దానికింకా సమయం ఉంది: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

ABN , First Publish Date - 2021-08-09T06:38:36+05:30 IST

బహుజనుల రాకతో..

దానికింకా సమయం ఉంది: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
నల్లగొండ సభకు హాజరైన ప్రజలు, మాట్లాడుతున్న ప్రవీణ్‌ కుమార్‌

నల్లగొండ నీలిసంద్రం    

సందడిగా మారిన పట్టణం

‘రాజ్యాధికార సంకల్ప’ సభ సక్సెస్‌

బీఎస్పీతో రాజకీయ ఆరంగ్రేటం చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): బహుజనుల రాకతో నల్లగొండ నీలి రంగుమయమైంది. మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీలో చేరికకు ఎన్జీ కళాశాల మైదానం వేదిక కాగా, పట్టణమంతా ఆయన అభిమానులతో నిండిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి బీఎస్పీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆదివారం రాత్రి నిర్వహించిన ‘రాజ్యాధికార సంకల్ప’ సభ సక్సెస్‌ అయింది. 


నల్లగొండలోని మర్రిగూడ బైపాస్‌ వద్దకు సాయంత్రం 4.10గంటల ప్రాంతంలో చేరుకున్న ఆర్‌ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌కు ఘనస్వాగతం లభించింది. మ హిళలు తిలకందిద్ది ఆయనకు స్వాగ తం పలికారు. అక్కడే ఉన్న అంబేడ్కర్‌, జగ్జీవన్‌రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రవీణ్‌కుమార్‌ నివాళులర్పించి భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి బయల్దేరారు. బోనాలతో మహిళ లు, కోలాట ప్రదర్శనలు, కొమ్ము, డప్పు, కోయ, గుస్సాడి కళాకారుల నృత్యాలతో ర్యాలీగా సాగగా, ఓపెన్‌టా్‌ప వాహనం నుంచి ప్రవీణ్‌కుమార్‌ అభివాదంచేస్తూ ముందుకు సాగారు. మార్గమధ్యలో రేణుకాఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. హైదరాబాద్‌ రోడ్డులోని దారులుమ్‌ మసీదులో ఆయనకు ముస్లింలు దట్టీకట్టి అండగా ఉంటామని ఆశీర్వదించారు. ర్యాలీలో యువకు లు, మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పాదయాత్రగా వచ్చిన విద్యార్థులు నీలిరంగు దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభకు నాగర్‌కర్నూల్‌ జిల్లా, అమ్రాబాద్‌ మండలం వెంకటేశ్వరబావి గ్రామానికి చెందిన ఏనుపోతుల అరుణ్‌కుమార్‌, కాబీర్‌ శ్రీను సైకిల్‌పై వచ్చారు. వీరు ఐదు రోజుల క్రితం అక్కడి నుంచి బయల్దేరారు. కాగా, వీరు ప్రవీణ్‌కుమార్‌ చదువుకున్న పాఠశాలలో చదవడం విశేషం. ర్యాలీ ఎన్జీ కళాశాలకు చేరగా, కరణ్‌ జయ్‌రాజ్‌ ఏర్పాటు చేసిన బీఎస్పీ జెండాను ప్రవీణ్‌కుమార్‌ ఆవిష్కరించారు.


ఆకట్టుకున్న ప్రవీణ్‌కుమార్‌ ప్రసంగం

ఎన్జీ కళాశాల మైదానంలో బీఎస్పీ కండువా కప్పుకున్న అనంతరం ప్రవీణ్‌కుమార్‌ ప్రసంగం సాగింది. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు కార్యకర్తలు జైభీం అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. సభకు వచ్చిన వారిని చూస్తుంటే ప్రగతి భవన్‌ ఎంతో దూరంలో లేదని కార్యకర్తలను ఆర్‌ఎస్పీ ఉత్సాహపరిచారు. దీంతో సీఎం.. సీఎం అంటూ యువకులు నినాదాలు చేయగా, దానికింకా సమయం ఉందంటూ అన్నారు. బానిసలుగా ఉందామా? పాలకులుగా ఉందామా? అంటూ సభికులను ప్రశ్నించారు. మిమ్మల్ని పాలకులుగా మార్చాలనే ఉద్దేశ్యంతోనే తనను బీఎస్పీలోకి ఆహ్వానించడమేగాక రాష్ట్ర కోఆర్డినేటర్‌ పదవి ఇచ్చిన బెహన్‌ మాయవతి, జాతీయ కోఆర్డినేటర్‌ రాంజీకి కృతజ్ఞతలు అని అన్నారు. సభకు మటన్‌ పెడితే వచ్చారా? చికెన్‌ పెడితే వచ్చారా? బీరు, బిర్యానీ, డబ్బు ఇస్తే వచ్చారా? అంటూ ప్రశ్నించి అంతా మనస్ఫూర్తిగా వచ్చారని చెబుతూ పాలకులు డబ్బులిచ్చి మాయ చేసే ప్రమాదముందని, దాని నుంచి బయటపడాలంటే అవ్వలకు, తాతలకు, బిడ్డలకు బహుజన రాజ్యం వస్తే ఎంత గొప్పగా ఉంటుందో వివరించాలని పిలుపునిచ్చారు.


ఉద్యోగానికి రిజైన్‌ చేసిన రోజే పోలీసులు కేసులు పెట్టారని, ఇక్కడున్న ఇంతమంది ప్రవీణ్‌కుమార్‌లపైన ఎన్ని కేసులు పెడతారని ప్రశ్నించారు. కారు కింద పడతారా? ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌ వైపునకు పోదామా? ఢిల్లీ ఎర్రకోటపైన నీలిరంగు జెండాను ఎగరవేద్దామా? అంటూ ప్రవీణ్‌కుమార్‌ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. బహుజన రాజ్యం వస్తే  లక్షలాది మంది విద్యార్థులను విదేశీ విద్యకు పంపిస్తామని తన ఉద్దేశాన్ని వివరించారు. తెలంగాణలో అసెంబ్లీ సాక్షిగా అనురాగ్‌, మల్లారెడ్డి యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం తెలిపారని, ఆ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ కల్పించాలని తన డిమాండ్‌ ఏంటో చెప్పారు. ఏడున్నరేళ్లుగా సీఎం కేసీఆర్‌ మాటల గారడీతో మోసం చేస్తున్నారని, తనకు పిట్ట కథలు చెప్పడం, యాసలో మాట్లాడి వాసాలు లెక్కపెట్టడం రాదని పరోక్షంగా సీఎంను విమర్శించారు.


స్వచ్ఛందంగా కదిలివచ్చిన బహుజనం 

వాహనం, భోజనం, మందు, మనీ లేకుండా స్వ చ్ఛందంగా సభకు తరలిరావాలని ప్రవీణ్‌కుమా ర్‌ ఇచ్చిన పిలుపు ఏ మేరకు విజయవంతం అవుతుందో అనే ఆసక్తి సర్వత్రా ఉంది. 10వేల మందిని మైదానంలో నిలబెడితే ప్రవీణ్‌ గొప్పవాడే అంటూ ఇటీవల ఓ నేత వ్యాఖ్యానించారు. దీన్ని తారుమారు చేస్తూ నల్లగొండకు మధ్యాహ్నం నుంచే వాహనాలు, జన సందడి ప్రారంభమైంది. సభకు వచ్చిన వారికి ఆయా జిల్లాలకు అనుగుణంగా పార్కింగ్‌ ఏర్పాటు చేయగా, అక్కడే వాహనాలు నిలిపి నడుచుకుంటూ వచ్చారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారికోసం రూ.50 చెల్లిస్తే భోజనం అందించే ఏర్పాటు చేయగా, సభకు వచ్చిన వారు దాన్ని చెల్లించి భోజనం చేశారు. ఇతర సభలకు భిన్నంగా సభా వేదికకు సమీపంలో పెద్దసంఖ్యలో బుక్‌స్టాల్స్‌ కనిపించాయి. రాజ్యాంగం, డాక్టర్‌ అంబేడ్కర్‌ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను విక్రయించారు. చాలామంది యువకులు అంబేడ్కర్‌, కాన్షీరాం ప్రతిమలు సైతం కొనుగోలు చేశారు. సభ వచ్చిన వారిలో పెద్దసంఖ్యలో విద్యావంతులు, ఉద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. ప్రవీణ్‌కుమార్‌ను కలిసేందుకు యువకులు పెద్ద సంఖ్యలో పలుమార్లు వేదికపైకి దూసుకొచ్చే ప్రయత్నం చేయగా స్వేరోస్‌, పోలీస్‌ సిబ్బంది వారిని వెనక్కి పంపారు.


ఇతర రాజకీయ పార్టీల సభలకు ధీటుగా ఏర్పాట్లు చేశారు. భారీ సంఖ్యలో కుర్చీలు, సౌండ్‌ బాక్సులు, లైట్లు ఏర్పాటు చేశారు. వీఐపీ, మీడియాకు ప్రత్యేక గ్యాలరీ కేటాయించారు. సభికులకు ఇబ్బందికలగకుండా వేదికకు కుడి, ఎడమ వైపు భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు, ప్రత్యేక మొబైల్‌ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. భారీ గజమాలను క్రేన్‌ సహాయంతో వేదికపైకి తెచ్చి ప్రవీణ్‌కుమార్‌ను సన్మానించారు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ మంత్రిగా పనిచేసిన మారెప్ప బీఎస్పీలో చేరారు. కవులు, కళాకారులు స్వచ్ఛందంగా కదిలివచ్చి పాటలు పాడారు. మాస్టర్‌జీ, సుక్క రాంనర్సయ్య, రాంబాబు, మచ్చ దేవేందర్‌ తదితరులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

Updated Date - 2021-08-09T06:38:36+05:30 IST