సారాజ్యం

ABN , First Publish Date - 2021-07-31T05:26:42+05:30 IST

ప్రభుత్వం చేతిలోకి మద్యం వెళ్లింది. ధరలు మండిపోతున్నాయి. చచ్చీచెడీ పనులు చేసి సంపాదించిన మొత్తం మందుకు వెచ్చించినా నాణ్యమైన మద్యం లభించడంలేదని.. మందుబాబులు కాపుసారా వైపు మళ్ళారు.

సారాజ్యం
గుత్తికొండ అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీ కేంద్రం (పాతచిత్రం)

ప్యాకిట్లు కాదు.. బాటిళ్లలో   

నాటుసారా గతంలో ప్యాకిట్లలో ఉత్పత్తి చేసేవారు. అయితే రవాణా కష్టంగా ఉందని తయారీదారులు రూటుమార్చి కొత్తతరహాలో వాటర్‌ బాటిల్లో నింపేసి గుట్టుగా తరలించేస్తున్నారు. సారాను లీటర్‌, అర లీటర్‌ బాటిళ్లలో తరలిస్తున్నారు. పెద్దమొత్తంలో ఆర్డర్లు వచ్చినప్పుడు సారాను 20 లీటర్ల వాటర్‌  క్యాన్లలో నింపి గుట్టుగా రావాణా చేస్తున్నారు. ఇలా వేలాది లీటర్ల నాటుసారా జిల్లావ్యాప్తంగా ఎక్కడకి కావాలంటే అక్కడకు తరలిపోతోంది. 

 

నాటుగా కాదు.. నీటుగా

గతంలో ఊరి వెలుపల తోపుల్లో, పొలాల్లో రహస్యంగా కాపు సారా కాసేవారు. ఇందుకు కుండలు, కట్టెలను వినియోగించేవారు. పాత విధానాలకు స్వస్తి చెప్పి సాంకేతికతను వినియోగిస్తున్నారు. కట్టెలకు బదులు గ్యాస్‌ సిలిండర్‌ను, మట్టి కుండల స్థానంలో మెటల్‌ పాత్రలను వినియోగిస్తున్నారు. గ్యాస్‌ వినియోగించడంతో తక్కువ సమయంలో, ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నారు. ఏదైనా శుభ, అశుభకార్యక్రమం ఉందంటే తయారీదారులకు పండుగే. 



గ్రామాల్లో కుటీర పరిశ్రమ

విచ్చలవిడిగా సారా తయారీ

ఏరులై పారుతున్న నాటుసారా

అధికార పార్టీ అండతో యథేచ్ఛగా..

బట్టీల నిర్వాహకులపై నామమాత్రపు కేసులు



సారా.. తయారీ, అమ్మకం నిషేధం. అయినా సా.. రాజ్యంలో ఇవేవి పట్టవు. యథేచ్ఛగా సారా తయారీ.. అమ్మకం జరుగుతున్నాయి. పోలీసుల దాడులు.. కేసులు లెక్క చేయడంలేదు. అధిక ధరలతో ప్రభుత్వ మద్యాన్ని కొని మందుబాబులు తాగలేక పోతున్నారు. ఇదే అవకాశంగా నాటు సారాకు రెక్కలొచ్చాయి. గతంలో ఎక్కడో మారుమూల రహస్యంగా ఎప్పుడో ఒకసారి బట్టీలను ఏర్పాటు చేసి నాటుసారా కాసేవారు. అయితే ప్రస్తుతం సారాకు డిమాండ్‌ అధికంగా ఉండటంతో తయారీ కేంద్రాలకు పలు గ్రామాలు అడ్డాగా మారాయి. కొన్ని గ్రామాల్లో అయితే 50కి పైగా కేంద్రాలు ఉన్నాయంటే తయారీ ఏ స్థాయిలో జరుగుతుందో తెలుసుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో సారా తయారీ ఓ కుటీర పరిశ్రమగా మారింది. ఉపాధితోపాటు రూ.లక్షలు తెచ్చిపెడుతుండటంతో ఎక్కువమంది దీని తయారీవైపు వెళ్తున్నారు. తయారీదారులకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో పోలీసులు, సెబ్‌ అధికారులు తూతూమంత్రంగా దాడులు, కేసులకు పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. సారాతో.. తయారీదారులు, వారికి అండగా ఉంటోన్న అధికార పార్టీ నేతలు, అడ్డుకోవాల్సిన అధికారులు రూ.లక్షలు సంపాదిస్తుండగా.. తాగిన వారు రోగాల బారిన పడుతున్నారు. 


       

(నరసరావుపేట, పిడుగురాళ్ల, రేపల్లె)

ప్రభుత్వం చేతిలోకి మద్యం వెళ్లింది. ధరలు మండిపోతున్నాయి. చచ్చీచెడీ పనులు చేసి సంపాదించిన మొత్తం మందుకు వెచ్చించినా నాణ్యమైన మద్యం లభించడంలేదని.. మందుబాబులు కాపుసారా వైపు మళ్ళారు. ఇదే అవకాశంగా జిల్లాలోని పలు గ్రామాల్లో నాటుసారా కుటీర పరిశ్రమలా విరాజిల్లుతోంది. తక్కువ పెట్టుబడి.. కొంచెం రిస్క్‌.. ఎక్కువ లాభాలు ఉండటంతో ఎక్కువ మంది నాటు సారీ తయారీ వైపు మొగ్గుచూపుతున్నారు. పనులు లేక కొందరు.. ఉన్నా చాలీచాలనీ కూలీలు వస్తుండటంతో మరికొందరు.. సారా తయారీ, రవాణా, అమ్మకం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు, సెబ్‌ అధికారుల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా అధికార పార్టీ నేతలకు అడిగినంత ముట్టజెబుతున్నారు. దీంతో పోలీసులు, సెబ్‌ అధికారులు తూతూమంత్రంగా దాడులు.. నామమాత్రపు కేసులతో సరిపెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సారా తయారు చేస్తున్న ఫిర్యాదులు వస్తున్నా వారికి అధికార పార్టీ అండ ఉండటంతో అధికారులు దాడులు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. మరికొందరు అధికారులు ఇదే అవకాశంగా తయారీదారుల నుంచి ముడుపులు తీసుకుంటూ ఉదాశీనంగా ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  ఎవరైనా నాటుసారా తయారీ, అమ్మకం చేస్తూ పట్టుబడితే అధికార పార్టీ నేతలు సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చి విడిపించే వరకు ఊరుకోవడంలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.


ప్రాణాలతో చెలగాటం

 సారా తయారీదారులు మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నాటు సారా వల్ల లివర్‌ తొందరగా పాడైపోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా పోతే ప్రజల ప్రాణాలే కదా మాకు వచ్చేవి వస్తున్నాయి కదా అన్న ధోరణిలో అటు తయారీదారులు.. ఇటు అధికారులు ఉన్నారు. సారా తయారీకి అలవాటు పడిన కుటుంబాలు ఇంకోపని చేయడానికి ఇష్టపడటంలేదు. ఒకరోజు కష్టపడి నాటుసారా తయారు చేస్తే  నెలకు సరిపడా సంపాదించుకోవచ్చని సారా వైపే మొగ్గుచూపుతున్నారు. పలు గ్రామాల్లో సారా తయారీ విచ్చలవిడిగా జరుగుతున్నా అధికారులు నామమాత్రపు దాడులకే పరిమితమవుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా తయారీదారులు, అమ్మకందారులను పట్టుకున్నా నామమాత్రపు కేసులతో  సరిపెడుతున్నారు. ఒకరిద్దరిపై నెట్టేసి మిగిలిన వారు యఽథాప్రకారం సారా కాస్తూనే ఉన్నారు. పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినా మరలా అదే వృత్తిని కొనసాగిస్తున్నారు. 


గుత్తికొండ కేరాఫ్‌ నాటుసారా 

పల్నాడు ప్రాంతం నాటుసారా తయారీ కేంద్రాలకు నెలవుగా మారింది. కృష్ణానది పరివాహక ప్రాంతమైన మాచవరం, దాచేపల్లి, గురజాల మండలాల పరిధిలోని కొన్ని గ్రామాల్లో నాటుసారా గుప్పుమంటుంది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ సమీపమంతా నల్లమల అటవీ ప్రాంతం కావడంతో  పెద్దఎత్తున నాటు సారా తయారు చేస్తున్నారు.  పోలీసులు, సెబ్‌ అధికారులు వారంలో మూడు రోజులు గుత్తికొండ అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో పెద్దఎత్తున  బెల్లం ఊట పట్టుబడుతుందంటే ఇక్కడ ఏ స్థాయిలో తయారీ అవుతుందో తెలుసుకోవచ్చు. గుత్తికొండ అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీదారులకు, అమ్మకందారులకు అధికార పార్టీ నేతల అండ పుష్కలంగా ఉండటంతో పోలీసులు పట్టుకున్నా నామమాత్రపు కేసులతో ఒకరిద్దరిపై నెట్టేసి మిగిలిన వారు యధాప్రకారం సారా కాస్తూనే ఉంటారు. పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినా మరలా అదే వృత్తిని కొనసాగించేవాళ్లు గుత్తికొండలో పుష్కలంగా ఉన్నారు. గుత్తికొండలోనే సుమారు 50 మందికిపైగా నాటుసారా తయారు చేసే వారు ఉన్నారు. గుత్తికొండ, జూలకల్లు, జానపాడుతోపాటు పట్టణ ప్రాంతంలో కూడా నాటుసారా చొరబడింది. పల్నాడులో ఏదైనా శుభ, అశుభ కార్యక్రమం ఉందంటే అక్కడ నాటుసారా గుప్పుమంటుంది. తెలంగాణ ప్రాంతం నుంచి పడవల్లో నాటుసారా తరలించేందుకు ప్రత్యేకంగా ముఠాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కాదు. 

   

కాపు సారా ఖిల్లా పమిడిపాడు

నరసరావుపేట మండలంలోని పమిడిపాడు గ్రామం కాపు సారా తయారీకి ఖిల్లాగా మారింది. రోజుకు వేల లీటర్ల సారా పమిడిపాడులో తయారు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో సారా తయారీ అడ్డంకి లేకుండా పోతుందని ఆరోపణలున్నాయి. ఇక్కడ 50 వరకు తయారీ కేంద్రాలు ఉన్నట్టు సమాచారం. గ్రామంలో బహిరంగంగానే సారా తయారవుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడరని తెలుస్తుంది. లీటరు సారా రూ.200కు విక్రయిస్తున్నారు. ఆర్డర్లపై జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి సరఫరా అవుతున్నది. రోజూ వేల లీటర్లలో సారా ఉత్పత్తి చేస్తున్నా చర్యలు నామామాత్రంగా కూడా లేవు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చిన సందర్భంలో మొక్కుబడిగా తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులుపుకొంటున్నారు. నరసరావుపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగానే సారా విక్రయాలు జరుగుతున్నాయి.  ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతాల్లో విక్రయాలు అధికంగా ఉంటున్నాయి. పమిడిపాడులో సారా తయారీని అరికట్టేందు చర్యలు తీసుకుంటామని, గ్రామంలో తనిఖీలు చేస్తామని ఎక్సైజ్‌ ఎస్‌ఐ కె.సురేంద్రబాబు చెప్పారు. 


తీరంలో కుటీర పరిశ్రమగా

తీరంలోని రేపల్లె రూరల్‌, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి మండలాలు నాటుసారా తయారీకి అడ్డాగా ఉన్నాయి. నిజాంపట్నం, నగరం మండలాలలో కొన్ని గ్రామాలలో కుటీర పరిశ్రమలా ఉంది. నిజాంపట్నం మండలం దిండి పంచాయతీలోని ఏడు గ్రామాలు, కొత్తపాలెం, కళ్ళిఫలం తదితర గ్రామాల్లోని చిళ్ళ అడవుల్లో నాటుసారా తయారీ కేంద్రాలు ఉన్నాయి. నాటుసారా బాటిల్‌ రూ.500 వరకు, బరాయి అయితే రూ.1000 వరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. ద్విచక్రవాహనాలపై తీసుకువచ్చి గ్రామాల్లో విక్రయిస్తున్నారు. నాటుసారా తయారీదారులకు అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం.  సారా తయారీదారులను పట్టుకుని కేసులు నమోదు చేస్తే వెంటనే నాయకుల నుంచి ఫోన్లు వస్తాయనే ఆరోపణలున్నాయి. సీజ్‌ చేసిన గ్యాస్‌ సిలెండర్లు, పొయ్యిలను సిబ్బంది అమ్ముకుంటున్నారని సమాచారం. నిజాంపట్నం మండలం హారీస్‌పేటలో మూతపడిన  మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో నాటుసారా తయారు చేస్తున్నారనే విషయం బయటకు రావటంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంనుంచి ఇతర జిల్లాలకు నాటుసారా తరలిపోతున్నదనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. 






 




Updated Date - 2021-07-31T05:26:42+05:30 IST