నాటి కష్టం.. నేడు రాకుండా...!

ABN , First Publish Date - 2021-07-30T04:40:07+05:30 IST

ఆక్సిజన.. ఆక్సిజన... ఆక్సిజన.... ఈ పదం పదే పదే వినిపించింది కరోనా సెండ్‌వేవ్‌లోనే. ఎంతో మంది కరోనా బాధితులకు సకాలంలో ఆక్సిజన అందక మరణించారు.

నాటి కష్టం..  నేడు రాకుండా...!
నెల్లూరు : జీజీహెచలో 23వేల లీటర్ల సామర్థ్యం కలిగిన లిక్విడ్‌ ఆక్సిజన ట్యాంకులు

జిల్లాలో ఆక్సిజన ప్లాంట్ల ఏర్పాటు

1.86 లక్షల లీటర్ల సామర్థ్యానికి నిర్మాణాలు

ప్రస్తుతం సామర్థ్యం 25 వేల లీటర్లే!

సీఎస్‌ఆర్‌ నిధులతో షార్‌లో భారీ ట్యాంకు

నెల్లూరు, కావలి, గూడూరు, అల్లూరులలోనూ ఏర్పాటు

సీహెచసీలకూ పైప్‌లైన్ల ద్వారా సరఫరా


నెల్లూరు (వైద్యం), జూలై 29 : ఆక్సిజన.. ఆక్సిజన... ఆక్సిజన.... ఈ పదం పదే పదే వినిపించింది కరోనా సెండ్‌వేవ్‌లోనే. ఎంతో మంది కరోనా బాధితులకు సకాలంలో ఆక్సిజన అందక మరణించారు. జిల్లాలో బాధితులకు ఆక్సిజన అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు.  అయితే, ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం ఆక్సిజన కొరత తీర్చేందుకు కార్యాచరణ రూపొందించింది. కరోనా థర్డవేవ్‌ పొంచి ఉన్న దశలో ఆక్సిజన కొరత తీర్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా బాధితులకు ఆక్సిజన అందించాలన్న లక్ష్యంతో ప్లాంట్ల నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వ పరంగా జిల్లాలో ఆక్సిజన ఉత్పత్తి 1.86 లక్షల లీటర్ల లక్ష్యం కానుంది. కరోనా సెకండ్‌వేవ్‌లో 40 వేల లీటర్లు ఆక్సిజన ప్రతిరోజు అవసరం ఉండేది. ప్రస్తుతం 24వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన ట్యాంకులు అందుబాటులో ఉండగా మరో వారంలో  నెల్లూరులోని జీజీహెచలో గాలిద్వారా అక్సిజన తయారు చేసే వెయ్యి లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును అందుబాటులోకి తేనున్నారు. పూర్తిస్థాయిలో జిల్లాకు మంజూరయిన ఆక్సిజన ట్యాంకులు వినియోగంలోకి వస్తే కరోనా థర్డ్‌వేవ్‌లో ఆక్సిజన కష్టాలు పూర్తిగా తొలగనున్నాయి. 


జిల్లాలోనే అతిపెద్దదిగా 1.25 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన క్రయోజనిక్‌ ఆక్సిజన ట్యాంకు అందుబాటులో రానుంది. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సబులిటీ (సీఎస్‌ఆర్‌) నిధుల కింద ఈ ట్యాంకును శ్రీహరికోటలోని షార్‌ కేంద్ర ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే చెన్నైతోపాటు తిరుపతి, చిత్తూరు వంటి ప్రాంతాలకు కూడా ఆక్సిజన సరఫరా చేసేస్థాయికి జిల్లా చేరుకుంటుంది. 

నెల్లూరులోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 10వేల లీటర్లు, 13 వేల లీటర్లు సామర్థ్యం కలిగిన లిక్విడ్‌ ఆక్సిజన ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే గాలిద్వారా ఉత్పత్తి చేసే వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన ప్లాంట్‌ నిర్మాణం పూర్తయింది. మరో వారంలోగా దీన్ని అధికారులు ప్రారంభించనున్నారు. అలాగే రూ.2కోట్ల వ్యయంతో 2వేల లీటర్ల ఆక్సిజన సామర్థ్యం కలిగిన ప్లాంట్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా ప్రస్తుతం ఎర్త్‌వర్క్‌ జరుగుతోంది. ఇక్కడే 200 పెద్ద ఆక్సిజన సిలిండర్లతోపాటు 1,462 ఆక్సిజన కాన్సంట్రేట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో నటుడు సోనూసూద్‌   రూ.1.20 కోట్ల వ్యయంతో ఇటీవల గాలిద్వారా ఆక్సిజన తయారు చేసే వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన ప్లాంట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడే వెయ్యి లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన సామర్థ్యం కలిగిన ఆక్సిజన ట్యాంకు మరమ్మతులకు గురవగా రూ.11 లక్షలతో ప్రభుత్వం దీన్ని అందుబాటులోకి తెస్తుంది. దీంతోపాటు 10 వేల లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన ట్యాంకు ఏర్పాటుకు మంత్రి గౌతంరెడ్డి అంగీకారం తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో గాలినుంచి ఆక్సిజన తయారు చేసే 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకును ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ 70 పెద్ద సిలిండర్‌లు, 90 ఆక్సిజన కాన్సంట్రేట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

కావలిలోని ఏరియా ఆసుపత్రిలో 10వేల లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన ట్యాంకు, గాలినుంచి ఆక్సిజన తయారు చేసే 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

గూడూరులో ఏరియా ఆసుపత్రిలో కూడా 10వేల లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన ట్యాంకు, గాలినుంచి ఆక్సిజన తయారు చేసే 500 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన ప్లాంట్లకు అనుమతులు లభించాయి. 

అల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా 500 లీటర్ల లిక్విడ్‌ ఆక్సిజన నిల్వలకు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ నిర్మాణాలన్నింటినీ ఏపీఎంఎస్‌ఐడీసీ చేపడుతోంది.


వేగవంతంగా పైపులైన్ల నిర్మాణం  


ఇదిలా ఉంటే ఆక్సిజనను రోగులకు వెంటనే అందించే ఆక్సిజన పైప్‌లైన్ల నిర్మాణ పనులు ఆయా ఆసుపత్రులలో జోరుగా జరుగుతున్నాయి. ఆత్మకూరు జిల్లా ఆసుపత్రితోపాటు కావలి, గూడూరు ఏరియా ఆసుపత్రులలోనూ ఈ పైప్‌లైన నిర్మాణాలు జరుగుతున్నాయి. వెంకటగిరి సామాజిక ఆరోగ్యకేంద్రం, రాపూరు సీహెచసీ, అల్లూరు సీహెచసీలలోనూ పనులు జరుగుతున్నాయి.  


త్వరగా అందుబాటులోకి తెస్తాం


- ఎం విజయభాస్కర్‌, ఈఈ. ఏపీఎంఎస్‌ఐడీసీ

జిల్లావ్యాప్తంగా ఆక్సిజన ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. పనుల పూర్తికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఆత్మకూరులో మూలనపడ్డ ఆక్సిజన ప్లాంట్‌కు మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తెస్తున్నాం. జిల్లాలో ఆక్సిజన కొరత రానీయకుండా ప్లాంట్ల ఏర్పాటుతోపాటు, ఆసుపత్రులలో పడకలకు ఆక్సిజన అందించేలా పైప్‌లైన నిర్మాణాలు జరుగుతున్నాయి.



Updated Date - 2021-07-30T04:40:07+05:30 IST