Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిగ్ బ్రేకింగ్ : పోలీసుల అదుపులో Nara Lokesh

అమరావతి : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను గన్నవరం ఎయిర్ పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇవాళ ఉదయం నుంచి లోకేశ్‌ నరసరావుపేట పర్యటనపై సర్వత్రా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే గుంటూరు జిల్లాలో పలువురు తెలుగు తమ్ముళ్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు.. లోకేష్ వస్తున్నారని తెలుసుకుని గన్నవరం ఎయిర్‌పోర్టుకు దగ్గరకు భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు.


ఎందుకీ పర్యటన..!?

గత ఫిబ్రవరి 24న ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబసభ్యులను పరామర్శించడానికి గుంటూరు వెళ్లారు. నరసరావుపేట పర్యటన కోసం గన్నవరం ఎయిర్ పోర్టుకు లోకేష్ వచ్చారు. అయితే.. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాపై ఎలాంటి కేసులు లేవ్!

పోలీసులు అదుపులోకి తీసుకున్నాక.. పోలీస్ వ్యాన్ నుంచే మీడియాతో మాట్లాడారు. నా పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదు. నేను ధర్నాలు, ఆందోళనలు చేయడానికి వెళ్లట్లేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నాను. బాధిత కుటుంబాన్ని పరామర్శించి వస్తా. పరామర్శకు వెళ్తుంటే పోలీసులు కావాలనే అడ్డుకుంటున్నారు. ఏది తప్పో.. ఏది ఒప్పో నాకు తెలుసు. నాపై ఎలాంటి కేసులు లేవు అని నారా లోకేష్‌ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులు-లోకేష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ.. ఖాకీలకు వ్యతిరేకంగా కార్యకర్తలు, నేతలు నినాదాలతో హోరెత్తించారు.

భారీగా మోహరింపు..

ఇదిలా ఉంటే.. గుంటూరు నరసరావుపేట టీడీపీ ఆఫీస్‌ దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. లోకేశ్‌ నరసరావుపేట పర్యటనకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. దీంతో లోకేష్‌ పర్యటన దృష్ట్యా టీడీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. నరసరావుపేటలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని జిల్లా పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరాంను ముందస్తు అరెస్ట్ చేశారు. మరోవైపు.. టీడీపీ నేత అరవిందబాబును కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

Advertisement
Advertisement