ఆ 8 దేశాల పౌరులపై Kuwaitలో ప్రవేశానికి నిషేధం.. ఆ దేశంలో వారు కాలు పెట్టాలంటే అనుమతి తప్పనిసరి!

ABN , First Publish Date - 2021-11-14T15:10:54+05:30 IST

లెబనాన్ పౌరులకు అన్ని వీసాల జారీని నిలిపివేస్తూ ఇటీవల కువైత్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఆ 8 దేశాల పౌరులపై Kuwaitలో ప్రవేశానికి నిషేధం.. ఆ దేశంలో వారు కాలు పెట్టాలంటే అనుమతి తప్పనిసరి!

కువైత్ సిటీ: లెబనాన్ పౌరులకు అన్ని వీసాల జారీని నిలిపివేస్తూ ఇటీవల కువైత్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ బుధవారం కీలక ప్రకటన చేసింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతోందని స్పష్టం చేసింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) దేశాలు, లెబనాన్ మధ్య కొనసాగుతున్న దౌత్యపర విబేధాల నేపథ్యంలో కువైత్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో లెబనాస్ పౌరులు ప్రస్తుతం కువైత్‌లో కాలు పెట్టలేరు. ఇది ఎంతవరకు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. 


ఇదిలాఉంటే.. ఇప్పుడు ఇదే నియమాన్ని మరో ఎనిమిది దేశాలకు విధించింది కువైత్. ఆయా దేశాల పౌరులు సెక్యూరిటీ అప్రూవల్స్ లేకుండా కువైత్‌లో కాలు పెట్టడానికి వీల్లేదు. లెబనాన్, సిరియా, ఇరాక్, పాకిస్థాన్, ఇరాన్, అఫ్గానిస్థాన్, యెమెన్ ఈ జాబితాలో ఉన్నాయి. అయితే, చెల్లుబాటయ్యే రెసిడెన్సీ వీసాలు కలిగిన ఆయా దేశాల పౌరులకు ఈ నిర్ణయం వల్ల ఎలాంటి ఆటంకం ఉండబోదని సంబంధిత అధికారులు వెల్లడించారు. రెసిడెన్సీ వీసాదారులు ఎప్పుడైనా కువైత్ రావొచ్చని స్పష్టం చేశారు. కొత్తగా వీసాలు పొందినవారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. ఫ్యామిలీ, టూరిస్ట్, కమర్షియల్ లేదా గవర్నమెంటల్ వీసాదారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు.


మరోవైపు రెసిడెన్సీతో పాటు వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడిన వలసదారులపై కువైత్ కొరడా ఝళిపిస్తోంది. చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్నవారిని గుర్తించి వెళ్లగొడుతోంది. కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం ఆ దేశంలో సుమారు 1.60లక్షల మంది ప్రవాసులు ఇలా చట్ట విరుద్ధంగా నివాసం ఉంటున్నట్లు తేలింది. నాలుగు సార్లు క్షమాభిక్ష కార్యక్రమాన్ని చేపట్టినా.. ఉల్లంఘనదారులు వాటిని సద్వినియోగం చేసుకోలేదని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికీ వారికి ఒక అవకాశం ఉందని, తమంతటా తాముగా ముందుకు వచ్చి జరిమానా చెల్లించి దేశం నుంచి వెళ్లిపోవచ్చని తెలిపారు. ఒకవేళ భద్రతాధికారులు వారిని గుర్తించడం జరిగితే మాత్రమే జీవితకాలంలో తిరిగి కువైత్‌లో అడుగుపెట్టలేరని హెచ్చరించారు. అలాగే మిగతా జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల్లో కూడా వారిపై ఐదేళ్ల నిషేధం ఉంటుందన్నారు.    

 

Updated Date - 2021-11-14T15:10:54+05:30 IST