యాకెట్ల రూపంలో రైతులను ఆకట్టుకొనేవిధంగా తయారుచేస్తూ అమ్ముతున్నారు. అయితే వీటిని గుర్తించని రైతులు కొనుగోలు చేసి సాగుచేస్తూ మోసపోతున్నారు. గత కొన్నిరోజుల నుంచి ఈ మూడుజిల్లాల్లో కోట్లరూపాయల విలువైన నకిలీ మిర్చి విత్తన ప్యాకెట్లను పట్టుకున్నారు. వీటికితోడు ఏన్కూరు మండలంలో మూడురోజుల క్రితం నకిలీ పత్తి విత్తనాలను సైతం పట్టుకున్నారు. దీంతో రైతులు ఏమి కొనాలో తెలియని అయోమమయ పరిస్థితిలో పడిపోయారు. సంబంధిత అధికారుల ఉదాసీన వైఖరి వల్ల పెద్ద ఎత్తున ఈ గ్రామాల్లో అమ్మకాలు చేస్తున్నారు. ఎవరైనా రైతులు కానీ ఇతరులు కానీ సమాచారం ఇస్తేనే అధికారులకు తెలుస్తుంది తప్ప క్షేత్రస్థాయిలో అధికారులు గుర్తించలేకపోతున్నారు. గత కొన్నిరోజులుగా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు గట్టి నిఘా పెట్టి స్థానిక పోలీసులు, వ్యవసాయ అధికారుల సహకారంతో నకిలీ విత్తనాల గుట్టు రట్టు చేస్తున్నారు. ఏన్కూరు మండలంలో ఓ వ్యక్తి గ్రామాల్లో నకిలీ మిర్చి విత్తనాలు అమ్ముతున్నాడని గమనించిన అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేయగా పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల విక్రయాలు వెలుగుచూశాయి. ఈవిధంగా నకిలీల జోరు ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


Updated Date - 2021-06-18T05:09:00+05:30 IST