అబద్ధాలకే ‘నమస్తే’!.. టీఆర్‌ఎస్‌ పత్రిక బరితెగింపు

ABN , First Publish Date - 2020-07-28T07:52:54+05:30 IST

ఇంట్లో సహజంగా చనిపోయిన వారికి మానవతా దృక్పథంతో జీహెచ్‌ఎంసీ అంత్యక్రియలు చేస్తోందంటూ కొందరు మృతుల పేర్లు, వారిని తరలించిన

అబద్ధాలకే ‘నమస్తే’!.. టీఆర్‌ఎస్‌ పత్రిక బరితెగింపు

  • ఆంధ్రజ్యోతి కథనంపై అడ్డగోలు వాదనలు
  • జీహెచ్‌ఎంసీ వివరణ ఒకరోజు ముందే అందులో ప్రత్యక్షం
  • ఆటోలను అంబులెన్సులుగా చూపారు
  • మారుతి 800, ఇండికా కార్లూ అంబులెన్సులేనట!
  • కొండయ్యను కొవిడ్‌ మృతుడిగా ప్రకటించిన జీహెచ్‌ఎంసీ
  • అది కూడా సాధారణ మరణమంటూ మళ్లీ బుకాయింపు
  • గాంధీలో నాలుగు నెలల్లో 1,015 మృతులని అంగీకారం
  • ప్రభుత్వ లెక్కల్లో చూపింది 463 మాత్రమే
  • కొవిడ్‌ ప్రత్యేక ఆస్పత్రిలో 552 సాధారణ చావులా?
  • మృతులనూ గాంధీ స్వీకరిస్తోందట!


ఇంట్లో సహజంగా చనిపోయిన వారికి మానవతా దృక్పథంతో జీహెచ్‌ఎంసీ అంత్యక్రియలు చేస్తోందంటూ కొందరు మృతుల పేర్లు, వారిని తరలించిన ‘అంబులెన్స్‌’ల నంబర్లు నమస్తే తెలంగాణలో ప్రచురించారు. అలాగే కరోనా అనుమానితులనూ ఇలాగే తరలించామంటూ మరికొందరు మృతుల పేర్లు, వారిని తరలించిన ‘అంబులెన్స్‌’ల నంబర్లు ఇచ్చారు. ఆంధ్రజ్యోతి కథనంపై జీహెచ్‌ఎంసీ విడుదల చేసిన వివరణలోనూ ఇవే వివరాలు ఉన్నాయి. అయితే ఇద్దరు మృతుల్ని తరలించిన అంబులెన్సుగా సర్కారీ పత్రికవారు, సర్కారువారు చెప్పిన ఏపీ 10వీ 6966 నంబరు గల వాహనం ఏమిటో పక్కన ఫొటోలో చూడండి. అది అంబులెన్స్‌ కాదు... ఆటో!! మరో మూడు మృతదేహాల్ని తరలించినట్లుగా చెబుతున్న ఏపీ టీఎస్‌ 13 యూబీ 4948 నంబరు వాహనం కూడా  ఆటోనే! అలాగే ఇంకో మూడు మృతదేహాల్ని తరలించామంటున్న ఏపీ 09 ఎఫ్‌ 7854,  ఏపీ 10వీ 1060 నంబరు వాహనాలు కూడా అంబులెన్స్‌లు కావు... వాటిలో ఒకటి మారుతీ 800 కారు!! మరొకటి టాటా ఇండికా కారు!!


హైదరాబాద్‌ సిటీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా మరణాలు ప్రభుత్వం చెబుతున్న దానికంటే ఎక్కువగా ఉన్నాయంటూ ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో కరోనా మృతదేహాలను దహనం చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిజాలను నిజాయితీగా పరిశీలించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ నడుం కట్టింది. ప్రధానంగా హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ఈఎ్‌సఐ శ్మశాన వాటిక వద్ద పరిశీలన చేసింది. మరికొన్ని శ్మశాన వాటికల నుంచీ వివరాలు సేకరించింది. ఒక్క ఈఎ్‌సఐ శ్మశాన వాటికలోనే ఈ నెల 23న అంబులెన్సుల్లో తెచ్చిన 38 మృతదేహాలను దహనం చేశారని, ఇతర శ్మశాన వాటికల్లో మరో 12 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయని గుర్తించింది. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది ఈ అంబులెన్సుల్లో రావడం, బంధువులను దగ్గరకు రానీయకపోవడం వల్ల ఇవి కరోనా మృతులు లేదా కరోనా అనుమానిత మృతులుగా భావించాల్సి వస్తోందని వెల్లడించింది. ‘‘ఏ ఖాతాలో వేయాలి ఈ కరోనా దహనాలను?’’ పేరిట జూలై 26వ తేదీ మెయిన్‌ ఎడిషన్లో ఒక కథనాన్ని అంబులెన్సుల ఫొటోలు, సమయాలతో సహా ప్రచురించింది. ప్రజల్లో అపోహలకు, భయాందోళనలకు తావు లేకుండా ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని, అనుమానాలను తొలగించాలని కోరింది. అయితే ప్రభుత్వం కంటే ముందుగా ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఈ కథనంపై వీరావేశంతో స్పందించింది. ‘మరణం కాదు, రణమే.. చితిమంటలపై చలి కాచుకుంటున్న ఆంధ్రజ్యోతి’ అంటూ సోమవారంనాటి సంచికలో తన అక్కసునంతా వెళ్లగక్కింది. కరోనా వైరస్‌ లేని శవాలతో తప్పుడు లెక్కల కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించిందంటూ ఆరోపించింది. అయితే  కాస్త లోతుగా పరిశీలిస్తే... ‘ఆంధ్రజ్యోతి’ చెప్పినవన్నీ అక్షర సత్యాలనడానికి నమస్తే తెలంగాణ కథనమే ఒక పెద్ద సాక్ష్యంగా మారింది. ఈ కథనంతో కూడిన ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఆదివారం అర్ధరాత్రి ప్రింటయి ఉదయం పాఠకులకు చేరింది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఆంధ్రజ్యోతి కథనంపై ఒక వివరణను విడుదల చేసింది. ఈ వివరణలోని పట్టికలు, అంతకుముందే నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనంలోని పట్టికలు పూర్తిగా ఒకేలా ఉండడం (తప్పులతో సహా) విశేషం! ఇక నమస్తే తెలంగాణ కథనంలో, జీహెచ్‌ఎంసీ వివరణలో ప్రస్తావించిన అంశాల గురించి ఒక్కొక్కటిగా...



1.ఆంధ్రజ్యోతి కథనంలో ఈఎ్‌సఐ శ్మశాన వాటిక (38), బన్సీలాల్‌పేట విద్యుత్‌ శ్మశానవాటిక (2), బన్సీలాల్‌ హిందూ శ్మశాన వాటిక (3), మల్లాపూర్‌ ఫకీర్‌ మల్లా ఖబర్‌స్థాన్‌ (3), మహా ప్రస్థానంలో (2)తోపాటు ఇద్దరు ముస్లింలను వారి కుటుంబ సభ్యులు తమ ప్రైవేటు శ్మశానవాటికలకు తీసుకువెళ్లినట్లు అధికారులు చెబుతున్నారని ప్రచురించాం. మొత్తం 50 మంది కొవిడ్‌ మృతులు లేదా కొవిడ్‌ అనుమానిత మృతులకు 23న అంత్యక్రియలు జరిగినట్లు పలు ఫొటోలతో సహా తెలియజెప్పాం. అయితే కరోనా వైరస్‌ లేని శవాలతో తప్పుడు లెక్కల కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించిందని నమస్తే ఆరోపించింది. ఆరుగురు మృతుల పేర్లను  ప్రస్తావిస్తూ వారివి సహజ మరణాలని పేర్కొంది. మరో ఆరుగురు కొవిడ్‌ అనుమానితులు మాత్రమేనని, వారిలో ఒకరికి నెగటివ్‌ రాగా, మరో ఇద్దరి టెస్టు రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపింది. అయితే ఆంధ్రజ్యోతి కథనంలో ఎక్కడా ప్రస్తావన కూడా లేని న్యూమెట్టుగూడ, బ్యాంక్‌ కాలనీ శ్మశాన వాటికల్లో అంత్యక్రియలు జరిగిన ముగ్గురి (భాస్కర్‌, శేషగిరి, కృష్ణయ్య) వివరాలనూ ఇందులో చేర్చింది. అంటే ఆంధ్రజ్యోతి ఎంతమాత్రం ప్రస్తావించని మృతుల గురించి రాసి... అవి కరోనా మరణాలు కావని, ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలు రాసిందని బుకాయించేందుకు ప్రయత్నించింది. నమస్తే తెలంగాణ కథనంలో/జీహెచ్‌ఎంసీ వివరణలో 12 మంది మృతుల వివరాలు ఇవ్వగా వాటిలో ముగ్గురి వివరాలు ఆంధ్రజ్యోతి కథనంతో ఎంతమాత్రం సంబంధం లేనివి. ఇక మిగతా 9 మంది సంగతి చూద్దాం!


2.జి.కొండయ్య అనే వ్యక్తి సహజంగా మరణించాడంటూ జాబితాలో ఇచ్చారు. మానవతా దృక్పథంతో జీహెచ్‌ఎంసీ అతడి అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే జీహెచ్‌ఎంసీ అధికారిక రికార్డుల ప్రకారం కొండయ్య కరోనా పాజిటివ్‌ వ్యక్తి. (వివరాలు మొదటి పేజీలో చూడండి). ఆయనను తరలించిన అంబులెన్స్‌ నంబరు ఏపీ 10 వీ 1060గా నమస్తే పేర్కొంది. (జీహెచ్‌ఎంసీ వివరణలోనూ ఇలాగే ఇచ్చారు) అయితే ఆ నంబరు గల వాహనం అంబులెన్స్‌ కాదు... టాటా ఇండికా కారు! ఇక మిగతా 8 మంది సంగతి పరిశీలిద్దాం!!


3.సహజ మరణాల జాబితాలో పేర్కొన్న మరో వ్యక్తి బి.కృష్ణయ్యను తరలించిన అంబులెన్సు కూడా పై నంబరే అని తెలిపారు. అంటే అది కూడా అంబులెన్స్‌ కాదు. ఇదే జాబితాలో పేర్కొన్న సంతోషి, సత్యనారాయణలను ఏపీ 10 వీ 6966 నంబరు అంబులెన్స్‌లో తరలించినట్లు చెప్పగా అది ఆటో కావడం గమనార్హం. ఇందులో కృష్ణయ్య (పైన వచ్చింది కాబట్టి) మినహా మిగతా ఇద్దరినీ తీసేస్తే ఇక మిగిలింది ఆరుగురు!!


4. ఇక కేవలం కరోనా అనుమానిత మృతులుగా పేర్కొన్న వారిలో భాస్కర్‌, శ్రీనివాసాచారి, శేషగిరి అనేవారిని తరలిం చిన అంబులెన్స్‌ నంబర్‌ టీఎస్‌ 13 యూబీ 4948గా నమస్తే తెలిపిం ది. నిజానికి ఇది కూడా అంబులెన్స్‌ కాదు.. ఆటోనే! అందువల్ల శ్రీనివాసాచారిని కూడా పక్కనపెడితే మిగిలింది అయిదుగురే.


5.మరో గుర్తు తెలియని మృతదేహాన్ని ఏపీ 09 ఎఫ్‌ 7854 నంబరు గల అంబులెన్స్‌లో తరలించినట్లు తెలిపారు. అయితే ఇది కూడా అంబులెన్స్‌ కాదు... మారుతి 800 కారు కావడం విశేషం. (ఇక్కడ ప్రస్తావించిన ఆటోలపై ఉన్న చలానాల ఆధారంగా ఈ వివరాలు సేకరించాం. ఒకవేళ చలానాల్లో ఉన్నవి తప్పుడు నంబర్లయితే అనే ప్రశ్న తలెత్తవచ్చు. అయితే మారుతి 800, టాటా ఇండికా కార్ల వివరాలు చలానాల ద్వారా కాకుండా, అధికారిక రికార్డుల నుంచే సేకరించాం. అందువల్ల అవి ఏ రకంగానూ తప్పయ్యే అవకాశం లేదు). అంటే 50 మంది మృతుల అంత్యక్రియల గురించి ఆంధ్రజ్యోతి ప్రచురిస్తే అందులో నమస్తే, జీహెచ్‌ఎంసీ వివరణ ఇచ్చింది కేవలం 12 మంది గురించి!! ఆ 12 మందిలోనూ 8 మంది వివరాలు తప్పుల తడకలు!


6.ఇక ఆంధ్రజ్యోతి ఇప్పటివరకూ సేకరించలేకపోయిన కొన్ని వివరాలను కూడా ప్రభుత్వ పత్రిక అయిన ‘నమస్తే’ కథనంలో బయటపెట్టేశారు. గాంధీ ఆసుపత్రిలో ఏప్రిల్‌లో 113 మంది, మే నెలలో 189 మంది, జూన్‌లో 344 మంది, జూలైలో 369 మంది చనిపోయినట్లు తెలిపారు. అంటే నాలుగు నెలల్లో మొత్తం 1015 మంది గాంధీలో చనిపోయారు. నమస్తే ఈ కథనం రాసింది జూలై 26వ తేదీన! ఆ రోజుకు రాష్ట్రంలో కరోనా మృతులు అధికారిక లెక్కల ప్రకారం 463 మంది. మరి మిగతా 552 మంది ఎవరు? గాంధీ ఆసుపత్రిని ప్రత్యేక కొవిడ్‌ ఆసుపత్రిగా మొదట్లోనే ప్రకటించారు. మార్చి నెలలోనే నాన్‌-కరోనా పేషెంట్లను అక్కడి నుంచి వేరే ఆసుపత్రులకు తరలించేశారు. ఏప్రిల్‌ మూడో వారం నుంచి కేవలం కొవిడ్‌ పేషెంట్లకు మాత్రమే గాంధీలో చికిత్స అందిస్తున్నారు. ఇతర వ్యాధులున్న పేషెంట్లను, ప్రమాదాల్లో గాయపడ్డవారిని గాంధీకి వస్తే చేర్చుకోవడం లేదు. అంటే గాంధీలో చనిపోయినవారంతా కరోనా లేదా కరోనా అనుమానిత లక్షణాలతో చనిపోయినవారై ఉండాలి. రాష్ట్రంలో మొత్తం కరోనా మృతులందదరూ (463 మంది) గాంధీలోనే మరణించారని అనుకుందాం. 1015లో నుంచి 463 తీసివేస్తే 552 మంది కరోనా లక్షణాలతో చనిపోయినట్లు భావించాలి. అంటే పాజిటివ్‌గా తేలిన వారి కంటే లక్షణాలతో చనిపోయినవారే అధికంగా ఉన్నట్లు! మరి ఇంత పెద్ద సంఖ్యలో అలాంటివారు ఉంటే... ఆ సంఖ్యను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదు? వారిలో నెగటివ్‌ వచ్చిన వారిని తప్పించి మిగతావారి వివరాలైనా వెల్లడించాలి కదా! అనుమానితులు ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు దానిపై తగిన స్థాయిలో స్పందించాలి కదా! వారి కుటుంబ సభ్యుల్ని క్వారంటైన్‌ చేయాలి కదా! ట్రాకింగ్‌, ట్రేసింగ్‌, టెస్టింగ్‌ అనే సూత్రాల్ని పాటించాలి కదా!


7.ప్రభుత్వం కరోనాపై విడుదల చేసే బులెటిన్‌ కొత్త ఫార్మాట్‌లో పాజిటివ్‌లు మాత్రమే గాంధీకి రావాలని, అనుమానిత లక్షణాలు ఉన్నవారు జిల్లా ఆసుపత్రి లేదా చెస్ట్‌ ఆసుపత్రి, ఫీవర్‌ ఆసుపత్రి, కింగ్‌ కోఠి ఆసుపత్రికి వెళ్లాలని ఇప్పుడు లిఖితపూర్వకంగానే సూచిస్తున్నారు. దీనినిబట్టి గాంధీలో కరోనా పాజిటివ్‌ వారికి మాత్రమే చికిత్స అందిస్తున్నారని స్పష్టంగా  అర్థమవుతుంది. పాజిటివ్‌ రిపోర్టు లేనివారికి గాంధీలో చికిత్స నిరాకరించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. గాంధీకి వచ్చేవారికి అక్కడికక్కడే టెస్టులు చేయడానికి ఒక ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఒక పక్క టెస్టు రిపోర్టు లేనివారికి గేట్లు మూసేస్తూ... మరోపక్క గాంధీలో జరిగినవన్నీ కరోనా మరణాలు కాదని సమర్థించుకోవడం కంటే పరిహాసం ఉంటుందా? గాంధీ మృతుల సంఖ్య ప్రభుత్వ గణాంకాలపై ప్రజల అనుమానాల్ని మరింతగా పెంచేలా ఉంది.


8.నమస్తే కథనంలో మరో విచిత్రమైన విషయం కూడా రాశారు. ‘‘ఇంట్లో లేదా ప్రైవేటు దవాఖానాల్లో కొవిడ్‌ అనుమానంతో మరణించిన రోగిని కూడా గాంధీ ఆస్పత్రి స్వీకరిస్తున్నది’’ అని తెలిపారు. ఒక వ్యక్తి చనిపోయాక గాంధీ ఆస్పత్రి అతనిని స్వీకరించడం ఏమిటి? మృతుడిని ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకోరు కదా! అంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో చనిపోయిన వారిని ప్రభుత్వ ఆస్పత్రి అయిన గాంధీ ఖాతాలో వేసేసి ప్రైవేటు ఆస్పత్రుల ఇమేజ్‌ను కాపాడుతున్నామని సర్కారీ పత్రికే ఘనంగా చెబుతున్నది.


9.గాంధీలో జూలైలో (26 వరకు) 369 మంది చనిపోగా రోజుకు సగటున 12 మంది మరణించినట్లు నమస్తే పేర్కొంది. 26 రోజులపాటు రోజుకు 12 చొప్పున లెక్కిస్తే 312 మాత్రమే అవుతుంది. ఇక పశ్చిమబెంగాల్‌లో ప్రతి వందమంది కరోనా రోగుల్లో ఏకంగా 71.69 మంది చనిపోతున్నారని నమస్తే ప్రకటించేసింది. ఇన్ని తప్పులు, వక్రీకరణలతో కూడిన నమస్తే... ఆంధ్రజ్యోతి తప్పుడు లెక్కల కథనాన్ని ప్రచురించిందని ఆరోపించడం విశేషం.


ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో అల్లాడుతున్న వేళ ప్రజలకు ధైర్యం ఇవ్వాల్సింది పోయి చితిమంటలపై ఆంధ్రజ్యోతి చలి కాచుకుంటోందని నమస్తే వ్యాఖ్యానించింది. అయితే కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేలా, వారికి ధైర్యం కలిగించేలా అత్యధిక కథనాలను ప్రచురించింది ఆంధ్రజ్యోతే! మృతదేహాల నుంచి కరోనా వ్యాపించదని, ప్రజలు అపోహలతో అమానుషంగా ప్రవర్తించరాదని చెప్పింది ఆంధ్రజ్యోతే!! కరోనా నుంచి కోలుకున్న విజేతల అనుభవాలను ప్రతిరోజూ ప్రచురిస్తూ ప్రజలకు ధైర్యం చెబుతున్నది ఆంధ్రజ్యోతే!! కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రముఖుల అనుభవాలకు అక్షర రూపం ఇస్తున్నదీ ఆంధ్రజ్యోతే!! ఒక్క కథనంలో ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేసినంత మాత్రాన శాపాలు పెట్టడం ఎంతవరకూ సమంజసం? కరోనాకు భయపడవద్దని ప్రజలకు ధైర్యం చెప్పడంతోపాటు వ్యాధిపై పోరాటంలో ప్రభుత్వం తప్పటడుగులు వేస్తుంటే ఎత్తిచూపాల్సిన బాధ్యత కూడా ప్రజాస్వామ్యంలో పత్రికలకు ఉంటుంది. ఆ విషయంలో ఆంధ్రజ్యోతి వెనుకంజ వేయబోదు. రాష్ట్రంలో పీపీఈ కిట్ల కొరత ఉందని ఆంధ్రజ్యోతి గతంలో ప్రచురించగా... ప్రభుత్వాధినేతలు దానిపై ఎలా స్పందించారో, ఆంధ్రజ్యోతికి ఎలాంటి శాపాలు పెట్టారో పాఠకులకు తెలిసిందే. అయితే తమకు పీపీఈ కిట్లు లేవంటూ జూనియర్‌ డాక్టర్లు రోడ్డుకెక్కడంతో అసలు నిజమేమిటో కొద్దిరోజుల్లోనే బయటపడింది. అలాగే రాష్ట్రంలో టెస్టులు తగిన సంఖ్యలో చేయడం లేదని కూడా ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించింది. దేశంలో అతి తక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, హైకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు టెస్టుల సంఖ్య పెంచాల్సి వచ్చింది. తాజాగా కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి సైతం కరోనా విషయంలో తెలంగాణ సహా 9 రాష్ట్రాల చర్యలు తగినంతగా లేవని పేర్కొన్న సంగతి గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న కరోనా బులెటిన్‌లో అరకొర సమాచారమే ఉంటోందని, ఇతర రాష్ట్రాల బులెటిన్లతో పోలుస్తూ ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. ఆ తర్వాత హైకోర్టు మొట్టికాయలతో బులిటెన్‌ స్వరూపం మారింది. తాజా బులెటిన్‌ తీరుపై కూడా హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేయడం గమనార్హం. ఇప్పుడు మృతుల సంఖ్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వ లెక్కలపై అనుమానాలు వస్తున్నాయి. చాలా రాష్ట్రాలు మృతుల సమగ్ర వివరాలు ఇస్తుండగా ఇక్కడ తీరు భిన్నంగా ఉంది. తాజాగా జిల్లాల బులెటిన్లను సైతం ఆపేశారు. సర్కారీ పత్రిక చెప్పిన గాంధీ మృతుల లెక్కల ప్రకారం కొవిడ్‌ మృతుల కంటే అనుమానిత మృతులే ఎక్కువగా ఉన్నట్లు అర్థమవుతున్నది. మృతులకు కూడా కరోనా పరీక్షలు చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. కనీసం వ్యాధి లక్షణాలున్న వారికైనా మరణానంతరం పరీక్షలు చేయాలని చెబితే అంగీకరించలేదు. అప్పట్లో పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అంటే చనిపోయేవరకూ పరీక్ష చేయం, చనిపోయాక ఇక పరీక్ష ఎందుకు? అన్నట్లుగా ప్రభుత్వం తీరు కనిపించింది. దాని ఫలితంగానే మృతుల లెక్కలపై ఇప్పుడు అనుమానాలు ముసురుకుంటున్నాయి. అసలు నిజమేమిటో కాలమే నిర్ణయిస్తుంది. అంతవరకూ ఆంధ్రజ్యోతి తన బాధ్యతను నిర్భయంగా నిర్వర్తిస్తూనే ఉంటుంది.













Updated Date - 2020-07-28T07:52:54+05:30 IST