నాలుగేళ్లుగా నత్తనడకే!

ABN , First Publish Date - 2021-02-27T04:50:52+05:30 IST

జిల్లాలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులు నాలుగేళ్లుగా నత్తనడకనే సాగుతున్నాయి. ఓ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా నిర్మాణం పనులు సాగుతున్నాయి. మొదటి నుంచి ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం.. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడంతో మరింత ఆలస్యమవుతోంది.

నాలుగేళ్లుగా నత్తనడకే!

జిల్లాలో పూర్తయినా కేటాయించని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు 

నేతల కనుసన్నల్లోనే అనధికార గృహప్రవేశాలు

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

రైతు వేదికలపై ఉన్న శ్రద్ధ పేదల ఇళ్లపై కరువు

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనులు నాలుగేళ్లుగా నత్తనడకనే సాగుతున్నాయి. ఓ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా నిర్మాణం పనులు సాగుతున్నాయి. మొదటి నుంచి ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం.. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగడంతో మరింత ఆలస్యమవుతోంది. జిల్లాలోని ఆదిలాబాద్‌ నియో జక వర్గంలో 2228, బోథ్‌ నియోజకవర్గంలో 976, ఖానాపూర్‌ నియోజకవర్గంలో 115 మొత్తం 3381 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరయ్యాయి. ఇందు లో ఇప్పటి వరకు కేవలం 478 డబుల్‌బెడ్‌రూం ఇండ్లే పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. మరికొన్ని ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కనిపిస్తున్నాయి. సకాలంలో బిల్లులు అందక పోవడంతో పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదని ప్రతిపక్ష పార్టీలు ఎద్దేవ చేస్తుంటే అధికార పార్టీ నేతలు మాత్రం అదే నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి, నూతన సంవత్సరం కానుకగా పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అందిస్తామని పలుమార్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించినా క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి.

పేదల ఇళ్లపై పట్టింపేది..?

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆరే పలుమార్లు ప్రకటించారు. అయినా పేదల ఇళ్లపై చిత్తశుద్ధి కనిపించడం లేదు. రెండేళ్ల క్రితం దరఖాస్తులను స్వీకరించిన అధికారులు అర్హుల జాబితా ను గుర్తించడం లేదు. గతంలోనే పదివేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు 500 లోపే ఇండ్ల నిర్మా ణాలు పూర్తి కావడంతో ఇప్పటికప్పుడే కేటాయిస్తే ఇబ్బందులు తప్పవనే భావనతో నేతలు కనిపిస్తున్నారు. ఎవరు అడుగకుండానే గ్రామాల్లో క్లస్టర్ల వారీగా రైతు వేదికలను మంజూరు చేసిన ప్రభుత్వం వాటి నిర్మాణాలను ఆగమేఘాల మీద పూర్తి చేయించింది. జిల్లా వ్యాప్తగా 101 వేదిక పనులను పూర్తిచేసి ప్రా రంభిస్తున్నారు. కానీ పేదల కోసం కేటాయించిన వేల ఇండ్లు పునాదుల దశల్లోనే కనిపిస్తున్నాయి.

ప్రారంభానికి ముందే పగుళ్లు..

నాలుగేళ్లుగా జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్‌ పట్టణంతో పాటు మావల, తాంసి, బోథ్‌,ఉట్నూర్‌ మం డలాల్లో 478 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. కాని ఇందులో తాంసి, బోథ్‌ మండలాల్లో 150 ఇళ్లను మాత్రమే అందించారు. మిగతా 300 పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా రెండేళ్లుగా కేటాయింపులు లేక పోవడంతో ప్రారంభానికి ముందే పగుళ్లు తేలి కనిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితమే నిర్మాణం పనులు పూర్తయినా రంగులు వేయకుండా వదిలేయడంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఆదిలాబాద్‌ నియోజక వర్గంలో 277, బోథ్‌ నియోజక వర్గంలో 147, ఖానాపూర్‌ నియోజక వర్గంలో 54 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారులకు కేటాయించడం లేదు.

యథేచ్ఛగా కబ్జా..

ఇళ్ల కేటాయింపుల్లో జాప్యం జరగడంతో ఎదురు చూసే ఓపిక లేక కొందరు లబ్ధిదారులు యథేచ్ఛ గా కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే జైనథ్‌, మావల, ఉట్నూర్‌ మండలాల్లో లబ్ధిదారులు అనధికారికంగా గృహప్రవేశాలు చేసి నివాసం ఉంటున్నారు. జైనథ్‌, మావల మండలాల్లో కొందరు స్థానిక నేతలు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఇప్పిస్తామని ముందస్తుగా లబ్ధిదారుల నుం చి అందినకాడికి దండుకోవడంతో అమాయకులైన నిరుపేదలు స్థానిక నేతలను నిత్యం ప్రశ్నిస్తున్నారు.   

రెవెన్యూ అధికారులే ఎంపిక చేయాలి..

: బసవేశ్వర్‌,డబుల్‌ బెడ్‌ రూం జిల్లా నోడల్‌ అధికారి

జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత రెవెన్యూ అధికారులదే. ఇప్పటికే పూర్తయిన 478 ఇళ్ల జాబితాను రెవెన్యూ అధికారులకు అందించాం. మిగతా ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. త్వరలోనే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. బిల్లుల చెల్లింపుల్లో కొంత జాప్యం జరుగుతున్న పనులు పూర్తికాగానే పూర్తి స్థాయిలో బిల్లుల చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నాం. నాణ్యత, పర్యవేక్షణ బాధ్యత ఆర్‌అండ్‌బీ, పంచాయతీ అధికారులే చూసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - 2021-02-27T04:50:52+05:30 IST