నేటి నుంచే..

ABN , First Publish Date - 2021-09-15T05:21:02+05:30 IST

నగరంలో..

నేటి నుంచే..
జేఎన్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్న అథ్లెట్స్‌

క్రీడల వేడుకకు వేళాయే...

నేటి నుంచే జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్ పోటీలు
ముస్తాబైన జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం
దేశం నలుమూలల నుంచి 519 మంది క్రీడాకారుల రాక
తెలంగాణ రాష్ట్రం నుంచి 17 మంది సై
రాష్ట్ర జట్టులో వరంగల్‌ జిల్లా వాసి జె.దీప్తి
క్రీడాకారుల సాధనతో స్టేడియంలో సందడే సందడి
నేటి సాయంత్రం ప్రారంభించనున్న మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి


హనుమకొండ:
నగరంలో క్రీడా సౌరభం గుబాళిస్తోంది.. ఎటుచూసినా క్రీడల పండుగ వాతావరణం కనిపిస్తోంది. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం వేదికగా 60వ నేషనల్‌ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు బుధవారం కన్నుల పండువగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. బుధవారం నుంచి ఆదివారం వరకు 47 ఈవెంట్లలో అథ్లెటిక్స్‌ పోటీలు జరగనున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 519 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 17 మంది క్రీడాకారులు పోటీ పడుతుండగా, వీరిలో వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన జె.దీప్తి కూడా ఉండటం విశేషం.  

కాగా, పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు మంగళవారం రాత్రికే నగరం చేరుకున్నారు. కొవిడ్‌ ఆంక్షల దృష్ట్యా క్రీడల ఆర్గనైజింగ్‌ కమిటీ భోజన, వసతి ఏర్పాట్లు చేయకపోవడంతో క్రీడాకారులు వివిధ హోటళ్లలో బస ఏర్పాటు చేసుకున్నారు. అయితే టెక్నికల్‌ అఫిషీయల్స్‌కు మాత్రం నిర్వాహకులే వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. పోటీలకు సన్నద్ధమయ్యేందుకు స్టేడియంలోని సింథటిక్‌ ట్రాక్‌పై నిర్విరామంగా సాధన చేస్తున్నారు. క్రీడాకారుల సందడితో పోటీలకు ముందే జేఎన్‌ స్టేడియం కొత్త కళను ఆపాదించుకుంది.

ఇదిలావుండగా ఈసారి పోటీల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. స్పాట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టంతోపాటు ఫుల్లీ ఆటోమెటిక్‌ ఫొటోఫినిష్‌ సిస్టంను ఉపయోగిస్తున్నారు. స్పాట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం ద్వారా రన్నింగ్‌ రేస్‌లో క్రీడాకారుడి టైమింగ్‌ను, ఫుల్లీ ఆటోమెటిక్‌ ఫొటో ఫినిష్‌ సిస్టమ్‌ ద్వారా పరుగుపందెంలో క్రీడాకారుల ప్రతిభను ఖచ్చితంగా రికార్డు చేయవచ్చని క్రీడా నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణ క్రీడాకారులు వీరే..

ఈ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర నుంచి మొత్తం 17 మంది క్రీడాకారులు వివిధ అంశాల్లో పోటీ పడుతున్నారు. వరంగల్‌ జిల్లా నుంచి జె.దీప్తి, రంగారెడ్డి జిల్లా నుంచి చేతన్‌సింగ్‌, రిషబ్‌మిశ్రా, ఎం.అరుణ్‌కుమార్‌, నరేష్‌, నల్గొండ జిల్లా నుంచి శ్రీవైభవ్‌రెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లా నుంచి డి.భాగ్యలక్ష్మి, పెద్దపల్లి జిల్లా నుంచి కె.అభిషేకర్‌, ఖమ్మం జిల్లా నుంచి ఎ.మైథిలి, సీహెచ్‌.నవీన్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వి.వంశీకృష్ణ, నల్గొండ జిల్లా నుంచి ఎన్‌.మాయావతి, హైదరాబాద్‌ జిల్లా నుంచి ఎ.నందిని, జి.నిత్య,  అంకిత్‌సైనీ (ఆర్మీ), గౌతంశెట్టి, నారాయణపేట జిల్లా నుంచి హారికాదేవి పోటీల్లో పాల్గొననున్నారు.  

ప్రారంభించనున్న మంత్రులు
జాతీయస్థాయి ఓపెన్‌ టూ ఆల్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్ పోటీలను స్పోర్ట్స్‌ అండ్‌ యూత్‌ సర్వీసెస్‌ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం సాయంత్రం 6 గంటలకు స్టేడియం ఆవరణలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. వీరితోపాటు ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, మేయర్‌ గుండు సుధారాణి, ఎంపీలు బండా ప్రకాశ్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతారావుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.

ఏర్పాట్ల పరిశీలించిన వినయ్‌
అథ్లెటిక్స్‌ పోటీల ఏర్పాట్లను ప్రత్యేక కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ప్రెసిడెంట్‌ హనుమకొండ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ.. జాతీయస్థాయి క్రీడా పోటీలను పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. కొన్నిరోజులుగా అసోసియేషన్‌ సభ్యులు, జిల్లా యంత్రాంగం అహర్నిశలు శ్రమించి క్రీడా పోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.  ఐదు రోజులపాటు జరగనున్న ఈ పోటీలకు సంబంధించి 40మంది వలంటీర్లను నియమించామన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించడంతోపాటు డాక్టర్ల బృందం, ఫిజియోథెరపిస్టులు అందుబాటులో ఉంటారని తెలిపారు. క్రీడలను తిలకించేందుకు నగరంలోని ప్రజలు క్రీడా మైదానానికి తరలి రావాలని పిలుపునిచ్చారు.

వరంగల్‌ నగరానికి గర్వకారణం: నాగపురి రమేశ్‌, భారత అథ్లెటిక్స్‌ కోచ్‌
చారిత్రక ఓరుగల్లులో సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణం ఎంతో గర్వకారణం. క్రీడాకారులు సింథటిక్‌ ట్రాక్‌పై సాధన చేయడం వల్ల జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింథటిక్‌ ట్రాక్‌ ప్రారంభోత్సవం, జాతీయక్రీడల నిర్వహణ వల్ల వరంగల్‌ నగర కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అవుతాయి. హనుమకొండ వాసిగా ప్రతిష్ఠాత్మకమైన ఈ పోటీల నిర్వహణలో పాలుపంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ క్రీడలను ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి వీక్షించడం ద్వారా విజయవంతం చేయాలి.

పతకమే లక్ష్యంగా బరిలోకి..: జీవంజి దీప్తి, అథ్లెట్‌, వరంగల్‌ జిల్లా
జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నాను. హాం కాంగ్‌లో జరిగిన యూత్‌ ఏషియా క్రీడల్లో 200 మీటర్ల రన్నింగ్‌ రేస్‌లో కాంస్య పతకం, 200 మీటర్ల రిలే పోటీలో వెండి పతకం సాధించాను. భారత కోచ్‌ నాగపురి రమేశ్‌ వద్ద అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్నా. ప్రస్తుత పోటీల్లో 100 మీటర్లు, 200 మీటర్ల రన్నింగ్‌ రేస్‌లో పాల్గొంటున్నాను. తప్పకుండా పతకం సాధించగలననే నమ్మకం ఉంది. అథ్లెటిక్స్‌లో ప్రతిభ కనబరిచి ఒలంపిక్స్‌లో పాల్గొనడమే నా జీవితాశయం. మా స్వస్థలం వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామం. తొర్రూరులో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతున్నాను. నా తల్లిదండ్రులు జీవంజి యాదగిరి-ధనలక్ష్మి. మాది రైతు కూలీ కుటుంబం.





















Updated Date - 2021-09-15T05:21:02+05:30 IST