సస్యరక్షణ ఉత్పత్తులకు నాట్కో యూనిట్‌

ABN , First Publish Date - 2020-09-22T06:09:41+05:30 IST

నాట్కో ఫార్మా పంటల సస్య రక్షణ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ రంగంలో అధిక విలువ ఉత్పత్తులను విడుదల చేయనుంది. సస్య రక్షణ, ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజిమెంట్‌ (ఐపీఎం) సొల్యూషన్స్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కొత్త తయారీ యూనిట్‌ నిర్మాణం చివరి దశకు వచ్చిందని, 2020-21లో దీన్ని ప్రారంభించనున్నామని నాట్కో ఫార్మా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ నన్నపనేని తెలిపారు...

సస్యరక్షణ ఉత్పత్తులకు నాట్కో యూనిట్‌

  • ఈ ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): నాట్కో ఫార్మా పంటల సస్య రక్షణ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ రంగంలో అధిక విలువ ఉత్పత్తులను విడుదల చేయనుంది. సస్య రక్షణ, ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజిమెంట్‌ (ఐపీఎం) సొల్యూషన్స్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో కొత్త తయారీ యూనిట్‌ నిర్మాణం  చివరి దశకు వచ్చిందని, 2020-21లో దీన్ని ప్రారంభించనున్నామని నాట్కో ఫార్మా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ నన్నపనేని తెలిపారు.


కొత్త ఉత్పత్తి క్లోరంట్రానిలిప్రోల్‌ (సీటీపీఆర్‌)ని  కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇటువంటి అనేక వినూత్న ఉత్పత్తులు, సొల్యూషన్లను కంపెనీ ప్రవేశపెట్టనుందని వివరించారు. ఈ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీ, విక్రయాలు, మార్కెటింగ్‌కు బలమైన సిబ్బంది వ్యవస్థను కంపెనీ సిద్ధం చేసింది. పంటల సంరక్షణ ఉత్పత్తులను దేశ, విదేశాల్లో ప్రవేశపెట్టనుంది. 


కేన్సర్‌ ఔషధాల ధరలపై నియంత్రణ

దేశీయ మార్కెట్‌లో కేన్సర్‌ ఔషధాల ధరలను ప్రభుత్వం నియంత్రిస్తున్నందున కేన్సర్‌ ఔషధాల విభాగం గత ఆర్థిక సంవత్సరంలో ప్రతికూల పరిస్థితులను  ఎదుర్కొందని నన్నపనేని అన్నారు. మార్కెట్‌ పరిమాణం తగ్గుతున్నందున హెపటైటి్‌స-సీ వ్యాపారం సైతం దేశీయ మార్కెట్‌లో క్రమంగా తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కొవిడ్‌ కారణంగా కేన్సర్‌ రోగులు ఆసుపత్రులకు రావడాన్ని వాయిదా వేసుకున్నారు. క్రోమోథెరఫీ ప్రొసీజర్లు కూడా వాయిదా పడ్డాయి. ఈ కారణాలన్నీ దేశీయ మార్కెట్‌లో కంపెనీ కేన్సర్‌ ఔషధాల అమ్మకాలపై పడినట్లు వివరించారు. 


కెనడా మార్కెట్‌పై మరింత దృష్టి

వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉన్న కెనడా, బ్రెజిల్‌ వంటి విదేశీ మార్కెట్లపై నాట్కో ఫార్మా దృష్టి పెట్టనుంది. గత ఆర్థిక సంవత్సరంలో తమ యాంటీవైరల్‌ ఫ్లూ ఔషధం ఓసెల్టామివిర్‌కు పోటీ పెరగడం, ధరల ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ.. అమెరికా మార్కెట్‌ సంతృప్తికరంగానే ఉన్నట్లు నన్నపనేని వివరించారు.

Updated Date - 2020-09-22T06:09:41+05:30 IST