విద్యార్థులతో నారా లోకేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ABN , First Publish Date - 2022-01-27T06:35:20+05:30 IST

కరోనా విలయతాండవం చేస్తుంటే.. విద్యార్థుల ప్రాణాలతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెలగాటమాడుతున్నారని, ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు.

విద్యార్థులతో నారా లోకేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌
వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న నారా లోకేష్‌

కర్నూలు(అగ్రికల్చర్‌), జనవరి 26: కరోనా విలయతాండవం చేస్తుంటే.. విద్యార్థుల ప్రాణాలతో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెలగాటమాడుతున్నారని, ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. బుధవారం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో కొవిడ్‌ బారిన పడిన బాధిత పాఠశాలల విద్యార్థులతో లోకేష్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. లోకేష్‌ మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాప్తి ఓ వైపు విజృంభిస్తున్నా ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం మొండిగా వ్యవహరిస్తూ విద్యార్థులతో పాఠశాలలను నిర్వహించడం దారుణమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా కొవిడ్‌ నియమ నిబంధనలు పాటించకుండా కనీసం మాస్కులు, శానిటైజేషన్‌ లేకుండా వ్యాక్సినేషన్‌ ఇవ్వకుండానే తరగతులు నిర్వహించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుని కరోనా తగ్గుముఖం పట్టేదాకా ఆన్‌లైన్‌ తరగతులు ఏర్పాటు చేస్తూ విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అబుబాకర్‌ సిద్దిక్‌, కోటకొండ రాజేష్‌, పవన్‌ కుమార్‌గౌడు, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-27T06:35:20+05:30 IST