అవాంఛిత రోమాలకు సహజసిద్ధంగా చెక్‌!

ABN , First Publish Date - 2021-08-02T05:30:00+05:30 IST

అవాంఛిత రోమాలు ముఖారవిందాన్ని దెబ్బతీస్తాయి. వాటిని తొలగించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

అవాంఛిత రోమాలకు సహజసిద్ధంగా చెక్‌!

వాంఛిత రోమాలు ముఖారవిందాన్ని దెబ్బతీస్తాయి. వాటిని తొలగించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇంట్లో లభించే తేనె, పంచదార, పసుపు వంటి పదార్థాలతో అవాంఛిత రోమాల సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.


అవాంఛిత రోమాల సమస్యకు తేనె, పంచదార చక్కగా పనిచేస్తాయి. పంచదార చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. అదే సమయంలో తేనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చిన్న బౌల్‌లో ఒక టేబుల్‌స్పూన్‌ తేనె, రెండు టేబుల్‌స్పూన్ల పంచదార, ఒక టేబుల్‌స్పూన్‌ నీళ్లు వేయాలి. ఈ బౌల్‌ను 30 సెకన్ల పాటు మైక్రోఓవెన్‌లో పెట్టాలి. ఈ పేస్టును అవాంఛిత రోమాలు ఉన్న చోట రాయాలి. తరువాత పేస్టుపై ఒక కాటన్‌ క్లాత్‌ పెట్టాలి. కాసేపయ్యాక రోమాలు పెరిగే దిశకు వ్యతిరేక దిశలో క్లాత్‌ను వేగంగా తీసేయాలి.

 

ఒక బౌల్‌లో రెండు టేబుల్‌స్పూన్ల శనగపిండి, రెండు టేబుల్‌స్పూన్ల రోజ్‌ వాటర్‌, ఒక టేబుల్‌స్పూన్‌ నిమ్మరసం వేసి కలపాలి. ఈ పేస్టును ముఖంపై అప్లై చేసి ఆరనివ్వాలి. తరువాత చేతివేళ్లతో రబ్‌ చేస్తూ తొలగించాలి. వారంలో మూడునాలుగు సార్లు ఇలా చేస్తే అవాంఛిత రోమాల సమస్య తొలగిపోతుంది.


కోడిగుడ్డు తెల్లసొన మృతకణాలను తొలగిస్తుంది. దీనికి కార్న్‌స్టార్చ్‌ను కలిపితే అవాంఛిత రోమాల సమస్య దూరమవుతుంది. ఒక కోడిగుడ్డు తెల్లసొన భాగం తీసుకుని, అందులో ఒక అర టేబుల్‌స్పూన్‌ కార్న్‌ స్టార్చ్‌, ఒక టేబుల్‌స్పూన్‌ పంచదార వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై ఒక లేయర్‌లా వేసి పూర్తిగా ఆరనివ్వాలి. తరువాత వెంట్రుకలు పెరిగే దిశకు వ్యతిరేక దిశలో లేయర్‌ను లాగుతూ తీయాలి. 


బొప్పాయిలో పాపైన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. అవాంఛిత రోమాలు తొలగించేందుకు ఈ ఎంజైమ్‌ సహాయపడుతుంది. అలాగే పసుపు చర్మసౌందర్యాన్ని పెంపొందిస్తుంది. బొప్పొయి ముక్కలను గుజ్జుగా చేసి అర టీస్పూన్‌ పసుపు వేసి కలపాలి. ఈ పేస్టును అవాంఛిత రోమాలు పెరిగే  చోట రాయాలి. కొన్ని నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి. ఇరవై నిమిషాలు వదిలేసి గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


అవాంఛిత రోమాలను సహజసిద్ధమైన పద్దతుల్లో తొలగించుకోవడానికి ఓట్స్‌, అరటిపండు బాగా ఉపయోగపడతాయి. ఒక పాత్రలో రెండు టేబుల్‌స్పూన్ల ఓట్స్‌ తీసుకుని అందులో ఒక అరటిపండును గుజ్జుగా చేసి వేయాలి. ఆ మిశ్రమాన్ని కలిపి పేస్టులా చేసి మర్దన చేస్తున్నట్టుగా ముఖంపై రాయాలి. పావుగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.


ఒకబౌల్‌లో రెండు టేబుల్‌స్పూన్ల పంచదార తీసుకుని అందులో అర టీస్పూన్‌ నిమ్మరసం, కొద్దిగా నీళ్లు వేసి పేస్టులా చేయాలి. అవాంఛిత రోమాలున్న చోట ఈ పేస్టును లేయర్‌లా అప్లై చేయాలి. పావుగంట తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. అవాంఛిత రోమాల సమస్యకు ప్రాచీనకాలం నుంచి ఉపయోగిస్తున్న చిట్కా ఇది.

Updated Date - 2021-08-02T05:30:00+05:30 IST