నేడు దేశవ్యాప్త సమ్మె

ABN , First Publish Date - 2020-11-26T07:34:39+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక యూనియన్లు సమ్మె చేపట్టనున్నాయి. ఈ సమ్మెలో 25 కోట్లకు పైగా కార్మికులు పాల్గొననున్నట్టు పది కేంద్ర కార్మిక

నేడు దేశవ్యాప్త సమ్మె

కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా నిర్వహణ

25 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారంటున్న కార్మిక యూనియన్లు

బ్యాంకింగ్‌ సేవలపైనా ప్రభావం.. సమ్మెకు టీఆర్‌ఎస్‌ మద్దతు  


న్యూఢిల్లీ, నవంబరు 25: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక విధానాలకు వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక యూనియన్లు సమ్మె చేపట్టనున్నాయి. ఈ సమ్మెలో 25 కోట్లకు పైగా కార్మికులు పాల్గొననున్నట్టు పది కేంద్ర కార్మిక యూనియన్లతో కూడిన ఐక్యవేదిక బుధవారం ప్రకటించింది.  బీజేపీకి అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) తప్ప మిగతా కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి సమ్మెకు మద్దతు ప్రకటించింది. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ, కార్మిక చట్టాలు తదితరాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడమే కాకుండా పలు డిమాండ్లు చేస్తూ ఈ సమ్మెను చేపడుతున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్కీమ్‌ వర్కర్లు, గృహ, నిర్మాణ, బీడీ  కార్మికులు, హాకర్లు, వెండార్లు, వ్యవసాయ కార్మికులు, స్వయం ఉపాధి పొందిన వారు రాస్తా రోకో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. చాలా రాష్ట్రాల్లో ఆటో, టాక్సీ డ్రైవర్లు కూడా రోడ్డుపైకి వాహనాలు తీసుకురావొద్దని నిర్ణయించారు. సమ్మెతో బ్యాంకింగ్‌ సేవలకు కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. సమ్మెలో అఖిల భారత బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌, అఖిల భారత బ్యాంకు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌, బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పాల్గొనున్నాయి. 


టీఆర్‌ఎస్‌ మద్దతు

బీజేపీకి ఓటు వేస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పటాన్‌చెరు పరిధిలోని బీహెచ్‌ఈఎల్‌, బీడీఎల్‌, ఓడీఎఫ్‌ సంస్థలకు చెందిన ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కాపాడుకునేందుకు ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతామని తెలిపారు. 26న జరిగే సార్వత్రిక సమ్మెకు టీఆర్‌ఎస్‌ మద్దతిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కాగా సమ్మెకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఉంటుందని మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ తెలిపారు. బీఎ్‌సఎన్‌ఎల్‌ ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకుంటున్న పార్టీ టీఆర్‌ఎస్‌ అని, ఈ అంశాన్ని సీఎం హోదాలో గట్టిగా ప్రస్తావించిందీ కేసీఆర్‌ ఒక్కరేనన్నారు. కార్మిక యూనియన్ల సమ్మెకు ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ), టీయూడబ్ల్యూజే, భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (యూసీసీఆర్‌ఐ-ఎంఎల్‌) మద్దతు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర పవర్‌ ఎంప్లాయీస్‌ సంయుక్త కార్యాచరణ కమిటీ కూడా మద్దతు ప్రకటించింది. సార్వత్రిక సమ్మెకు మద్దతిస్తున్నట్టు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తెలిపింది. కాగా తెలంగాణలోని 3,500 గ్రామాల్లో గురువారం బంద్‌, నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి రైతు, కూలీ, చేతి వృత్తులు, మహిళ, సామాజిక, విద్యార్థి, యువజన, గిరిజన తదితర ప్రజాసంఘాలు కార్యాచరణ రూపొందించాయి. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ  పిలుపుమేరకు ఈ బంద్‌ నిర్వహిస్తున్నారు. 


ఇవీ డిమాండ్లు..

  • రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక కోడ్‌లను ఉపసంహరించుకోవాలి. 
  • ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలి 
  • అందరికీ పెన్షన్‌, ఎన్‌పీఎస్‌ రద్దు, పాత పెన్షన్‌ పథకం పునరుద్ధరణ చేపట్టాలి 
  • ఆదాయ పన్ను చెల్లించని కుటుంబాలకు నెలకు 7,500 నగదు బదిలీ చేయాలి 
  • నిరుపేదలకు నెలకు ఒక్కొక్కరికి 10 కిలోల ఉచిత రేషన్‌ ఇవ్వాలి 
  • గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏడాదిలో 200 రోజులకు పెంచాలి

Updated Date - 2020-11-26T07:34:39+05:30 IST