‘మీ టూ’ పోస్టు పెట్టిన బాలుడు 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-05-06T11:54:13+05:30 IST

‘బాయ్స్‌ లాకర్‌ రూమ్’ పేరిట ఏర్పాటైన విద్యార్థుల ఛాట్ గ్రూపులో ఓ బాలికపై పోస్టు పెట్టిన 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య....

‘మీ టూ’ పోస్టు పెట్టిన బాలుడు 11వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

గురుగ్రామ్ : ‘బాయ్స్‌ లాకర్‌ రూమ్’ పేరిట ఏర్పాటైన విద్యార్థుల ఛాట్ గ్రూపులో ఓ బాలికపై పోస్టు పెట్టిన 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురుగ్రామ్ లో సంచలనం రేపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో “మీటూ” పోస్ట్‌లో ఒక అమ్మాయి పేరు పెట్టిన కొన్ని గంటల తర్వాత  బాలుడు తాను నివాసముంటున్న భవనం 11వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గురుగ్రామ్ పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఛాటింగు గ్రూపులో పెట్టిన పోస్టుపై పోలీసులు ప్రశ్నిస్తారని తోటి విద్యార్థులు బాలుడికి ఫోన్ చేసి హెచ్చరించడంతో అతను భయపడి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు. భవనం కింద పెద్ద శబ్దం వినిపించడంతో కిందకు వెళ్లి చూడగా రక్తపు మడుగులో బాలుడు కనిపించాడు. బాలుడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై తాము ఐపీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సెక్టార్ 53 పోలీసు అధికారి దీపక్ కుమార్ చెప్పారు. బాలికలను రేప్‌ చేస్తున్నట్లుగా ఇన్‌స్టాగ్రాం చాట్‌ గ్రూప్‌లో మార్ఫ్‌డ్‌ చిత్రాలను పోస్ట్‌ చేస్తూ, ఫలానా అమ్మాయిని గ్యాంగ్‌ రేప్‌ చేద్దామంటూ చాట్‌గ్రూప్‌ సభ్యులను రెచ్చగొడుతూ, అసభ్య కామెంట్లు పెట్టిన కేసులో ఢిల్లీలోని ప్రముఖ పాఠశాలకు చెందిన 16 ఏళ్ల అబ్బాయిని పోలీసులు అరెస్టు చేశారు. 30మంది సభ్యులు కలిగిన ‘బాయ్స్‌ లాకర్‌ రూమ్‌’ అనే ఈ ఛాట్ గ్రూపులో పోస్ట్‌ చేసిన అసభ్య సంభాషణలు, అసభ్య చిత్రాలకు సంబంధించిన స్ర్కీన్‌షాట్‌లను గ్రూప్‌ సభ్యులెవరో సోషల్‌ మీడియాలో పెట్టారు. ఈ చాట్‌గ్రూప్‌ స్ర్కీన్‌షాట్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2020-05-06T11:54:13+05:30 IST