Abn logo
Oct 18 2021 @ 00:52AM

నల్గొండ పోలీసుల ఓవర్‌ యాక్షన్‌!

గంజాయి నిందితులను పట్టుకోవడానికి ఏజెన్సీకి రాక

స్థానిక పోలీసులకు సమాచారమివ్వని వైనం

పట్టుకున్న నిందితులతో నర్సీపట్నంలో మకాం

గిరిజనులను చర్చలకు పిలవడంపై పలు అనుమానాలు

తురబాలగెడ్డ వద్ద హెచ్చరికలు లేకుండానే నేరుగా ఆదివాసీలపైకి కాల్పులు


నర్సీపట్నం, అక్టోబరు 17: 

చింతపల్లి మండలం తురబాలగెడ్డ సమీపంలో ఇద్దరు గిరిజనులపై కాల్పులు జరిపిన వ్యవహారంలో నల్గొండ పోలీసులు మితిమీరి ప్రవర్తించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ వాహనాలను 15 నుంచి 20 మంది గిరిజనులు అడ్డుకునే క్రమంలో ఎటువంటి హెచ్చరికలు లేకుండా కాల్పుల జరపడాన్ని ఆదివాసీలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారంలో నల్గొండ పోలీసులు వ్యవహరించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమతున్నాయి. 

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పట్టుబడ్డ గంజాయికి సంబంధించి నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు నల్గొండ పోలీసులు గంజాయి వ్యాపారులను పట్టుకునేందుకు ఇటీవల విశాఖ ఏజెన్సీకి వచ్చారు. సాధారణంగా ఒక ప్రాంతం పోలీసులు విధి నిర్వహణలో భాగంగా నిందితుల్ని పట్టుకోవడం లేదా విచారణ కోసం మరో చోటకు వెళ్లినప్పుడు స్థానిక పోలీసులకు ముందుగా సమాచారం ఇవ్వాలి. కానీ నల్లగొండ పోలీసులు జిల్లాకు చెందిన పోలీసులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. గంజాయి నిందితుల కోసం గాలిస్తున్న క్రమంలో అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామంలో కిల్లో బాలకృష్ణ, కిల్లో భీమరాజు, నారా లోవలను అదుపులోకి తీసుకున్నారు. భీమరాజుకి గంజాయి కేసులతో ఎటువంటి సంబంధం లేదని స్థానికులు చెబుతున్నప్పటికీ నల్గొండ పోలీసులు పట్టించుకోకుండా కారులో ఎక్కించుకొని తీసుకుపోయారు. వీరిని నల్గొండ తీసుకుపోకుండా నర్సీపట్నంలోని ఒక లాడ్జిలో వుంచారు. అనంతరం తమ అదుపులో వున్న వారితో అన్నవరం    సర్పంచ్‌ పాంగి సన్యాసిరావుతో ఫోన్‌లో మాట్లాడించారు. వీరి మధ్య ఎటువంటి సంభాషణ జరిగిందోగానీ.. ఆదివారం లోతుగెడ్డ జంక్షన్‌ వద్దకు రమ్మని, అక్కడ మాట్లాడుకుందామని పోలీసులు చెప్పారు. ఆ మేరకు వచ్చిన గిరిజనులతో పోలీసులు మాట్లాడకుండా తిరిగి నర్సీపట్నం బయలుదేరారు. దారిలో ట్రాఫిక్‌ స్తంభించినప్పుడు తమపై దాడి చేయడానికి వస్తున్నారంటూ గిరిజనులపై కాల్పులు జరిపారు.

నల్గొండ పోలీసుల తీరుపై పలు అనుమానాలు

గంజాయి నిందితులను అదుపులోకి తీసుకోవడం నుంచి గాలిపాడు గిరిజనులపై కాల్పులు జరపడం వరకు నల్గొండ పోలీసులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా గాలిపాడులో ముగ్గురిని అదుపులోకి ఎలా తీసుకున్నారు? గంజాయి నిందితులను నల్గొండ తీసుకెళ్లకుండా నర్సీపట్నంలోని ఒక లాడ్జిలో ఎందుకు వుంచారు? నిందితుల తరఫు వారిని లోతుగెడ్డ  వద్దకు చర్చల కోసం రమ్మని ఎందుకు కబురు పెట్టారు? లోతుగెడ్డలోగానీ, లంబసింగి ఘాట్‌ వద్దగానీ గిరిజనులతో ఎందుకు మాట్లాడలేదు? తురబాలగెడ్డ వద్ద ట్రాఫిక్‌ స్తంభించినప్పుడు గిరిజనులు తమపై దాడి చేయడానికి వస్తున్నారంటూ ఎటువంటి హెచ్చరికలు లేకుండా నేరుగా కాల్పులు ఎలా జరిపారు? ఈ ప్రశ్నలకు నల్గొండ పోలీసులు సమాధానం చెప్పాల్సిఉంది. కాగా గిరిజనులవద్ద మరణాయుధాలు ఉన్నాయని, అందుకే ఆత్మరక్షణార్థం నల్గొండ పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారని చింతపల్లి ఏఎస్పీ రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటన విడుదల చేశారు. గాలిలోకి కాల్పులు జరిపితే ఒక గిరిజనుడి తొడకు గాయం ఎందుకు అయ్యింది? అన్నది తేలాల్సి వుంది. ఇదిలావుండగా నిందితులను విడిచిపెట్టేందుకు రూ.5 లక్షల నగదు, లేదా 500 కిలోల గంజాయి ఇవ్వాలని నల్గొండ పోలీసులు అడిగారని కాల్పుల్లో గాయపడ్డ రాంబాబు ఆరోపిస్తున్నారు.