తిరుగు ప్రయాణికులతో కిక్కిరిసిన జాతీయ రహదారి

ABN , First Publish Date - 2022-01-17T06:11:36+05:30 IST

సంక్రాంతి పండగకు హైదరాబాద్‌ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లిన వారు ఆదివారం హైదరాబాద్‌కు తిరుగు పయనమవడంతో జాతీయ రహదారులు కిక్కిరిశాయి.

తిరుగు ప్రయాణికులతో కిక్కిరిసిన జాతీయ రహదారి
యాదాద్రి జిల్లా పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ

4లక్షల వాహనాల రాకపోకలు

హైదరాబాద్‌కు తిరుగు పయనమైన ప్రజలు 


చౌటుప్పల్‌ రూరల్‌/ కేతేపల్లి జనవరి 16: సంక్రాంతి పండగకు హైదరాబాద్‌ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లిన వారు ఆదివారం హైదరాబాద్‌కు తిరుగు పయనమవడంతో జాతీయ రహదారులు కిక్కిరిశాయి. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రభుత్వం విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో నగరం నుంచి ప్రజలు సొంత గ్రామాలకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన సంక్రాంతి రద్దీ 15వ తేదీ వరకు కొనసాగింది. తిరుగు ప్రయాణం రద్దీ ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమైంది. ఈ నెల 30వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినా, సొమవారం నుంచి కార్యాలయాలు పనిచేస్తుండటంతో ప్రజలు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేటు వద్ద 16 గేట్లు ఉండగా, హైదరాబాద్‌ వెళ్లే వాహనాలకు 9 గేట్లు కేటాయించారు. దీంతో సుమారు ఒక్క ఆదివారం 35వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించినట్టు సమాచారం. ఈనెల 8వ తేదీ నుంచి 16 వరకు తొమ్మిది రోజుల్లో సుమారు 4లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించినట్టు సమాచారం. సగటున నిత్యం 45వేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగించాయి. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద ఏడు కౌంటర్లుకు హైదరాబాద్‌కు వైపునకు వెళ్లే వాహనాలకు ఐదు కౌంటర్లు కేటాయించారు. సాధారణ రోజుల్లో ఈ రహదారి మీదుగా సగటున రోజుకు 21వేల పైచిలుకు వాహనాలు ప్రయాణిస్తుండగా, పండగ నేపథ్యంలో ఈ నెల 8నుంచి 13వ తేదీ వరకు సగటున రోజుకు 35వేల చొప్పున ఆరు రోజుల పాటు 1.80లక్షల వాహనాలు ఈ రహదారి మీదుగా ప్రయాణించాయి.

Updated Date - 2022-01-17T06:11:36+05:30 IST