ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడితే.. ఆ సామాజిక వర్గం ఓట్లు వచ్చేస్తాయా?

ABN , First Publish Date - 2022-01-29T09:00:09+05:30 IST

‘‘ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగులను విభజించి పాలిస్తున్నాడు. ఉద్యోగుల్లో వర్గ రాజకీయాలను రెచ్చగొడుతున్నాడు. క

ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడితే.. ఆ సామాజిక వర్గం ఓట్లు వచ్చేస్తాయా?

వర్గ రాజకీయాలను ఉద్యోగుల్లో రెచ్చగొడుతున్నాడు

వారిని విభజించి పాలిస్తున్నాడు

ఏ అర్హతాలేని ఆయన వారిని బెదిరించడమేంటి?

మా నేతలూ అసహ్యించుకుంటున్నారు

సజ్జలపై ఎంపీ రఘురామరాజు ఫైర్‌

‘సంఘాల’తో చర్చించాల్సిన బుగ్గన జాడెక్కడ?

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎంది ఏకపక్ష నిర్ణయం

మత సామరస్యంపై విజయసాయి నీతులు దెయ్యాలు వేదాలు వల్లించడమే: రఘురామ


న్యూఢిల్లీ, జనవరి 28(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగులను విభజించి పాలిస్తున్నాడు. ఉద్యోగుల్లో వర్గ రాజకీయాలను రెచ్చగొడుతున్నాడు. కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా కాని సజ్జల... అన్నీ తానై వ్యవహరిస్తూ మా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులపై పెత్తనం చేస్తున్నాడు. సజ్జల తన పరిధికి మించి వ్యవహరిస్తుండటంపై మా పార్టీలో ప్రజాప్రతినిధులు సైతం అసహ్యించుకుంటున్నారు’’ అని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆయన శుక్రవారం ఇక్కడ తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. సజ్జల వైఖరిని తీవ్రస్థాయిలో తూర్పారబట్టారు. ఏ అర్హతా లేని సజ్జలకు ఉద్యోగ సంఘాలను బెదిరించే హక్కు ఎక్కడిదని నిలదీశారు. ‘నేనున్నాను... నేను వింటాను’ అని అన్న ముఖ్యమంత్రి... ‘సజ్జల ఉన్నాడు... సజ్జల వింటాడు... సజ్జల చేస్తాడు’ అని ఏనాడూ చెప్పలేదని అన్నారు. సజ్జల సకల పాత్రాభినయంపై కోర్టులో వేసిన కేసు ఇప్పటికీ విచారణకు రావడం లేదన్నారు.


న్యాయమైన కోర్కెల సాధన కోసం శాంతియుతంగా పోరాడుతున్న ఉద్యోగుల్లో ఎందుకు అశాంతిని సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు ఉద్యోగ సంఘాల నాయకులతో సంప్రదింపులు జరపాల్సిన రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాఽథ్‌రెడ్డి జాడ ఎక్కడో తెలియడం లేదని అన్నారు. ‘ఎం ధర్మరాజు’ చిత్రాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో సినీ హీరో మోహన్‌బాబు మరోసారి రిలీజ్‌ చేస్తే బాగుంటుందని సూచించారు. ఎన్టీఆర్‌పై నిజంగా సీఎంకి ప్రేమ అంటూ ఉంటే, గత ప్రభుత్వం నిర్వహించిన ‘అన్న క్యాంటీన్ల‘ను ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. ప్రతి పథకానికీ వైఎస్సార్‌, జగనన్న పేర్లు పెట్టే బదులుగా కనీసం ఒక్క పథకానికైనా ఎన్టీఆర్‌ పేరు పెట్టొచ్చుకదా! అని నిలదీశారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టినంత మాత్రాన, ఆ సామాజిక వర్గం ఓట్లు వచ్చేస్తాయా? అని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అసెంబ్లీలో విస్తృతంగా చర్చించకుండా మంత్రుల కాళ్లు కట్టేసి, ఎమ్మెల్యేల నోళ్లు నొక్కేసి, సీఎం ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి మతసామరస్యంపై నీతులు బోధించడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు. జాతీయ జెండాలోని రంగులను విజయసాయిరెడ్డి తప్పుగా అర్థం చేసుకోవడం బాధాకరమని రఘురామరాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-01-29T09:00:09+05:30 IST