వాటి పేరు కాదు... మన తీరు మారాలి!

ABN , First Publish Date - 2020-07-02T05:07:30+05:30 IST

‘తెల్లగా ఉంటేనే అందం’ అనేది తరతరాలుగా మన భావన. శరీర ఛాయ తక్కువగా ఉండే మన దేశంలో కోట్ల మందిని ఇది ఆత్మన్యూనతకు గురిచేస్తోంది.

వాటి పేరు కాదు... మన తీరు మారాలి!

‘తెల్లగా ఉంటేనే అందం’ అనేది తరతరాలుగా మన భావన. శరీర ఛాయ తక్కువగా ఉండే మన దేశంలో కోట్ల మందిని ఇది ఆత్మన్యూనతకు గురిచేస్తోంది. ఈ ఆత్మన్యూనత ఆధారంగా రంగు పెంచే వ్యాపారం వందల కోట్ల మేర సాగుతోంది. తాజాగా అమెరికాలో ఒక నల్లజాతీయుడిని పోలీసులు దారుణంగా చంపిన ఘటన నేపథ్యంలో... సౌందర్య సాధనాల కంపెనీలు ‘రంగు’ మార్చుకుంటున్నాయి. ఈ పరిణామంపై సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా ఉండే సినీ నటి, దర్శకురాలు నందితా దాస్‌ మనోభావాలివి... 


‘‘ప్రస్తుతం ‘కొవిడ్‌-19’ విజృంభణ సమయంలో సామాజికమైన అనేక తప్పిదాల విషయంలో  ఊహించని వర్గాల నుంచి సానుభూతి వ్యక్తమవుతోంది. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. తమ ఉత్పత్తుల నుంచి ‘ఫెయిర్‌నెస్‌’ (అందంగా మార్చడం), ‘వైటెనింగ్‌’ (ముఖాన్ని తెల్లగా చెయ్యడం), ‘లైటెనింగ్‌’ (చర్మం కాంతిని పెంచడం) అనే పదాలను తొలగిస్తామని హిందుస్తాన్‌ యూనిలివర్‌ కంపెనీ ఈ మధ్య ప్రకటించింది. ఆ సంస్థ తయారు చేసే చర్మం ఛాయను మెరుగుపరుస్తుందని చెప్పుకొనే ఉత్పత్తి ‘ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ పేరు కూడా ఆ మాట తొలగిస్తారట! ఇలాంటి ప్రకటన వస్తుందని ఎవరమైనా ఊహించామా? ఇది పూర్తిగా ప్రతీకాత్మకమే అయినప్పటికీ (వాళ్ళు కేవలం పేరు మాత్రమే మార్చారు. ఉత్పత్తిని ఆపెయ్యలేదు) పెద్ద ముందడుగేనని చెప్పవచ్చు. ఎక్కువమంది మేనిఛాయ తక్కువగా ఉండే ఈ దేశంలో అందంగా ఉండడానికి తెల్లగా ఉండాలనే అసంబద్ధమైన సందేశాన్ని వ్యాప్తి చేయడం కోసం చాలా బ్రాండ్లు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. కాబట్టి, మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఒక సంస్థ కనీస స్థాయిలోనైనా ఈ విధంగా స్పందించడం విస్తృతమైన చర్చకు కచ్చితంగా దారి తీస్తుంది. 


నిర్లక్ష్యం చెయ్యలేం... 

మతం, కులం, ఆడ-మగ, లైంగికత, భాష, చర్మం రంగు... ఇలా అనేక రూపాల వివక్షల్లో ప్రపంచం కూరుకుపోయింది. ఒక వ్యక్తికి పుట్టుకతో వచ్చిన గుర్తింపే చాలా వరకూ నిర్ణాయకమైన అంశం అవుతోంది. కానీ, ఇప్పుడిప్పుడే దాన్ని సవాల్‌ చెయ్యడం కూడా పెరుగుతోంది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యడానికి లేదు. హిందుస్తాన్‌ యూనిలివర్‌ ప్రకటన దరిమిలా, ఫెయిర్‌నెస్‌ ఉత్పత్తుల మార్కెటింగ్‌ తక్కువగా కనిపించేలా దిద్దుబాటు చేసుకొనే ప్రపంచాన్ని చూడనున్నామా? ఆ సంగతి ఇప్పుడే చెప్పలేం. 


వారి ఉద్దేశం అదే... 

‘బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌’ ఉద్యమం వేగాన్ని పుంజుకుంటోంది. అమెరికాలో జార్జి ఫ్లాయిడ్‌ అనే నల్ల జాతీయుణ్ణి పోలీసులు నిర్దాక్షిణ్యంగా చంపిన దరిమిలా విస్తృతంగా వెల్లువెత్తిన సామాజిక స్పందన దీన్ని మరింత పెంచింది. ఈ రకమైన హింస కొత్తది కాదు. కానీ ఈ సంఘటనపై తలెత్తిన నిరసనలకు సర్వత్రా ఆమోదం లభించింది. ప్రజాభిప్రాయంలో వచ్చిన ఒక స్పష్టమైన మార్పు కన్నా హృదయాల్లో మార్పు తెచ్చేది మరేదీ ఉండదు. కాబట్టి, ఆ ఉత్పత్తుల ‘పేరు’ మార్చడం కచ్చితంగా లెక్కలు వేసుకొని, జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయమే! ఏదిఏమైనా అది కొంత సానుకూలతను ప్రతిఫలిస్తోంది. చర్మం రంగును ‘తెల్లబరిచే’ తమ ఉత్పత్తుల శ్రేణిని నిలుపు చేస్తామని ‘జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌’ సంస్థ కూడా ప్రకటించింది. అలాగే, వాళ్ళ బ్రాండెడ్‌ ఉత్పత్తులను ప్రస్తుతం ఉన్న (మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న) రంగు కాకుండా మరిన్ని (చర్మం) షేడ్స్‌తో తయారు చెయ్యనున్నారు. ‘‘సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు’’ అని నాకు నేను చెప్పుకొంటున్నాను.


ఇలాంటి పరిస్థితుల్లో మన ఆలోచనా విధానాలు 

కూడా మారుతాయా? ప్రకటనల వ్యూహాల్లో వస్తున్న మార్పు మన ఆలోచనను ఎంతమేర ప్రభావితం చేయగలుగుతుంది? దానికి ఇప్పటికిప్పుడు స్పష్టమైన జవాబు లేకపోయినా ఒక మాట మాత్రం చెప్పొచ్చు! సరైన దిశలో పడే ప్రతి అడుగునూ గుర్తించాల్సిందే. 


అది ఊహించలేదు!

శరీరం రంగు విషయంలో వివక్ష గురించి నేనెప్పుడూ గట్టిగా మాట్లాడుతూ ఉంటాను. అది నా జ్ఞాపకాల్లో మాత్రమే కాదు, నాకన్నా వయసులో పెద్దవాళ్ళు చెప్పిన కథల్లో కూడా అస్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. 2013లో చెన్నైకి చెందిన ఒక సంస్థ నన్ను కలిసింది. ‘డార్క్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ పేరుతో చేపట్టిన వాళ్ళ ఉద్యమానికి మద్దతునివ్వాలని కోరింది. చర్మం రంగు వివక్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందనీ, మనం మనకు ఇచ్చుకొనే విలువ మీదా, ఆత్మవిశ్వాసం మీదా అది తీవ్రంగా ప్రభావం చూపిస్తుందనీ నాకు అప్పటికే తెలుసు. కానీ ఆ ఉద్యమం అందర్నీ అంతలా స్పృశిస్తుందని అప్పుడు అనుకోలేదు. హఠాత్తుగా అది వైరల్‌ అయిపోయింది. అనుకోకుండానే దానికి నేను ప్రధాన ప్రచారకర్తగా మారిపోయాను. బహుశా మిగతా చాలామంది నటీనటులు ప్రతి సినిమాకూ శరీర ఛాయ పెంచుకుంటూ ఉండడం దీనికి కారణం కావచ్చు. ‘డార్క్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ ఉద్యమం పదో వార్షికోత్సవం సందర్భంగా 2019లో ఆ ప్రచారాన్ని నేను పునరుద్ధరించాను. మరింతమందిని దానిలో చేర్చుకోవడానికీ, వైవిధ్యాన్ని వేడుక చేసుకోవడానికీ ‘ఇండియాస్‌ గాట్‌ కలర్‌’ అని దానికి పేరు పెట్టాను. ఇదంతా సముద్రంలో నీటి బిందువంత! కానీ ప్రతి బిందువూ మనల్ని కెరటం అంచుకు దగ్గరగా తీసుకెళుతుంది.’’


పరిష్కారం మన చేతిలోనే!

‘‘ఒంటి రంగునుబట్టి వివక్షకు మూల కారణం ఇలాంటి ఉత్పత్తులు విక్రయించే కంపెనీలు కావనేది మనకు మనం గుర్తు చేసుకోవాలి. సామాజిక సమస్యల పట్ల కార్పొరేట్‌ సంస్థలు కొంత బాధ్యతను కనబరుస్తున్నాయి. అయితే ఈ సమస్య విషయంలో ప్రాథమికంగా అవి మార్పును తీసుకువస్తాయని ఆశించలేం. మనం ఇన్నాళ్లూ అందానికి సంబంధించిన తెల్లగా ఉంటేనే అందం అనే తప్పుడు భావనను మోసుకుంటూ తిరుగుతున్నాం. ఆ సమస్యను మనం పరిష్కరించుకోవాలి. మనం ఇక్కడ మాట్లాడుతున్నది నాలుగువందల కోట్ల డాలర్ల వ్యాపారం గురించి! మరింత మంది వినియోగదారులను ఆకర్షించడానికీ, తద్వారా మరిన్ని క్రీమ్‌లనూ, అందమైన కలలనూ అమ్ముకోవడానికీ అనాదిగా ఉన్న రంగుల పక్షపాతాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారంతే!’’ 

Updated Date - 2020-07-02T05:07:30+05:30 IST