అద్దెకు జాతీయ వనరులు!

ABN , First Publish Date - 2021-09-07T06:05:39+05:30 IST

జాతి సంపద కొందరి గుప్పిట్లో ఇరుక్కుపోకుండా పాలన సాగించాలని, వనరులపై గుత్తాధిపత్యం ఉండకూడదని మన సంవిధానం చాలా స్పష్టంగా ఆదేశిక సూత్రాల్లో వివరించింది....

అద్దెకు జాతీయ వనరులు!

జాతి సంపద కొందరి గుప్పిట్లో ఇరుక్కుపోకుండా పాలన సాగించాలని, వనరులపై గుత్తాధిపత్యం ఉండకూడదని మన సంవిధానం చాలా స్పష్టంగా ఆదేశిక సూత్రాల్లో వివరించింది. ఈ సూత్రాలు కోర్టుల్లో అమలు చేయడానికి వీలుకాదని అధికరణ 37 చెప్పినప్పటికీ, పాలనా విధానాల రూపకల్పనలో అవి విధిగా పాటించవలసిన మౌలిక సూత్రాలని కూడా స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కులవలె కోర్టుల్లో సవాలు చేయడానికి వీల్లేదు కనుక ఆదేశిక సూత్రాలు పాటించనవసరం లేదన్నట్టు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఎన్‌డిఎ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి ఆదేశిక సూత్రాలకు పూర్తి భిన్నంగా, రాజ్యాంగంతో మాకేమిటి అనే ధోరణిలో జాతీయ సంపదను, వనరులను ప్రభుత్వేతర ప్రయివేటు సంపన్న వాణిజ్యవేత్తలు కొందరికి మాత్రమే కట్టబెట్టడం దారుణం. సంవిధాన విలువలను విస్మరించి, సమపాలనా విధానాన్ని తొక్కిపెట్టి, కొందరిని మాత్రమే సంపన్నులను చేస్తూ వందల కోట్ల జనం మీద లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపే దుష్పరిపాలనకు ‘నేషనల్ మానిటైజేషన్’ ఒక తాజా ఉదాహరణ.


రైల్వే, పవర్ గ్రిడ్, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి కేంద్రాలు, విమానాశ్రయాలు, రేవులు... ఇవన్నీ మన జాతి సంపద. దేశం సొమ్ము. తమను నమ్ముకున్న జనానికి ప్రభుత్వం ఇచ్చే కొత్త సందేశం - ‘మీ సొమ్ము’ (వనరులు) అమ్మేస్తాం లేదా అద్దెకిస్తాం’ అని. వంద లక్షల కోట్ల రూపాయల కొత్త మౌలిక వనరులు సృష్టించడానికిగాను ఆరులక్షల కోట్ల రూపాయలను సేకరించాలని, అందుకోసం నాలుగేళ్లపాటు జాతీయ మౌలిక వనరులు అద్దెకు ఇవ్వడం ఒక్కటే మార్గమని నీతి ఆయోగ్ అభిప్రాయం. రోడ్లు, విద్యుచ్ఛక్తి, విమానాశ్రయాలు, ఓడరేవులు, టెలికాం, ఆప్టికల్ ఫైబర్, రైలు పట్టాలు, రైల్వే స్టేషన్లు; స్పోర్ట్స్ ఆడిటోరియంలు, పెట్రోలియం సరఫరా సంస్థలు వంటి 15 రంగాలను కేంద్రం అద్దెకు ఇవ్వడానికి గుర్తించింది. కేంద్రం కొంత సంపదను అద్దెకిస్తూ, మిగిలినవి రాష్ట్రాలు ఇదే రీతిలో అద్దెకు ఇచ్చేందుకు ప్రోత్సహిస్తోంది. అందుకుగాను రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను ఇస్తుందట. మరిన్ని మౌలిక వనరులు కల్పించడానికే అద్దెకి ఇచ్చేందుకు సిద్ధపడ్డామని ప్రభుత్వం ప్రకటించింది. 


దీని పేరు నగదీకరణ. అమ్మడం కాదు. కాని అమ్మివేయనందుకు సంతోషపడేదేమీ లేదు. వ్యక్తిగత వ్యాపారులకో సంస్థలకో ఆ మౌలిక వనరుల పైన నిర్వహణ ఆధిపత్యం ఇవ్వడంపైన భయాందోళనలు ఉన్నాయి. ప్రయివేటైజేషన్ అంటే పూర్తిగా అమ్ముకోవడం. పెట్టుబడులు ఉపసంహరించడం. సంస్థపైన పూర్తి ఆధిపత్యం వదులుకోవడం. కాని మానిటైజేషన్‌లో అమ్మివేయడం ఉండదు. ఉదాహరణకు రహదారుల నగదీకరణ అంటే, ఆ రహదారిపై వచ్చివెళ్లే వారినుంచి ఫీజులు, పన్నులు సేవల ఖరీదులు వసూలు చేయడం. ఇది టోల్ పన్ను మాదిరిగానే ఉంటుంది. రోడ్డు నిర్మించిన కాంట్రాక్టరు ఖర్చుచేసిన డబ్బుతోపాటు లాభం వచ్చేవరకు కొంతకాలం పాటు టోల్ వసూలు చేసుకుంటారు. కాని ఇక్కడ ముందే వేలం పాడినట్టు పాడి ఆ రహదారి భాగం మీద సర్వహక్కులు ఆ కాంట్రాక్టరు చేతిలో పెడతారు. టోల్ ఎంత వేయాలో, వినియోగదారుల నుంచి ఎంత డబ్బు వసూలు చేయాలో అతని ఇష్టమే. వీరిపైన అదుపు చేసే వారెవరైనా ఉంటారా? టోల్ వసూళ్లు కాంట్రాక్టర్ పెట్టుబడులు కొంత లాభంతో సమకూరిన తరువాత ఆగుతాయి. కాని అద్దెకు తీసుకున్నవాడు కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం 20 ఏళ్లో 30 ఏళ్లో వసూళ్లు కొనసాగిస్తాడు. 


నిజానికి ఈ పని ప్రభుత్వం ఇదివరకే మొదలు పెట్టింది. ‘Infrastructure investment trust’ (InvIT) అనే ఒక మౌలికవనరుల పెట్టుబడుల ట్రస్టును ఏర్పాటు చేసి పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లోని విద్యుత్ సరఫరా లైన్లు, నెట్‌వర్క్‌లను వాడుకుని నగదును సంపాదించే ప్రయత్నం చేసింది. అదే విధంగా జాతీయ రహదారులు, గ్యాస్ పైపు లైన్లు, రైల్వేట్రాక్‌ల విషయంలో కూడా చేద్దామని ఆలోచిస్తున్నారు. ఈ వనరులతో పాటు భూమాతను కూడా ‘టైటిలింగ్ ఆఫ్ ల్యాండ్’ను కూడా మానిటైజేషన్ చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం ప్రతిపాదనలను కొనసాగిస్తూనే అదనంగా ఈ సంవత్సరం అద్దెకి ఇవ్వడం (ఎన్‌ఎంపి) ద్వారా రూ.88 వేల కోట్లు సంపాదించాలని నిర్ణయం. బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా లక్షా 75 వేల కోట్ల రూపాయల కోసం ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించడం కూడా ఆగదనీ ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఆరులక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ‘అద్దెకిస్తా పథకం’ ద్వారా నాలుగేళ్లలో సాధిస్తామంటున్నారు. మొత్తం 111 లక్షల కోట్లతో కొత్త వనరులు కల్పించి, దేశాన్ని ఆర్థిక అగ్రరాజ్యంగా నిలబెడతామని బంగారు కలలు చూపిస్తున్నారు. నిజంగానే నాలుగేళ్లలో ఇంత డబ్బు వస్తుందా?


ఇంత పెట్టుబడి పెట్టిన వాడు ఆ డబ్బు మళ్లీ జనం నుంచి గోళ్లూడగొట్టి వసూలు చేసుకోడా? రెట్టింపు లాభం తీసుకోడా? అంటే నాలుగేళ్లలో ఎన్‌డిఎ ప్రభుత్వం మన జనం నెత్తిన 12 లక్షల కోట్ల రూపాయల అదనపు ధరల భారం మోపబోతున్నదన్నమాట. ఏళ్లతరబడి ప్రభుత్వ ఆస్తులను ప్రయివేటు సంస్థలకు కట్టబెడితే రోడ్లమీద, రేవుల్లో, ఎయిర్ పోర్టుల్లో, పవర్ గ్రిడ్‌లో గ్యాస్ పైపుల విషయంలో పెరిగే ధరలకు సామాన్యులు బలికావలసిందేనా? ఇదీ సమస్య. పనీ పాటూ లేకుండా, అనుభవం లేకుండా, ముందు కాంట్రాక్టులు సాధించి, తరువాత బాంకులనుంచి అప్పులు తెచ్చుకుని, లాభాలకోసం జనాన్ని పెంచిన ధరలతో పీడించడమనే దారుణాలు ఈ అందమైన నగదీకరణ వెనుక ఉండే పచ్చినిజాలు. ఈ దారుణాలు ఆపడానికి, జనాన్ని ఆదుకోవడానికి ఏదైనా చట్టబద్ధమైన వ్యవస్థను తయారుచేసారా అంటే అదీ లేదు. చట్టం లేదు, విధానం లేదు, ప్రజా ప్రయోజనాలను రక్షించే నియమాలు లేవు. అంతే కాదు, ప్రభుత్వ వనరులపైన ఆరు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడమంటే అంత డబ్బు ప్రయివేట్ రంగంలో పెట్టుబడులు తగ్గినట్టే కదా? 


రహదారి, రైల్వే, విమాన, నౌకా, విద్యుచ్ఛక్తి వనరులన్నీ ప్రభుత్వ సేవా సంస్థలు. ఈ సేవలు సరిగ్గా నిర్వహించడమే పాలన. జనాన్ని ప్రయివేటు వ్యక్తుల అధీనంలోకి పంపడమంటే ఇవి పాలననుంచి జారిపోవడం అని అర్థం. ఇదా ప్రభుత్వం అంటే? రహదారులు (రోడ్లు) మనదేశంలో లక్షా 32 వేల కిలోమీటర్ల పొడవున్నాయి. 640 కిమీ రోడ్లు నాలుగు లేన్లవైతే, 620 కిమీ రోడ్లు ఆరు లేన్ లవి. వీటి నిర్వహణను ఏ విధంగా ఇస్తారు? వీటిలో ఏ రోడ్లు, ఎంత మేరకు ఇస్తారు? ఎంతకివ్వాలి? 60వేల మెగావాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేసే వనరులు కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలో ఉన్నాయి. 137 విమానాశ్రయాలు ఉన్నాయి. 12 పెద్ద ఓడరేవులు ఉన్నాయి. 69 వేల టెలి టవర్లు ఉన్నాయి. 5.2 లక్షల కిలోమీటర్ ఆప్టిక్ ఫైబర్ ఉంది. 7300 రైల్వే స్టేషన్లున్నాయి. వీటిని ఏవిధంగా అద్దెకిస్తారు. వీటి నిర్వహణపై అధికారాలను, అదుపును ఏవిధంగా ఇవ్వాలో వివరాలు ఇంకా రూపొందించవలసి ఉంది. ఉదాహరణకు రైల్వే స్టేషన్లలో 350 మాత్రమే ఆదాయాన్నిచ్చేవి. రాబోయే 30 ఏళ్లలో ఈ స్టేషన్లనుంచి 78వేల కోట్లరూపాయల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. లాభాలు రాని, నష్టాలు మాత్రమే వచ్చే రైల్వే స్టేషన్లు రైల్వే విభాగానికి మిగిల్చి, లాభాలు పండించే స్టేషన్లను ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తే అసమానతలు పెరిగిపోవా? కొన్నిస్టేషన్లో సేవలకు అధిక ధరలు, ఇతర స్టేషన్లలో తక్కువ ధరలు ఉండవచ్చా. కొన్ని స్టేషన్ లలో ప్లాట్ ఫాం టిక్కెట్‌తో మొదలై ప్రయాణికుల టిక్కెట్ల ఛార్జీలు విపరీతంగా పెంచుకోవచ్చా? 


అమ్మేద్దామా అద్దెకిద్దామా అనే తాజా బృహత్ప్రణాళికలో అనేక అనుమానాలు భయాలు తలెత్తుతున్నాయి. మొదటి భయం – ధరలు విపరీతంగా పెరగడం, జనం సంక్షేమం తరగడం; రెండో భయం – అస్మదీయులకోసం జాతి సంపదను తక్కువ వెలకడతారని తద్వారా క్విడ్ ప్రోకోలు కోకొల్లలుగా ఉంటాయేమోనని. మరో భయం – ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకత లోపం వల్ల జాతిని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసే అతి గొప్ప స్కామ్ కాకుండా కాపాడగలరా అని. 


కొవిడ్ వచ్చినపుడు విమానయాన వ్యవహారాల్లో ప్రభుత్వం వైద్య పరీక్షలు రోగనిర్ధారణ చేసుకోవాలనే నిబంధనలు, ప్రయాణాలపై పరిమితులు, ఆంక్షలు, ఆరోగ్య రక్షణ కోసం అనేక షరతులు విధించారు. లాభాలకు ఆశపడే ప్రయివేటు వారికి జనం శ్రేయస్సు వంటపడ్తుందా?


డిమానిటైజేషన్ వలే మానిటైజేషన్ గురించి ఎన్నికల మానిఫెస్టోలో బిజెపి, ఎన్‌డిఎ భాగస్వాములు చెప్పలేదు. కనీసం పార్లమెంటులో కూడా ఈ సరికొత్త ఆశ్చర్యకర విధానాన్ని చర్చించలేదు. నీతీ ఆయోగ్ సమర్థింపు తప్ప వేరే ఎవరినీ సంప్రదించలేదు. ఈ గొప్ప ఐడియా ఎక్కడినుంచి వచ్చిందో చెప్పలేదు. అధికారపార్టీల ఎంపీలతో సహా చాలామందికి అసలు తెలియదు. ప్రతిపక్షాలు, మీడియా, పౌరసమాజం ప్రశ్నించాల్సిన పాలసీ. ఇది రాజ్యాంగవ్యతిరేకం అనడానికి ఇవి కారణాలు: 


మౌలిక వనరులను కొన్ని కంపెనీలు, కొందరు వ్యక్తులకు మాత్రమే అద్దెకిస్తే, జాతి సంపద కొందరి గుప్పిట్లోకి వెళ్తుంది. పారదర్శకత లేకపోతే చాటుమాటున అస్మదీయులకు వనరులను కట్టబెట్టే అవకాశాలు ఉంటాయి. 


ఆ విధంగా అద్దెకిచ్చిన చోట ప్రయివేటు వర్తకులు జన హితాన్ని పట్టించుకునే అవకాశాలు తక్కువ కనుక లాభాలకోసం వారు సామాన్యవినియోగదారుల మీద విపరీతంగా ఛార్జీలు వసూలు చేస్తారు. మిగతా చోట్ల ఇదివరకటి ధరలే కొనసాగవచ్చు. మొత్తం వనరులను అనేక వర్తకులకు కట్టబెడితే వారంతా వారికి తోచిన విధంగా చార్జీలు నిర్ణయిస్తే అసమానతలు విపరీతంగా పెరుగుతాయి.


అద్దె నిర్ణయించడానికిగాను వనరుల విలువ నిర్ధారణ చేయడంలో నిష్పాక్షిక, పారదర్శక విధానాన్ని అనుసరించకపోతే జాతి తీవ్రంగా ఆర్థిక నష్టాలకు గురవుతుంది. ఆమేరకు ప్రయివేటు వ్యక్తులకు లాభం జరుగుతుంది.


వేలంలో ఎక్కువ ధర పలికిందని, విచక్షణారహితంగా వనరులను ధార పోస్తే జాతీయ భద్రత సమస్యలు రావచ్చు.

మాడభూషి శ్రీధర్ 

డీన్ (లా), మహీంద్ర యూనివర్సిటీ,

మాజీ కేంద్ర సమాచార కమిషనర్ 

Updated Date - 2021-09-07T06:05:39+05:30 IST