కరోనా వైరస్‌ విషయంలో తెలుగు వారిని అప్రమత్తం చేస్తున్న నాట్స్

ABN , First Publish Date - 2020-03-30T02:52:45+05:30 IST

అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌పై తెలుగు వారికి అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) నడుంబిగించింది. ఇప్ప

కరోనా వైరస్‌ విషయంలో తెలుగు వారిని అప్రమత్తం చేస్తున్న నాట్స్

ఫ్లోరిడా, మార్చ్ 28:  అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌పై తెలుగు వారికి అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) నడుంబిగించింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదు కావడంతో నాట్స్ అప్రమత్తమైంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై నాట్స్.. వైద్య నిపుణులచే వెబినార్ నిర్వహించింది. ఈ వెబినార్‌లో ప్రముఖ వైద్య నిపుణులు కె.వి. సుందరేశ్, డాక్టర్ మధు కొర్రపాటి పాల్గొని.. వైరస్ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా కరోనా పేషంట్లలో ప్రధానంగా తలెత్తుతున్న సమస్యలు ఏమిటి..? వైరస్ సోకితే ఎవరికి ప్రాణాపాయం? అనే విషయాలపై కూడా వైద్య నిపుణులు తమ అనుభవాలను పంచుకున్నారు. అలసత్వం వహిస్తే అమెరికాలో దాదాపు పది లక్షల మంది వైరస్ బారినపడే అవకాశముందని హెచ్చరించారు.


ముఖ్యంగా శ్వాసకోశ  సమస్యలు ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లినపుడు.. జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. వైరస్‌ను స్వయంగా మనమే ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కొవిడ్-19 బారిన పడ్డ ఓ తెలుగు వ్యక్తి కూడా ఈ వెబినార్ ద్వారా తన అనుభవాల్ని పంచుకున్నారు. కాగా.. దాదాపు 500 మంది తెలుగువారు ఈ వెబినార్ ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు. తమకున్న సందేహాలను వైద్య నిపుణులను అడిగి నివృత్తి చేసుకున్నారు.


కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. సామాజిక దూరం పాటిస్తూ నాట్స్ వెబినార్‌ను నిర్వహించింది. నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని,  సలహా కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ మల్లాది, డా. దుర్గారావు పరిమి, టెంపా నాట్స్ కో ఆర్డినేటర్ రాజేశ్ కాండ్రు, సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, సుబ్బా రావు యన్నమని , నాట్స్ గ్లోబల్ టీం నుంచి విష్ణు వీరపనేని తదితరులు ఈ వెబినార్ నిర్వహణకు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఈ సదస్సులో ప్రశాంత్ పిన్నమనేని వ్యాఖ్యాతగా వ్యవహారించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. వెబినార్‌కు సంబంధించిన మొత్తం వీడియో.. www.natsworld.org/webinars వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి  టాంప ఫ్లోరిడా చాప్టర్ చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.  


Updated Date - 2020-03-30T02:52:45+05:30 IST