Abn logo
Jun 11 2021 @ 23:10PM

‘పొరుగు’ నుంచి నకిలీ!

ఉమ్మడిఖమ్మం జిల్లాలో పోలీసులు, వ్యవసాయాధికారులు పట్టుకున్న నకిలీ మిర్చి విత్తనాలు

  • ఉమ్మడిజిల్లాలో యథేచ్ఛగా విత్తన మాయ
  • గుట్టుచప్పుడు కుండా విత్తన విక్రయాలు 
  • కొందరు వ్యాపారుల కక్కుర్తితో చితికిపోతున్న రైతులు
  • అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా ఆగని దందా
  • నకిలీల ఆటకట్టించేందుకు పోలీసుల చర్యలు 
  • ఫిర్యాదు చేసేందుకు ఇరుజిల్లాల్లో అందుబాటులోకి ప్రత్యేక ఫోన్‌నెంబర్లు


ఖమ్మం, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో సాగుపనులను ముమ్మరం చేసిన రైతులు విత్తనాలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. కానీ గతంలోలాగా ఈఏడాది కూడా ఉమ్మడి జిల్లా రైతులకు.. నకిలీ విత్తనాలు శాపంగా మారాయి. కొన్ని రకాల విత్తనాలు నారుమడి దశలోనే మొలకెత్తక, కొన్నేమో మిర్చితోటలు వేసిన తర్వాత ఎదగకపోవడం, ఎదిగినా పూత, కాపు లేకపోవడం లాంటి వాటితో పాటు.. నకిలీ హైబ్రిడ్‌ విత్తనాలు, జన్యుపరమైన తేడాలతో పంటల దిగుబడి రాక అన్నదాతలు ప్రస్తుతం మెట్ట పైర్లకు పనులు ముమ్మరం కావడం, ముఖ్యంగా మిర్చి నారుమడులు, పత్తి విత్తనాలువేసే సీజన్‌ మొదలవుతున్నందున.. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ తదితర రాష్ట్రాలనుంచి పలు హైబ్రిడ్‌ బ్రాండ్ల పేరుతో నకిలీ విత్తనాలు దొంగచాటుగా జిల్లాకు చేరుకుంటున్నాయి.


ఈ క్రమంలో కొందరు వ్యాపారులు.. అధిక కమీషన్లకు కక్కుర్తి పడి వాటిని రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు డీలర్లు.. గ్రామాల్లో అనధికారికంగా కమీషన్‌ ఏజెంట్లను నియమించుకుని పలు కంపెనీల విత్తనాలను అమ్ముతున్నారు. మిర్చి సాగులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉండగా.. సుమారు లక్ష ఎకరాలకు పైగా మిర్చి సాగవుతుంది. ఈ క్రమంలో మిర్చివిత్తనాల వ్యాపారమే రూ.వంద కోట్లకుపైగా జరుగుతుంది.


గతంలో దేశవాళీ విత్తనాలు వేసే రైతులు.. రెండు దశాబ్దాలుగా అధిక దిగుబడుల కోసమంటూ హైబ్రిడ్‌విత్తనాలు కొనుగోలు చేసి సాగుచేస్తున్నారు. ఎకరానికి వంద గ్రాముల వరకు విత్తనాలు హైబ్రిడ్‌ రకం విత్తనాలు అవసరం ఉంటుంది. పదిగ్రాములకు ఒక ప్యాకెట్‌ చొప్పున పదినుంచి 12ప్యాకెట్లను ఒక ఎకరానికి వినియోగిస్తున్నారు. హైబ్రిడ్‌ రకాల్లో డిమాండ్‌ను బట్టి పది గ్రాముల ప్యాకెట్‌ రూ.600 నుంచి రూ.వెయ్యి వరకు ఉంది. అంటే ఒక ఎకరానికి సుమారు రూ.పదివేల వరకు విత్తనాల కొనుగోలుకే వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు లక్ష ఎకరాలకు వేసే విత్తనాల వ్యాపారం రూ.120కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. 


డిమాండ్‌ వల్లే ఇరుజిల్లాల్లోకి..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి విత్తనాలకు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు పలు నకిలీ కంపెనీల ప్రతినిధులు దొడ్డిదారిన ప్రవేశిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర,ఏపీలోని పలు ప్రాంతాలతోపాటు హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న కొన్ని హైబ్రిడ్‌ రకం మిర్చి కంపెనీలు నకిలీ మిర్చి విత్తనాలను వాహనాల్లో గ్రామాలకు, మండల కేంద్రాలకు తరలించి.. తమ కంపెనీల తరుపున కొందరు ఉద్యోగులు, కమీషన్‌ ఏజెంట్లను నియమించుకుని.. దుకాణాల వారి వద్దకు చేరుస్తున్నారు. తమ విత్తనాలుఅమ్మిపెడితే అధిక కమీషన్ల ఇస్తామంటూ ఆశచూపుతుండటంతో సదరు వ్యాపారులు కూడా సై అంటున్నారు.


అనుమతులు ఉన్న హైబ్రిడ్‌ రకం మిర్చి విత్తనాలు అమ్మితే 15నుంచి25శాతం వరకు కమీషన్‌ ఉంటుంది. కానీ నకిలీ బ్రాండ్‌ విత్తనాలు అమ్మితే 30నుంచి 50శాతంవరకు కమీషన్‌ వస్తుంది. దీంతో కొందరు డీలర్లు, కమీషన్‌ ఏజెంట్లు, వాపారులు రైతులను మోసగిస్తున్నారు. కొన్ని కంపెనీలు సొంతబ్రాండ్లతో అనుమతిలేని విత్తనాలు అమ్ముతుండగా.. మరికొన్ని కంపెనీలు.. డిమాండ్‌, అనుమతి ఉన్న ప్రముఖ కంపెనీల లోగోలతోపోలిన ప్యాకెట్లను రూపొందించి దందాకు పాల్పడుతున్నారు. గత సీజన్‌లో అమ్మకాలు జరపగా మిగిలిన విత్తనాల ప్యాకెట్లను కూడా కొంత ధర తగ్గించి గడువు దాటిన వాటిని కూడా విక్రయిస్తున్నారు. 


గ్రామీణ ప్రాంతాల రైతులే లక్ష్యంగా.. 

కర్ణాటకలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీలోని గుంటూరు, కర్నూలు, మహరాష్ట్ర, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి నకిలీ మిర్చి విత్తనాలు ఆకర్షణీయమైన ప్యాకెట్లలో గప్‌చుప్‌గా తరలించి సొమ్ములు చేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న డీలర్లు, వ్యాపారులు, ఏజెంట్లు.. కొంత ధర తగ్గించి అమ్మడం, అప్పుగా విత్తనాలు అంటగట్టి, తర్వాత సొమ్ములు తీసుకుంటున్నారు. వాస్తవానికి ఏ కంపెనీ మిర్చి విత్తనాలైనా రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ వద్ద సీజన్‌కు ముందుగానే అనుమతి పొందాలి. వ్యవసాయ శాఖ నుంచి కంపెనీ ఓఫామ్‌ ద్వారా అనుమతి తీసుకుని సంబంధిత ఫామ్‌ను జిల్లా వ్యవసాయశాఖ అధికారులకు చూపించి డీలర్లకు అందించాలి.


డీలర్లు ఓఫామ్‌ చూసిన తర్వాత ఆయా కంపెనీల మిర్చి విత్తనాలు అమ్మేందుకు అనుమతి ఉంటుంది. ఇలా ఓ ఫామ్‌ లేకుండానే వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందకుండానే నకిలీ మిర్చి విత్తనాలను అమ్మి సొమ్ములు చేసుకుంటున్నారు. నకిలీ మిర్చి విత్తనాలపై అటు వ్యవసాయశాఖతో పాటు పోలీసు శాఖ సంయుక్తంగా తనిఖీలు చేపడుతున్నా రహస్యంగా మండలాలు, గ్రామాల్లో నకిలీ విత్తనాలు విక్రయాలు సాగిస్తూనే ఉన్నారు. కేవలం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇస్తున్న సమాచారంతోనే కొన్ని నకిలీ విత్తనాలు గుట్టురట్టవుతుండగా ఎవరికీ చిక్కకుండా నకిలీ విత్తనాలు అధికంగానే విక్రయాలు సాగిస్తున్నారు.


అయితే కొందరు సొంత అవసరాలకు డీలర్లను నమ్మి నకిలీ మిర్చి విత్తనాలతో మోసపోతుండగా కొందరు నర్సరీ యజమానులు కూడా ఈనకిలీ విత్తనాలు కొని నర్సరీలు పెట్టి నారు అవసరం ఉన్న రైతులకు అమ్మడం ద్వారా రైతులు కూడా నష్టపోతున్నారు. నకిలీ మిర్చి విత్తనాలు అమ్ముతున్న డీలర్లు, ఆయా కంపెనీల కమీషన్‌ ఏజెంట్లు, రైతులకు మాత్రం ఎలాంటి రశీదులు ఇవ్వకుండా నకిలీ మిర్చి విత్తనాలు విక్రయిస్తున్నారు. 


ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు

ఉమ్మడి ఖమ్మంలో విత్తన దందా రెచ్చిపోతున్న నేపథ్యంలో పోలీసులు ఆ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిత్యం టాస్క్‌ఫోర్స్‌, వ్యవసాయశాఖ సంయుక్త బృందం పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. పలు చోట్ల అనుమతులు లేని, నకిలీ విత్తనాలు పట్టుబడుతున్నాయి. ఇటీవల ఇరుజిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి రూ.16.46లక్షల 2,550 నకిలీ మిర్చి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఎనిమిది మందిని అరెస్టుచేశారు.


ఇందులో ఫామ్‌సన్‌ సీడ్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో డీఎస్‌రెడ్‌స్టార్‌, దక్కన్‌హాట్‌, డీఎస్‌556, డీఎస్‌ కదంబ రకాల పేరుతో నకిలీ మిర్చి విత్తనాలు అమ్ముతుండగా పోలీసులకు అందిన సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నారు. అరెస్టు చేసిన ఎనిమిది మందిలో ఆరుగురు వ్యవసాయ శాఖ అధికారికంగా లైసెన్సులు పొందిన డీలర్లు ఉండడం గమనార్హం. వీరు అధిక కమీషన్‌ ఆశతో నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. 


ప్రతీ రైతు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి

విజయనిర్మల, ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి 

మిర్చి విత్తనాలు కొనుగోలు చేస్తున్న రైతులు తప్పనిసరిగా డీలర్లనుంచి రశీదులు తీసుకోవాలని, రశీదులో బ్యాచ్‌నెంబర్‌, ధర, తప్పనిసరిగా ఉండాలి. ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ నకిలీ విత్తనాల విషయంలో పోలీసు, వ్యవసాయశాఖలు సంయుక్తంగా జిల్లాలో తనిఖీలు చేస్తాం. ఇప్పటికే కొన్ని నకిలీ మిర్చి విత్తనాలు పట్టుకుని కేసులు నమోదుచేశాం. రైతులు మిర్చి విత్తనాలు కొనుగోలు విషయంలో హైబ్రిడ్‌ రకం కంపెనీలు పరిశీలించుకోవాలి. అనుమానం ఉంటే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదిచాలని. రశీదులు తీసుకోకపోతే తర్వాత ఎలాంటి నష్టం జరిగినా పరిహారం రాదని రైతులు గమనించాలి.


నకిలీ, అనధికారిక విత్తనాలు ఎవరైనా అంటగడితే.. తమకు ఫిర్యాదు చేయాలని ఇరుజిల్లాల పోలీసులు సూచిస్తున్నారు. అలాగే అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి, విత్తన దందాపై పటిష్ఠ నిఘా పెట్టాలని ఆదేశాలిస్తున్నారు. శుక్రవారం ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌, భద్రాద్రి ఎస్పీ సునిల్‌దత్‌ తమ తమ జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  రైతులకు నష్టం కలిగించే విధంగా జిల్లాలో ఎవ్వరైనా నతిలీ విత్తనాలు, అనధాకారిక విత్తనాలు అమ్మినా ఉపేక్షించేదిలేదని, సంబదిత డీలర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నకిలీ మోసాలపై పోలీసులకు ఫిర్యాదుచేసేందుకు వాట్సాప్‌ నెంబర్లను అందుబాటులో ఉంచారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నెంబర్లివే.. 

ఖమ్మం జిల్లా : 7901144600 

భద్రాద్రికొత్తగూడెం జిల్లా : 8978072286 
నకిలీ నిర్ధారణ ఇలా..

విత్తనాల్లో నకిలీ నిర్ధారణ తెలుసుకోవాలంటే రైతులు ఇలా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. విత్తన ప్యాకెట్‌పై క ంపెనీ పేరుతో పాటు హాల్‌మార్క్‌, లాట్‌నెంబర్‌, బ్యాచ్‌ నెంబర్‌, తయారైన తేదీ, గడువు తేదీ, జన్యుస్వచ్ఛత, కంపెనీ చిరునామా ఇవి తప్పని సరిగా ముద్రించి ఉండాలి. సదరు కంపెనీకి సెంటర్‌ లైసెన్‌ ్స ఉందా లేదో కూడాతెలుసుకోవాలి. ల్యాబ్‌ ద్వారా పరీక్ష 

గుర్తింపు పొందిన హైబ్రిడ్‌ విత్తనాల్లో జన్యు స్వచ్ఛత సక్రమంగా లేకపోవడం, కల్తీ విత్తనాలు కలవడం లాంటి సమస్యలు పిర్యాదులు వచ్చినప్పుడు సంబందిత రైతు కొనుగోలు చేసిన విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు హైదరాబాద్‌లోని మలక్‌పేటలోని విత్తన నాణ్యతా పరీక్ష కేంద్రానికి పంపించాలి. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష కేంద్రంలో విత్తన జన్యు స్వచ్ఛతను పరిక్షించి అసలు, నకిలీని నిర్ధారణ చేసి 15 రోజుల్లోపు వ్యవసాయశాఖ అధికారులకు ల్యాబ్‌ రిపోర్టులను పంపిస్తారు. దీని ద్వారా విత్తన నాణ్యత నకిలీ విత్తనాలను పరిక్షించుకోవచ్చు. మొక్క నిర్ధారణ ఇలా.. 

విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత విత్తాలనుకున్న సమయానికి రెండు రోజుల ముందు 100 విత్తనాలను లెక్కించి ఓవస్త్రంలో కట్టిఉంచి తడపాలి. వాటిలో 70శాతం పైగా మొలకలు వస్తే అవి అసలువని, 70శాతానికి తక్కువ మొలకలు వస్తే అవి నకిలీవేనని భావించాల్సి ఉంటుంది.