జనరల్ రావత్ వంటివారి వల్ల జాతీయ పతాకం రివ్వు రివ్వున ఎగురుతుంది : రాష్ట్రపతి

ABN , First Publish Date - 2021-12-11T17:33:54+05:30 IST

దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్

జనరల్ రావత్ వంటివారి వల్ల జాతీయ పతాకం రివ్వు రివ్వున ఎగురుతుంది : రాష్ట్రపతి

న్యూఢిల్లీ : దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ వంటి ధైర్యసాహసాలుగలవారు జాతీయ పతాకం గౌరవాన్ని కాపాడుతూ, పరిరక్షిస్తూ ఉంటారని, ఫలితంగా జాతీయ పతాకం సమున్నతంగా ఎల్లప్పుడూ ఎగురుతుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) కేడెట్ల పాసింగ్ ఔట్ పెరేడ్‌ను ఉద్దేశించి శనివారం కోవింద్ మాట్లాడారు. 


కేడెట్ల పాసింగ్ ఔట్ పెరేడ్‌ను సమీక్షించిన అనంతరం రామ్‌నాథ్ కోవింద్ మాట్లాడుతూ, ఐఎంఏలో శిక్షణ పొందిన దివంగత సీడీఎస్ జనరల్ రావత్ వంటివారు జాతీయ పతాకం గౌరవాన్ని కాపాడుతూ, పరిరక్షిస్తారని, అందువల్ల జాతీయ పతాకం ఎల్లప్పుడూ సమున్నతంగా ఎగురుతుందని చెప్పారు. 


ఐఎంఏలో శిక్షణ పూర్తి చేసుకున్న కేడెట్లను కోవింద్ అభినందించారు. యువ నేతలు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ పొందారని, క్రమశిక్షణను జీర్ణించుకున్నారని చెప్తూ ఇన్‌స్ట్రక్టర్లను, కేడెట్లను అభినందించారు. 387 మంది కేడెట్లు త్వరలో ధైర్యసాహసాలతో కూడిన ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మిత్ర దేశాలైన ఆఫ్ఘనిస్థాన్, భూటాన్, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, శ్రీలంక, తజకిస్థాన్, టాంజానియా, తుర్క్‌మెనిస్థాన్, వియత్నాం దేశాలకు చెందిన కేడెట్లు కూడా శిక్షణ పొందడం భారత దేశానికి గర్వకారణమని చెప్పారు. 


ఐఎంఏలోని చెట్వోడే బిల్డింగ్ డ్రిల్ స్క్వేర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ పాల్గొన్నారు. 



Updated Date - 2021-12-11T17:33:54+05:30 IST