216-ఎ

ABN , First Publish Date - 2021-09-29T07:19:11+05:30 IST

రెండు ప్రధాన జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ కొత్త రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

216-ఎ
జాతీయ రహదారిగా అభివృద్ధి కానున్న ఈదరపల్లి నుంచి ముక్కామలకు వెళ్లే రహదారి

కొత్త జాతీయ రహదారి ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల 

అమలాపురం నుంచి రావులపాలెం వరకు 

హర్షం వ్యక్తం చేస్తున్న కోనసీమవాసులు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

రెండు ప్రధాన జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ కొత్త రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అమలాపురం సమీపంలోని 216 జాతీయ రహదారి నుంచి పలివెల మీదుగా రావులపాలెం జాతీయ రహదారిని కలుపుతూ 216(ఎ) రహదారిని ఏర్పాటు చేస్తూ కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ అధికారికంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏళ్లుగా వున్న కోనసీమ ప్రజల చిరకాల వాంఛను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున లిఖితపూర్వకంగా లేఖలు రాయడం ద్వారా అమలాపురం- రావులపాలెం రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించడం శుభ సూచకమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రహదారి ఏర్పాటుకు సహకరించిన కేంద్ర మంత్రి గడ్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అమలాపురంలోని 216 జాతీయ రహదారితో ప్రారంభమై పలివెల వరకు విస్తరించి అక్కడి నుంచి రావులపాలెం వద్ద 216(ఎ)తో రహదారి అనుసంధానం అవుతుందని కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదారుల డైరెక్టర్‌ రాజేష్‌గుప్తా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ రహదారిని సాధించడంలో ముఖ్యమంత్రి జగన్‌ చేసిన కృషి అభినందనీయమని మంత్రి విశ్వరూప్‌ పేర్కొన్నారు. ఈ రహదారి అభివృద్ధికి ప్రభుత్వం రూ.600 కోట్లతో ప్రతిపాదిత అంచనాలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 216 జాతీయ రహదారిలో కత్తిపూడి నుంచి పామర్రు వరకు వివిధ ప్రాంతాల్లో విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లోనే బైపాస్‌లతో పాటు ఈ జాతీయ రహదారి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే కోనసీమ ప్రజలకు జాతీయ రహదారులతో అనుసంధానం పెరిగి రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి. దీనిని త్వరితగతిన విస్తరణ, అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేయాలని కోనసీమవాసులు కోరుకుంటున్నారు.




Updated Date - 2021-09-29T07:19:11+05:30 IST