స్టేజి దిగివచ్చి దివ్యాంగులకు అవార్డుల ప్రదానం.. రాష్ట్రపతిపై విమర్శల వెల్లువ

ABN , First Publish Date - 2021-12-06T22:34:35+05:30 IST

దివ్యాంగుల సాధికారత అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్టేజి దిగి అవార్డులు అందించడం తీవ్ర విమర్శలకు కారణమైంది...

స్టేజి దిగివచ్చి దివ్యాంగులకు అవార్డుల ప్రదానం.. రాష్ట్రపతిపై విమర్శల వెల్లువ

న్యూఢిల్లీ: దివ్యాంగుల సాధికారత అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్టేజి దిగి అవార్డులు అందించడం తీవ్ర విమర్శలకు కారణమైంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల సాధికారత విభాగం (డీఈపీడబ్ల్యూడీ) ఈ నెల 3న ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దివ్యాంగుల సాధికారతకు కృషి చేసిన వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ఆయా రాష్ట్రాలకు అవార్డులు ప్రదానం చేశారు.


రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. కొందరిని స్టేజిపైకి ఆహ్వానించి అవార్డులు అందించారు. అయితే, వీల్‌చైర్‌లో వచ్చినవారు స్టేజిపైకి రావడం ఇబ్బంది అని భావించిన రాష్ట్రపతి స్టేజి దిగి ఆయనే స్వయంగా వారి వద్దకెళ్లి అవార్డులు బహూకరించారు. అయితే, రాష్ట్రపతి ఇలా స్టేజి దిగి రావడం దివ్యాంగులను అవమానించడమే అవుతుందన్న విమర్శలు వెల్లువెత్తాయి.


బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ అవార్డు అందుకున్న పారా స్విమ్మర్ మహమ్మద్ షామ్స్ ఆలం షేక్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి వద్దకు వెళ్లి అవార్డులు అందుకునేందుకు తాము ముందుగానే పలుమార్లు డ్రెస్ రిహార్సల్స్ చేశామని గుర్తు చేసుకున్నారు. ఇందుకోసం హైడ్రాలిక్ లిఫ్ట్ కూడా ఉపయోగించినట్టు పేర్కొన్నాడు. కానీ, ఇప్పుడు తమ రిహార్సల్స్‌కు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఇందుకు తాను మంత్రిత్వ శాఖను తప్పుబట్టడం లేదని అన్నాడు. ఇలాంటి చర్యలతో తమను మరోమారు దివ్యాంగులను చేయవద్దని కోరారు.  


2003లో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నుంచి అవార్డు అందుకున్న హక్కుల కార్యకర్త, చక్రాల కుర్చీని ఉపయోగించే అంజలీ అగర్వాల్ అప్పటి తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. వీల్‌‌చైర్‌లో వచ్చిన అవార్డు విజేతలకు రాష్ట్రపతి స్వయంగా వారివద్దకు వచ్చి అవార్డు అందిస్తారని ప్రకటించారని, కానీ దానిని తాను తీవ్రంగా వ్యతిరేకించినట్టు చెప్పారు.


ఇద్దరు బాడీగార్డుల సాయంతో తాను వీల్‌చైర్‌తో స్టేజిపైకి వెళ్లి అవార్డు అందుకున్నట్టు చెప్పారు నిబంధనలు ఉల్లంఘించిన తనకు ఆ రోజు స్టాండింగ్ ఒవేషన్ లభించిందని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికైనా ఆలోచనలు మారాల్సిన అవసరం ఉందన్నారు. ఫిజీషియన్, యాక్టివిస్ట్ అయిన డాక్టర్ సతేంద్ర సింగ్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు.


అయితే, అవార్డు గ్రహీతలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే వారి దగ్గరికి వెళ్లి అవార్డు అందజేయాలని రాష్ట్రపతి నిర్ణయించుకున్నారని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికితోడు స్టేజి వద్ద ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ లిఫ్ట్‌లో కొన్ని సమస్యలు కూడా వచ్చాయని పేర్కొంది. 

Updated Date - 2021-12-06T22:34:35+05:30 IST