నట్టూ.. భళా!

ABN , First Publish Date - 2021-01-16T07:09:03+05:30 IST

గాయాల బెడదతో సీనియర్‌ బౌలర్లు అందుబాటులో లేని పరిస్థితి.. బరిలోకి దిగిన మన బౌలర్లందరిదీ కలిపి ఈ మ్యాచ్‌కు ముందు నాలుగు టెస్ట్‌ల అనుభవం.. ఇంకా ఆట మొదలవగానే పేసర్‌ సైనీకి గాయం.. అలాంటి బౌలింగ్‌ దళం ఆతిథ్య జట్టుకు తిరుగులేని...

నట్టూ.. భళా!

  • భారత యువ బౌలర్ల జోరు
  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 274/5  
  • లబుషేన్‌ సెంచరీ 
  • చివరి టెస్ట్‌

గాయాల బెడదతో సీనియర్‌ బౌలర్లు అందుబాటులో లేని పరిస్థితి.. బరిలోకి దిగిన మన బౌలర్లందరిదీ కలిపి  ఈ మ్యాచ్‌కు ముందు నాలుగు  టెస్ట్‌ల అనుభవం.. ఇంకా ఆట మొదలవగానే పేసర్‌ సైనీకి గాయం.. అలాంటి బౌలింగ్‌ దళం ఆతిథ్య జట్టుకు తిరుగులేని గబ్బాలో వారిని ఏమాత్రం  ప్రతిఘటించగలదనే అనుమానాలు.. కానీ హైదరాబాద్‌ పేసర్‌ సిరాజ్‌ నేతృత్వంలోని భారత బౌలర్లు తొలిరోజు ఆసీస్‌కు కళ్లెం వేయగలిగారు. నెట్‌ బౌలర్‌గా వచ్చి అనూహ్యంగా పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కించుకొని సత్తా చాటిన ఎడమ చేతి మీడియం పేసర్‌ నటరాజన్‌ అంతే అనూహ్యంగా సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ అరంగేట్రం చేసి తన పాత్రకు సంపూర్ణ న్యాయం చేశాడు. ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ లబుషేన్‌, వేడ్‌ను అవుట్‌ చేసి కంగారూలకు షాకిచ్చాడు. అలాగే అరంగేట్ర స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌, సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ కూడా తలా చేయి వేసి ప్రత్యర్థి మొదటి రోజు ఆధిక్యం చూపకుండా నిలువరించారు.


బ్రిస్బేన్‌: ఇద్దరు అరంగేట్ర బౌలర్లు, కనీసం ఐదు టెస్ట్‌ల అనుభవం కూడాలేని మరో ముగ్గురు భారత బౌలర్లు భళా అనిపించారు. పోరాడి మూడో టెస్ట్‌ను డ్రా చేయడంతో లభించిన ఆత్మవిశ్వాసంతో విజృంభించారు. మధ్యలో కొంత పట్టు సడలినా వైవిధ్యమైన బౌలింగ్‌తో  శుక్రవారం ప్రారంభమైన నాలుగో టెస్ట్‌లో పటిష్ట ఆస్ట్రేలియా పైచేయి ప్రదర్శించకుండా అడ్డుకున్నారు. ఫలితంగా టాస్‌ గెలిచి  బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆట ఆఖరికి 5 వికెట్లకు 274 పరుగులు చేసింది.   లబుషేన్‌ (204 బంతుల్లో 9 ఫోర్లతో 108), మాథ్యూ వేడ్‌ (45) సత్తా చాటారు. స్మిత్‌ (36) పర్లేదనిపించాడు. నటరాజన్‌ (2/63) రెండు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్‌, శార్దూల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 


17/2: పకోస్కీ ఫిట్‌గా లేకపోవడంతో వార్నర్‌తో కలిసి మార్కస్‌ హారిస్‌  ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు.   ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ ఆఖరి బంతికి   రోహిత్‌ క్యాచ్‌ ద్వారా వార్నర్‌ (1)ను అవుట్‌ చేసిన సిరాజ్‌  ఆసీస్‌కు షాకిచ్చాడు. మొదటి స్లిప్‌లో రోహిత్‌ శర్మ కుడివైపునకు డైవ్‌ చేసి అద్భుతంగా ఈ క్యాచ్‌ అందుకున్నాడు. కొద్దిసేపటికే చక్కటి ఇన్‌స్వింగర్‌తో హారి్‌స (5)ను శార్దూల్‌ అవుట్‌ చేశాడు. దాంతో 17 పరుగులకు రెండు వికెట్లతో ఆసీస్‌ కష్టాల్లో పడింది. అయితే లబుషేన్‌, స్మిత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.  శార్దూల్‌ బౌలింగ్‌లో చూడముచ్చటైన ఆఫ్‌డ్రైవ్‌లతో స్మిత్‌ అలరించగా.. లబుషేన్‌ మందకొడిగా బ్యాటింగ్‌ చేశాడు. లంచ్‌కు ఆస్ట్రేలియా 65/2 స్కోరు చేసింది. భోజన విరామం తర్వాత స్మిత్‌ను భారత్‌ ఉచ్చులో బిగించింది. షార్ట్‌మిడ్‌ వికెట్‌లో రోహిత్‌ను మోహరించగా..స్మిత్‌ డ్రైవ్‌ చేసేలా లెగ్‌స్టంప్‌ మీదకు సుందర్‌ బంతి వేశాడు. దాన్ని ఆన్‌సైడ్‌లో ఫ్లిక్‌ చేసిన స్మిత్‌ మిడ్‌వికెట్‌లో రోహిత్‌కు దొరికి పోయాడు. దాంతో టెస్ట్‌ల్లో సుందర్‌కు తొలి వికెట్‌ లభించగా..ఆసీస్‌ మూడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 


సెంచరీ భాగస్వామ్యం: అనంతరం లబుషేన్‌, వేడ్‌ ఇన్నింగ్స్‌ సరిదిద్దే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన లబుషేన్‌ బ్యాట్‌ ఝళిపించాడు. ఈక్రమంలో 37 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద శార్దూల్‌ బౌలింగ్‌లో గల్లీలో రహానె క్యాచ్‌ వదలడంతో లబుషేన్‌ ఊపిరిపీల్చుకున్నాడు. అలాగే 48 పరుగుల వద్దా అతడికి మరో లైఫ్‌ లభించింది. అర్ధ శతకం తర్వాత ఫోర్లతో లబుషేన్‌ దూకుడు ప్రదర్శించగా..73 పరుగుల వద్ద పుజార వదిలిన క్యాచ్‌లో అతడికి మూడో లైఫ్‌ లభించింది. ఆసీస్‌ 154/3తో టీ విరామానికి వెళ్లింది. సిరాజ్‌ బౌలింగ్‌లో బౌండరీతో టెస్ట్‌ల్లో లబుషేన్‌ ఐదో సెంచరీ పూర్తి చేశాడు. 


నటరాజ్‌ విజృంభణ: లబుషేన్‌, వేడ్‌ జోడి ప్రమాదకరంగా పరిణమిస్తున్న తరుణంలో..బౌలింగ్‌కు వచ్చిన నటరాజన్‌ లెంగ్త్‌ బాల్‌తో శార్దూల్‌ ఠాకూర్‌ క్యాచ్‌తో వేడ్‌ను అవుట్‌ చేసి టెస్ట్‌ల్లో మొదటి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.   దాంతో 113 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కొద్దిసేపటికే లబుషేన్‌ను కూడా అవుట్‌ చేసిన నట్టూ ఆసీ్‌సను మళ్లీ దెబ్బకొట్టాడు. కానీ తర్వాత భారత బౌలర్లు పట్టుతప్పగా ధాటిగా ఆడిన పెయిన్‌ (38 బ్యాటింగ్‌), గ్రీన్‌ (28 బ్యాటింగ్‌) మరో వికెట్‌ పడకుండా తొలిరోజును ముగించారు. రెండోరోజు ఉదయం వీరిద్దరినీ త్వరగా పెవిలియన్‌కు చేర్చితేనే  మ్యాచ్‌పై భారత్‌ పట్టు బిగించ గలుగుతుంది.


4 మార్పులతో..

అశ్విన్‌, జడేజా, బుమ్రా విహారి స్థానాల్లో..శార్దూల్‌, మయాంక్‌ అగర్వాల్‌, నటరాజన్‌, సుందర్‌ భారత జట్టులోకి వచ్చారు. 





ఒక టూర్‌.. మూడు ఫార్మాట్లు!

రెండు కీలక వికెట్లతో మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పిన పేసర్‌ తంగరసు నటరాజన్‌ ఓ రికార్డు కూడా నెలకొల్పాడు. నెట్‌ బౌలర్‌గా ఆసీస్‌ పర్యటనకొచ్చిన నట్టూ..ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. డిసెంబరు 2న ఆస్ట్రేలియాతో వన్డేలో అంతర్జాతీయ కెరీర్‌కు శ్రీకారం చుట్టిన 29 ఏళ్ల నటరాజన్‌..ఆ మ్యాచ్‌లో 70 పరుగులకు రెండు వికెట్లు సాధించాడు. ఆ వన్డేలో భారత్‌ గెలుపొందడం విశేషం. అనంతరం టీమిండియా 2-1తో నెగ్గిన టీ20 సిరీ్‌సలోనూ ఆడిన నటరాజన్‌ మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లతో సత్తా చాటాడు. 


300

టెస్ట్‌ అరంగేట్రం చేసిన 300వ భారత క్రికెటర్‌ నటరాజన్‌


20

ఈ సిరీస్‌లో భారత్‌కు ఆడిన ఆటగాళ్ల సంఖ్య. అత్యధిక ఆటగాళ్లతో కలిసి భారత్‌ ఓ సిరీస్‌ ఆడటం 1961-62 సీజన్‌ తర్వాత ఇదే

తొలిసారి. 




సైనీకి గాయం

టీమిండియా గాయాల జాబితాలో మరో క్రికెటర్‌ చేరాడు. నాలుగో టెస్ట్‌ తొలిరోజు తన ఎనిమిదో ఓవర్‌ సందర్భంగా గజ్జల్లో నొప్పితో 28 ఏళ్ల నవ్‌దీప్‌ సైనీ మైదానం వీడాడు. ఆ ఓవర్‌ చివరి బంతిని రోహిత్‌ శర్మ వేశాడు. సైనీని స్కానింగ్‌ కోసం తరలించగా.. రిపోర్ట్‌ రావాల్సింది. అయితే ఈ టెస్ట్‌లో అతడు ఇక ఆడడం అనుమానమేనని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. సైనీ ప్రస్తుతం బోర్డు వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్టు బీసీసీఐ ప్రకటించింది. సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్‌తో అరంగేట్రం చేసిన నవ్‌దీప్‌ ఆ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు సాధించాడు. 




ఐదుగురు.. నాలుగు మ్యాచ్‌లు..

ఈ మ్యాచ్‌లో ఆడుతున్న ఐదుగురు భారత బౌలర్లు సిరాజ్‌, నవ్‌దీప్‌ సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ల టెస్ట్‌ అనుభవం అంతా కలిపి నాలుగు టెస్ట్‌లే. వీరిలో సిరాజ్‌ 2 టెస్ట్‌లు, శార్దూల్‌, సైనీ ఒక్కో టెస్ట్‌ మాత్రమే ఆడారు. నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఈ మ్యాచ్‌తోనే అరంగేట్రం చేశారు. 


స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) రోహిత్‌ (బి) సిరాజ్‌ 1, హారిస్‌ (సి) సుందర్‌ (బి) శార్దూల్‌ 5, లబుషేన్‌ (సి) పంత్‌ (బి) నటరాజన్‌ 108, స్మిత్‌ (సి) రోహిత్‌ (బి) సుందర్‌ 36, వేడ్‌ (సి) శార్దూల్‌ (బి) నటరాజన్‌ 45, గ్రీన్‌ (బ్యాటింగ్‌) 28, పెయిన్‌ (బ్యాటింగ్‌) 38, ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 87 ఓవర్లలో 5 వికెట్లకు 274; వికెట్లపతనం: 1/4, 2/17, 3/87, 4/200, 5/213; బౌలింగ్‌: మహ్మద్‌ సిరాజ్‌ 19-8-51-1, నటరాజన్‌ 20-2-63-2, శార్దూల్‌ ఠాకూర్‌ 18-5-67-1, నవ్‌దీప్‌ సైనీ 7.5-2-21-0, వాషింగ్టన్‌ సుందర్‌ 22-4-63-1, రోహిత్‌ శర్మ 0.1-0-1-0. 



Updated Date - 2021-01-16T07:09:03+05:30 IST