నమస్తే అంబికా!

ABN , First Publish Date - 2020-10-17T05:30:00+05:30 IST

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజున విజయవాడ కనకదుర్గమ్మ వారి తొలి అలంకారం స్వర్ణకవచాలంకృత శ్రీదుర్గాదేవి.

నమస్తే అంబికా!

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి... అంటే... నేటి నుంచి శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారి పూజ, ఆరాధన ఈ దసరా రోజుల్లో అత్యంత విశేషం. ఈ నవరాత్రుల్లో దుర్గమ్మ వారికి రోజుకో అలంకారం చేస్తారు ఆ అలంకార విశేషాలు, సమర్పించే నైవేద్యాల వివరాలు రోజూ ‘నవ్య’ పాఠకుల కోసం...


నేటి అలంకరణ

స్వర్ణకవచాలంకృత శ్రీదుర్గాదేవి

 

17-10-2020

శనివారం

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి

మాతర్మే మధు కైటభఘ్ని మహిష ప్రాణాప హారోద్యమే 

హేలా నిర్మిత ధూమ్రలోచన వధే, హేచండ ముండార్దిని!

నిశ్శేషీకృత రక్తబీజ దనుజే! నిత్యే! నిశుంభావహే

శుంభధ్వంసిని సంహారాశు దురితం దుర్గే - నమస్తేంబికే!!


దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజున విజయవాడ  కనకదుర్గమ్మ వారి తొలి అలంకారం స్వర్ణకవచాలంకృత శ్రీదుర్గాదేవి. బంగారు కవచం ధరించి.. సువర్ణ కాంతులీనుతూ భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తారు. పురాణేతిహాసాల ప్రకారం... అమ్మవారు మహిషాది రాక్షస సంహారం అనంతరం కనకప్రభల (బంగారు కాంతుల)తో  వెలుగొందుతూ వచ్చి ఇంద్రకీలాద్రి హృదయ భాగంలో వెలసింది. ఇంద్రాది దేవతలంతా తరలివచ్చి అమ్మవారిని కనకదుర్గగా కీర్తించారు. అప్పటి నుంచి ఈ అమ్మవారు ‘కనకదుర్గమ్మ’గా ప్రఖ్యాతి పొందారు.


కాగా పూర్వం విజయవాటికాపురి (నేటి విజయవాడ)ని పాలించే మాధవవర్మ మహారాజు దర్మనిరతికి మెచ్చి అమ్మవారు (దుర్గాదేవి) కొన్ని గంటల పాటు కనకవర్షాన్ని కురిపించారనీ, అప్పటి నుంచి ఈ అమ్మవారు ‘కనకదుర’్గగా పూజలందుకుంటున్నారనీ మరో కథ ఉంది. ఈ గాథలను గుర్తు చేసుకుంటూ ఈ విశిష్టతను కొనియాడుతూ దసరా ఉత్సవాల తొలిరోజున అమ్మవారిని స్వర్ణకవచంతో అలంకరించి పూజిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే సమస్త దారిద్య్ర బాధలూ, సకల దోషాలూ, సర్వ భయాలూ తొలగుతాయని భక్తుల విశ్వాసం. 


నైవేద్యం: చక్కెర పొంగలి, గారెలు, మినప పిండితో చేసిన ఇతర వంటలు

అలంకరించే చీర రంగు: బంగారు వర్ణం

అర్చించే పూల రంగు: ఎరుపు

పారాయణ : దుర్గా సప్తశతి


Updated Date - 2020-10-17T05:30:00+05:30 IST