నమాజ్‌ తెచ్చిన మార్పు

ABN , First Publish Date - 2021-05-28T05:30:00+05:30 IST

మహా ప్రవక్త మహమ్మద్‌ అనుయాయుడైన హజ్రత్‌ ఉమర్‌ ఫారుఖ్‌ కాలంలో జరిగిన సంఘటన ఇది...

నమాజ్‌ తెచ్చిన మార్పు

మహా ప్రవక్త మహమ్మద్‌ అనుయాయుడైన హజ్రత్‌ ఉమర్‌ ఫారుఖ్‌ కాలంలో జరిగిన సంఘటన ఇది. 

మదీనాలోని మస్జిద్‌ నవబీకి నమాజు కోసం ఒక బాలిక రోజూ గుర్రంపై వెళుతూ ఉండేది. ఆమెను ప్రతిసారీ ఒక యువకుడు దారిలో అడ్డగించేవాడు. 

చాలా రోజులు ఓపిక పట్టిన ఆ బాలిక ఒక రోజు అతనితో ‘‘ఏమిటి సంగతి? రోజూ నా దారికి ఎందుకు అడ్డు వస్తున్నావు?’’ అని అడిగింది.

‘‘నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. నిన్ను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను’’ అని చెప్పాడు ఆ యువకుడు.

‘‘నేను ఒక మాట చెబుతాను, వింటావా?’’ అని అడిగిందామె.

‘‘తొందరగా చెప్పు. చంద్రుణ్ణి తీసుకురానా? నక్షత్రాలను తెంచుకొని తేనా? ఏమాత్రం ఆలస్యం చెయ్యను. ఏం కావాలో సెలవివ్వు’’ అన్నాడతను సంతోషంగా.

ఆమె నవ్వి, ‘‘అవేవీ వద్దు. హజ్రత్‌ ఉమర్‌ గారిని అనుసరించి, నలభై రోజులు నమాజ్‌ చదువు చాలు. ఆ తరువాత నన్ను కలుసుకో. నేను నీతో వివాహానికి అంగీకరిస్తాను’’ అంది.

‘‘అంతేనా? చాలా సులువైన పని. నిన్ను పొందడానికి అదేం పెద్ద కష్టం కాదు’’ అని చెప్పాడా యువకుడు.

ఆ మరుసటి రోజు హజ్రత్‌ ఉమర్‌ను అతను కలుసుకున్నాడు. ఆయనను అనుసరిస్తూ, నమాజ్‌ చేయడం ప్రారంభించాడు. ప్రతి రోజూ నమాజ్‌ చేయసాగాడు.. దైవ ప్రవక్త మహమ్మద్‌ ఉపదేశాలు విన్నాడు. అతనిలో అణకువ మొదలయింది. అప్పటి వరకూ దేన్నీ లెక్క చెయ్యని అతను తల కిందకు దించుకొని వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. 

నలభై రోజులు గడిచాయి. అతను ఒక రోజు వీధిలో నడుస్తున్నాడు. వెనుక నుంచి అతణ్ణి ఆ బాలిక పిలిచింది. ‘‘ఓ యువకుడా! వెనక్కి తిరిగి చూడు’’ అని అరిచింది.

‘‘ఉమర్‌ గారు నా హృదయాన్ని అల్లాహ్‌తో కలిపారు. పరాయి మహిళలను చూడడం, మాట్లాడడం ఎంత తప్పో తెలుసుకున్నాను’’ అంటూ అతను ముందుకు నడిచాడు. 

అయిదు పూటలా నమాజ్‌ చదివే భాగ్యాన్ని పొందిన ఆ యువకుడు ఇస్లాం ధర్మం ప్రకారం జీవించే భాగ్యాన్ని అందుకున్నాడు. 

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2021-05-28T05:30:00+05:30 IST